బ్లాక్ మార్కెట్‌లో పెట్రోల్, డీజిల్
పెట్రోల్ పంపుల్లో నో స్టాక్
విచ్చలవిడిగా బయట అమ్మకాలు
మహబూబాబాద్, ఏప్రిల్ 30 (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లాలో పెట్రోల్, డీజిల్ బ్లాక్ మార్కెట్ దందా జోరుగా సాగుతున్నట్టు విమర్శలు వస్తున్నాయి. ఓవైపు పెట్రోల్ పంపుల్లో డీజిల్, పెట్రోల్ కోసం వాహనదారులు, రైతులు గంటల తరబడి పడిగాపులు పడుతుండగా, కొందరు వందల లీటర్ల పెట్రోల్ డీజిల్ ను క్యాన్లలోకి నింపుకొని అధిక ధరలకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నట్లు విమర్శలు వస్తున్నాయి.
అధికారులు ఓవైపు జిల్లాలో ఎక్కడ కూడా పెట్రోల్, డీజిల్ కొరతలేదని ప్రకటిస్తుండగా, ఇంకోవైపు అనేక పెట్రోల్ పంపుల్లో డీజిల్, పెట్రోల్ నో స్టాక్ అంటూ బోర్డులతో దర్శనమిస్తున్నాయి. అధికారుల ప్రకటనకు క్షేత్రస్థాయిలో అమలకు ఏమాత్రం పొంతన లేకుండా పోతుందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లావ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ పంపుల్లోకి ఇలా స్టాక్ వచ్చిందో లేదో.. కొద్దిసేపట్లోనే ఖాళీ అవుతోంది. దీనితో ఒకరోజు పెట్రోల్ పంపు పనిచేస్తే రెండు మూడు రోజులు మూతపడుతుందని, పెట్రోల్ , డీజిల్ బాహాటంగా రోడ్లపై ఎక్కడపడితే అక్కడ విక్రయిస్తున్నారని వారికి ఎక్కడ నుండి వందల లీటర్ల పెట్రోల్, డీజిల్ వస్తుందని ప్రశ్నిస్తున్నారు.
అధికార యంత్రాంగం వాహనాల్లో తప్ప క్యాన్లలో పెట్రోల్, డీజిల్ పోయొద్దని పెట్రోల్ పంపులు యజమానులకు ఆదేశాలు ఇచ్చినప్పటికీ అమలు చేయడం లేదని, కొందరు ఇస్టా రాజ్యంగా వ్యవహరిస్తూ పెట్రోల్, డీజిల్ క్యాన్లలో పోస్తున్నట్లు విమర్శలు వస్తున్నాయి. దీనితో పెట్రోల్, డీజిల్ బాహాటంగా నల్ల బజారుకు తరలిస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పెట్రోల్, డీజిల్ కొరతకు ప్రధానంగా బ్లాక్ మార్కెట్ దందా మారుతుందని, అయినప్పటికీ నిఘా పెట్టాల్సిన అధికారులు పెద్దగా పట్టించుకోవడంలేదనే విమర్శలు వెళ్ళు వెళుతున్నాయి.
బ్లాక్ మార్కెట్ దందా జిల్లా వ్యాప్తంగా విచ్చలవిడిగా సాగుతుందని, పెట్రోల్, డీజిల్ ధరలను ఇష్టానుసారంగా కొనుగోలు చేసిన లీటర్ పెట్రోల్, డీజిల్ కు అదనంగా 50 రూపాయల చొప్పున పెంచి అమ్ముకుంటూ వినియోగదారుల జేబులకు చిల్లులు పెడుతున్నట్లు విమర్శలు వస్తున్నాయి. క్షేత్రస్థాయిలో అక్రమ దందాను అరికట్టాల్సిన పోలీస్, రెవెన్యూ, సివిల్ సప్లై, తూనికలు కొలతలు, ఇతర శాఖల అధికారులు అక్రమ దందా వైపు కనీసం కన్నెత్తి చూడడం లేదనే విమర్శలు వస్తున్నాయి. దీనితో పెట్రోల్ పంపుల్లో స్టాక్ ఇలా వచ్చిందో లేదో కొద్దిసేపటికి నల్ల బజారుకు తరలుతోందని ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి కృత్రిమ కొరతకు కారణమైన బ్లాక్ మార్కెట్ దందాను అరికట్టాలని ప్రజలు, రైతులు, వాహనదారులు కోరుతున్నారు.
అగ్ని ప్రమాదాలకు హేతువు
నిబంధనలకు విరుద్ధంగా పెట్రోల్, డీజిల్ పెద్ద మొత్తంలో నిల్వ చేయడం వల్ల అగ్ని ప్రమాదాలకు హేతువుగా మారే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. జరగకూ డని ప్రమాదం జరిగితే నిలువచేసిన పెట్రో ల్, డీజిల్ వల్ల అగ్నిప్రమాద తీవ్రత పెరిగిపోయి పరిసర గృహాలు, ఇతరులకు కూడా పెను ప్రమాదం తప్పదని హెచ్చరిస్తున్నారు. పెద్ద ఎత్తున పెట్రోల్, డీజిల్ స్టాక్ చేయడం వల్ల వేసవిలో ఎండల తీవ్రత కారణంగా ప్రమాదం పొంచి ఉందని, ఎవరు కూడా క్యాన్లు, ఇతర పాత్రల్లో పెట్రోల్, డీజిల్ నిల్వ చేయకూడదని హెచ్చరిస్తున్నారు.






