29 June, 2026 | 7:56 PM

అక్రమంగా చేపల పట్టడంపై అధికారుల విచారణ

29-06-2026 06:55 PM

గరిడేపల్లి,(విజయక్రాంతి): గరిడేపల్లి మండలంలో తాళ్ల మల్కాపురంలోని గరుడ సముద్రం చెరువులో అక్రమంగా చేపల పట్టడం పై మత్స్యశాఖ అధికారులు సోమవారం విచారణ జరిపారు. గురువారం , శుక్రవారం, శనివారం మూడు రోజుల్లో చెరువులో సుమారు ( 150 టన్నుల చాపలు) రెండు కోట్ల విలువ చేసే చేపలు అక్రమంగా పట్టుకున్నారంటూ జిల్లా కలెక్టర్, మత్స్య శాఖ అధికారులకు ఫిర్యాదులు అందడంతో ఈ విచారణ చేపట్టారు.

కాంట్రాక్టు ముసుగులో ఉన్న దళారులు, చెరువు సొసైటీ చైర్మన్, సెక్రటరీ, ఉపాధ్యక్షుడు సిండికేట్ గా ఏర్పడి చెరువు సొసైటీ సభ్యుల పొట్ట కొట్టారని చెరువు సొసైటీ పాలకవర్గ సభ్యులు మండవ వెంకటేశ్వర్లు జిల్లా అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఈ విషయంపై జిల్లా మత్స్యశాఖ అధికారి ఆంజనేయ స్వామి ఆదేశాల మేరకు మత్స్యశాఖ అధికారి ఉపేందర్ విచారణ చేపట్టారు. తాళ్ల మల్కాపురం గ్రామ పంచాయతీ వద్ద చెరువు సొసైటీ సభ్యులతో విచారించారు.  సొసైటీ సభ్యుల నుంచి ఆయన అభిప్రాయాలు తీసుకున్నారు.

మత్స్యశాఖ అధికారి వివరణ:

తాళ్ల మల్కాపురం చెరువు సొసైటీ పై విచారణ జరిపిన అధికారి ఉపేందర్ మాట్లాడుతూ చెరువులో చేపలు పట్టేటందుకు మత్స్యశాఖ అనుమతి ఉన్నదని, సొసైటీలో రెండు వర్గాలు ఉండటంతో ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకుంటున్నారని మరోసారి పూర్తిస్థాయి విచారణ జరిపి నివేదిక అందజేస్తానని ఆయన వివరించారు.