29 June, 2026 | 7:05 PM

రైతులకు అందుబాటులో పెట్రోల్, డీజిల్ పంపులు

29-06-2026 06:20 PM

రైతుల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్న రేవంత్ రెడ్డి సర్కార్ 

ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే  విజయ రమణారావు

సుల్తానాబాద్,(విజయ క్రాంతి): రైతులకు అందుబాటులో పెట్రోల్ డీజిల్ పంపులు ఏర్పాటు చేయడంతో పాటు రైతుల సంక్షేమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పెద్దపీట వేస్తున్నారని  ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు అన్నారు. సోమవారం పెద్దపల్లి జిల్లా  సుల్తానాబాద్, మండలంలోని నీరుకుల్ల గ్రామంలో  సహకార సంఘం ఆధ్వర్యంలో సహకార వారోత్సవాలలో భాగంగా గ్రామంలో నూతనంగా నిర్మాణం చేపట్టిన కన్స్యూమర్ ఫిల్లింగ్ స్టేషన్ (పెట్రోల్, డిజిల్ పంప్) ను విజయ రమణారావు ప్రారంభించారు. అంతకు ముందు గ్రామంలో దాదాపు 30 లక్షల రూపాయలతో చేసిన వివిధ అభివృద్ధి పనులు సిసి రోడ్లు, డ్రైనేజీలకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేశారు.

ముందుగా ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు, ఈ సందర్భంగా చైర్మన్ శ్రీగిరి శ్రీనివాస్ వెంకటేశ్వర స్వామి  మెమొంటో అందజేసి శాలువా కప్పి ఘనంగా సన్మానించారు, అనంతరం జరిగిన సమావేశంలో  విజయ రమణ రావు మాట్లాడుతూ...పెద్దపల్లి నియోజకవర్గంలో ఉన్న 14 సంఘాలలో 11 సంఘాలను ఏకం చేసి ఎలిగేడు మండలం శివారులో పదిహేను వేల మెట్రిక్ టన్నుల గోదాముల నిర్మాణం చేపడుతున్నామన్నారు. కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో విత్తన శుద్ధి కేంద్రంగా సుల్తానాబాద్ సొసైటీ ఎంపికైందని తెలిపారు.

గతంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం 10 సంవత్సరాల కాలంలో కేవలం 7 వేల మెట్రిక్ టన్నుల గోదాముల నిర్మాణం చేపట్టారని కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చాక 20వేల మెట్రిక్ టన్నుల గోదాముల పనులు ప్రారంభించామని మరో 14 వేల మెట్రిక్ టన్నుల గోదాముల నిర్మాణం చేపడుతున్నామని రాబోవు రెండు సంవత్సరాల కాలంలో నియోజకవర్గ వ్యాప్తంగా లక్ష పైన మెట్రిక్ టన్నుల గోదాముల నిర్మాణం చేపట్టేందుకు కృషి చేస్తామని తెలిపారు.

గతంలో ముఖ్యమంత్రి  వైయస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో మహిళలకు మహిళా సంఘాల ద్వారా అందించిన సేవలను  బిఆర్ఎస్ ప్రభుత్వం విస్మరించిందని,  తిరిగి వాటిని కొనసాగిస్తున్నా మని తెలిపారు. సుల్తానాబాద్ మండలం గర్రెపల్లి భూపతిపూర్ గ్రామాల శివారులో మహిళలకు పెట్రోల్ పంప్ ను ఏర్పాటు చేశామని వివరించారు. రానున్న రోజుల్లో మహిళలందరూ ఆర్థికంగా ఎదిగేందుకు అన్ని రకాలుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వారికి అండగా నిలుస్తున్నారని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారం చేపట్టినప్పటి నుండి రాష్ట్రం అభివృద్ధి పథంలో పరుగులు పెడుతుందని అన్నారు.

నీరుకుల, కోమండ్లపల్లి , రంగంపల్లి గ్రామాలతో పాటు వేగురుపల్లి గ్రామాల ప్రజలకు దూర భారం తగ్గించేందుకు పెట్రోల్, డీజిల్ బంకు ఉపయోగపడుతుందన్నారు. సుల్తానాబాద్ మండలంలోని గర్రెపల్లి గ్రామం నుండి కాల్వరాంపూర్ మండలంలోని పెగడపల్లి గ్రామం వరకు డబుల్ రోడ్డు నిర్మాణానికి రూ.100 కోట్ల మంజూరు కావడం జరిగిందన్నారు. త్వరలోనే పనులు ప్రారంభించడం జరుగుతుందన్నారు. నీరుకుల్లా  గ్రామ ప్రజల కోరిక మేరకు మానేరు వాగు మంచినీరు రెండు నెలల్లోనే అందించేందుకు కృషి చేస్తానని అలాగే ఈ ప్రాంత ప్రజల చిరకాల వాంఛ బస్సు సౌకర్యాన్ని సైతం కల్పిస్తానని వివరించారు.