లాలూకు ఎదురుదెబ్బ
- మనీలాండరింగ్ కేసులో 9 మందిపై అభియోగాలు నమోదు చేయండి
ఈడీని ఆదేశించిన రౌజ్ అవెన్యూ కోర్టు
నిర్దోషులుగా మరో ఏడుగురు నిందితులు
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 10: ఐఆర్‌సీటీసీ కుంభకోణం మనీలాండరింగ్ కేసులో బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ (Former Chief Minister of Bihar Lalu Prasad) కుటుంబానికి ఎదురుదెబ్బ తగిలింది. గురువారం విచారణకు వచ్చిన ఈ కేసులో 9 మందిపై అభియోగాలు నమోదు చేయాలని ఢిల్లీలోని రౌజ్ అవె న్యూ కోర్టు ఈడీని ఆదేశించింది. ఈ కేసులో మరో ఏడుగురు నిందితులను కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. ఈ కేసులో 16మందిపై ఈడీ చార్జీషీట్ దాఖలు చేసింది.
లాలూ ప్రసాద్ యాదవ్, రబ్రీదేవి, తేజస్వియాదవ్, ప్రేమ్ చంద్‌గుప్తా, గౌరవ్‌గుప్తా, నాథ్ మల్ కక్రానియా, రాహుల్ యాదవ్, విజయ్ త్రిపాఠి, దేవకీనందన్‌పై మోపిన అభియోగాలపై తదుపరి విచారణను అక్టోబర్ 3కు వాయిదా వేసింది. లాలూ ప్రసాద్ రైల్వే మంత్రిగా ఉన్నప్పుడు నిబంధనలకు విరుద్ధంగా రాంచీ, పూరీలోని రెండు హోటళ్ల టెండర్లలో అవకతవకలు, ప్రైవేట్ సంస్థలకు భూముల అప్పగింతపై ఈడీ దర్యాప్తు అనంతరం కోర్టులో చార్జీషీట్ దాఖలుచేసింది.
2005 మధ్య ఐఆర్‌సీటీసీ రెండు హోటళ్ల కాంట్రాక్టులకు బదులుగా లాలూప్రసాద్ 3 ఎకరాలు పొందారు. 2010 మధ్య ఆయన కుటుంబ సభ్యులకు చెందిన సంస్థకు భూములు బదలాయించారు. 2017 సీబీఐ కేసు చేసింది. 9 ప్రాంతాల్లో సోదాలు చేసి, కీలకపత్రాలను స్వాధీనం చేసుకుంది. 2018 లాలూప్రసాద్, రబ్రీదేవి, తేజస్విపై సీబీఐ చార్జీషీట్ దాఖలు చేసింది. సీబీఐ కేసు ఆధారంగా ఈడీ కేసు నమోదు చేసింది.