సర్పంచుల సమస్యలు పరిష్కరించాలంటూ సీతక్కకు వినతి

12-09-2026 | 10:29pm

సర్పంచ్–ఉప సర్పంచ్‌ల జాయింట్ చెక్ పవర్ రద్దు చేయాలి

గ్రామాల అభివృద్ధికి అడ్డంకిగా ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలి

దోమకొండ(విజయక్రాంతి): గ్రామాల్లో సర్పంచులు ఎదుర్కొంటున్న ఆర్థిక, పరిపాలనా సమస్యలను తక్షణమే పరిష్కరించి గ్రామాల అభివృద్ధికి ఆటంకాలు లేకుండా చూడాలని తెలంగాణ రాష్ట్ర పంచాయతీ సర్పంచుల సంఘం(Telangana State Panchayat Sarpanch Association) ప్రభుత్వాన్ని కోరింది. ఈ మేరకు రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క(Minister Seethakka)కు సర్పంచుల సమస్యలపై వినతిపత్రం అందజేశారు. గ్రామాల్లో సర్పంచులు ఎదుర్కొంటున్న సమస్యలు, వాటి కారణంగా అభివృద్ధి పనులకు కలుగుతున్న ఇబ్బందులపై సంఘం ప్రతినిధులు చర్చించారు.

ముఖ్యంగా సర్పంచ్, ఉప సర్పంచ్‌లకు ఉన్న జాయింట్ చెక్ పవర్‌ను రద్దు చేసి, గ్రామపంచాయతీ ఆర్థిక వ్యవహారాల్లో(Gram Panchayat Financial Affairs) సర్పంచ్‌కు స్పష్టమైన అధికారాలు కల్పించాలని కోరారు. రాజకీయ విభేదాల కారణంగా అభివృద్ధి పనులు నిలిచిపోకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. గ్రామపంచాయతీ జనరల్ ఫండ్‌ను పంచాయతీ అవసరాలకు వినియోగించుకునేలా సర్పంచ్‌కు అధికారాలు కల్పించాలని, సర్పంచ్‌ల గౌరవ వేతనాన్ని ప్రస్తుత రూ.6,500 నుంచి రూ.25 వేలకు పెంచాలని డిమాండ్ చేశారు.

గ్రామపంచాయతీల కరెంట్ బిల్లులను ప్రభుత్వం నేరుగా చెల్లించాలని కోరారు.అలాగే గ్రామపంచాయతీ పరిధిలో గృహ నిర్మాణ అనుమతులు, పరిశ్రమల అనుమతులు, లేఅవుట్ అనుమతులు తదితర విషయాల్లో సర్పంచ్‌కు అధికారాలు కల్పించాలని సూచించారు. గ్రామపంచాయతీ పరిధిలోని భూముల రిజిస్ట్రేషన్ ఫీజులో 50 శాతం నిధులను గతంలో మాదిరిగా గ్రామపంచాయతీ ఖాతాలో నేరుగా జమ చేయాలని కోరారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో సర్పంచ్‌లకు ఓటు హక్కు కల్పించాలని, కొత్త పాలకవర్గం ఏర్పడిన సమయంలో గ్రామాల అభివృద్ధి కోసం గ్రామపంచాయతీలకు రూ.10 లక్షలు నేరుగా ఖాతాల్లో జమ చేస్తామన్న ముఖ్యమంత్రి హామీని అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు.

15వ ఆర్థిక సంఘం నిధులు, పల్లె ప్రగతి పనులపై సర్పంచ్‌లకు పూర్తి అధికారం కల్పించాలని, ఆ నిధుల వినియోగానికి సంబంధించిన టైడ్, అన్‌టైడ్ నిబంధనలను తొలగించాలని కోరారు. 73వ, 74వ రాజ్యాంగ సవరణలలోని 243వ ఆర్టికల్ పరిధిలో పేర్కొన్న 29 అంశాలను గ్రామపంచాయతీలకు బదలాయించి పూర్తి అధికారాలు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. గ్రామాల అభివృద్ధిలో సర్పంచ్‌ల పాత్ర కీలకమని, వారికి తగిన ఆర్థిక, పరిపాలనా అధికారాలు కల్పిస్తే గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి పనులు మరింత వేగంగా పూర్తవుతాయని సర్పంచుల సంఘం ప్రతినిధులు పేర్కొన్నారు.

ప్రభుత్వం తమ డిమాండ్లను సానుకూలంగా పరిశీలించి వెంటనే పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర పంచాయతీ సర్పంచుల సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు సౌధని భూమన్న యాదవ్, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రాఘవేందర్ రెడ్డి, రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ భీమిడి ప్రదీప్ జీ, రాష్ట్ర పంచాయతీ సర్పంచుల ఫోరం ప్రధాన కార్యదర్శి లోయపల్లి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు