భూ రీ-సర్వేతో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం
- జిల్లా కలెక్టర్ అంకిత్
- సీతాయిగూడెంలో భూ రీ-సర్వే పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన కలెక్టర్
- గిరిజనులతో మాట్లాడి రీ-సర్వే ద్వారా కలిగే ప్రయోజనాలను తెలుసుకున్న కలెక్టర్
చండ్రుగొండ, సెప్టెంబర్ 10, (విజయక్రాంతి): భూ సమస్యల(Land issues) పరిష్కారానికి భూ రీ సర్వే ఒకటే మార్గం అని ఆ దిశలోనే రాష్ట్ర ప్రభుత్వం పయనిస్తుందని కలెక్టర్ అంకిత్ అన్నారు. చండ్రుగొండ మండలం(Chandrugonda Mandal) సీతాయిగూడెం గ్రామంలో కొనసాగుతున్న భూ రీ-సర్వే ప్రక్రియ(Land Re-survey Process)ను ఆయన గురువారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. గ్రామంలో జరుగుతున్న సర్వే పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్న ఆయన, సర్వే ప్రక్రియను వేగవంతంగా, పూర్తి ఖచ్చితత్వం తో చేపట్టాలని ఆదేశించారు.
గ్రామ పరిధిలో మొత్తం 1,823 ఎకరాలకు భూ రీ-సర్వే నిర్వహించాల్సి ఉండగా, ప్రస్తుతం గ్రామ సరిహద్దుల నిర్ధారణతో పాటు భూముల వివరాల పరిశీలన కొనసాగుతున్నట్లు అధికారులు కలెక్టర్కు వివరించారు. ఇటీవల గ్రామ సభను కూడా నిర్వహించామని, అన్ని శాఖల సమన్వయంతో రీ-సర్వే ప్రక్రియను చేపడుతున్నామని తెలిపారు. గ్రామంలో సుమారు 200 వరకు నివాసాలు ఉన్నట్లు అధికారులు వివరించగా, భూమి ఉన్నప్పటికీ పట్టాదారు పాస్బుక్లు లేని వారు, పాస్బుక్లు ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో భూమి వివరాలు సరిపోని వారు, రికార్డుల్లో భూముల వివరాలు నమోదు కాని సందర్భాలు కూడా ఉన్నట్లు తెలిపారు.
భూ రీ-సర్వే పూర్తయిన అనంతరం క్షేత్రస్థాయిలో భూముల వాస్తవ పరిస్థితిని గుర్తించి, రికార్డుల్లో అవసరమైన సవరణలు చేయడంతో పాటు అర్హులైన భూ హక్కుదారులకు పాస్బుక్ లు పొందే అవకాశం కలుగుతుందని అధికారులు వివరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అంకిత్ గ్రామంలోని గిరిజనులతో నేరుగా మాట్లాడి భూ రీ-సర్వే వల్ల వారికి కలిగే ప్రయోజనాలను అడిగి తెలుసుకున్నారు. రీ-సర్వే ప్రక్రియ గిరిజన రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని వారు కలెక్టర్కు తెలిపారు.
గతంలో ఆర్థిక ఇబ్బందుల కారణంగా భూములకు సంబంధించిన రికార్డుల సవరణలు, ఇతర ప్రక్రియలు పూర్తి చేసుకోలేక పోయిన వారికి ప్రస్తుత రీ-సర్వే ప్రక్రియ ద్వారా మేలు జరుగుతుందని చెప్పారు. పాత భూ రికార్డులను పరిశీలించి, క్షేత్రస్థాయిలో ఉన్న భూములను గుర్తించడం ద్వారా తమ భూ హక్కులకు మరింత స్పష్టత లభిస్తుందని గిరిజనులు పేర్కొన్నారు. గ్రామ పరిధిలో అటవీ భూములు కూడా గణనీయంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు.
పెద్దగూడెం ఫారెస్ట్ బ్లాక్ పరిధిలో సుమారు 5,000 హెక్టార్ల అటవీ ప్రాంతం ఉండగా, సీతాయిగూడెం గ్రామ పరిధిలో సుమారు 700 నుంచి 800 ఎకరాల వరకు అటవీ భూమి ఉన్నట్లు తెలిపారు. ఈ ప్రాంతం రామవరం, చండ్రుగొండ తదితర అటవీరేంజ్ల పరిధిలో ఉన్నట్లు అధికారులు వివరించారు. కలెక్టర్ పాత భూ రికార్డులు, మ్యాప్లను పరిశీలించారు. సుమారు 1920ల నాటి పాత మ్యాప్లు, రికార్డులను పరిశీలిస్తూ అప్పటి భూముల హద్దులు, చెట్లు, కుంటలు, చెరువులు, తోటలు తదితర వివరాలను నమోదు చేసిన విధానాన్ని అధికారులను అడిగి తెలుసుకున్నారు.
అప్పట్లో ఏర్పాటు చేసిన భూ హద్దు రాళ్లు ప్రస్తుతం చాలా ప్రాంతాల్లో కనిపించడం లేదని అధికారులు వివరించగా, భూ రీ-సర్వేలో హద్దులను స్పష్టంగా నిర్ధారించి, భవిష్యత్లో కూడా సులభంగా గుర్తించే విధంగా శాశ్వత హద్దు గుర్తులను ఏర్పాటు చేయాలని కలెక్టర్ సూచించారు. ఈ పరిశీలనలో కలెక్టర్ వెంట తాసిల్దార్ జగదీశ్వర ప్రసాద్, సర్వే అధికారులు, అటవి శాఖ అధికారులు సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.