పెట్రో ధరలు మరింత పైకి!
రూ.10 మేర పెరిగే అవకాశం
- ఇప్పటికే డీజిల్, పెట్రోల్ ధరలు లీటర్‌కు రూ.౩ చొప్పున పెంపు
- అయినప్పటికీ.. లీటర్‌కు రూ.18 వరకు నష్టపోతున్న చమురు కంపెనీలు
- ఆయా సంస్థల నష్టాల భర్తీకి ధరల పెంపు అనివార్యం
- అదే జరిగితే.. రవాణా చార్జీలూ పెరుగుదల
- మున్ముందు నిత్యావసర వస్తువులు మరింత ప్రియం
న్యూఢిల్లీ, మే ౧౬: పెట్రోల్, డీజిల్ ధరలు త్వరలో లీటర్‌కు రూ.౧౦ వరకు పెరిగే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో చమురు సంస్థలు నష్టాలు భరిస్తూవస్తున్నాయని, ఆ నష్టాలను అధిగమించాలంటే ఆయా సంస్థలు ధరలు పెంచక తప్పే పరిస్థితి లేదని వెల్లడిస్తున్నారు. దేశీయ ఇంధన విక్రయాల్లో చమురు సంస్థల వాటా 90 శాతం వరకు ఉంటుంది.
అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు పెరగడం తో ఆయా సంస్థలు లీటర్ ఇంధనంపై రూ. 18 వరకు నష్టపోతున్నాయి. ప్రముఖ ఆర్థిక సేవల సంస్థ ‘ఎంకే గ్లోబల్’ అంచనా ప్రకా రం.. చమురు సంస్థలను నష్టాలను గట్టెక్కించేందుకే కేంద్రం ధరల పెంపునకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ధరల పెంపు ఒకేసారి ఉం డొచ్చని, లేదంటే 2-3 వారాల్లో దశలవారీగా పెరుగవచ్చని అంచనా వేస్తున్నారు. పెట్రోల్, డీజిల్‌పై ఆయిల్ కంపెనీలు ఇటీవల లీటర్‌కు రూ.3 చొప్పున పెంచిన సంగతి తెలి సిందే. పశ్చిమాసియా ఉద్రిక్తతలు, సంక్షోభం వల్ల అంతర్జాతీయ మార్కెట్ కుదుపులకు లోనవుతున్నది. గల్ఫ్ దేశాలు ఇతర దేశాలకు ముడిచమురు రవాణా చేయడం కష్ట తరంగా మారింది.
ఆ ప్రభావం భారత్‌పైనా పడింది. దీంతో ఇంధన ధరల పెరుగుదలను నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకం వసూలును తాత్కాలికంగా నిలిపివేసింది. చమురు కంపెనీలు సైతం తమ లాభాలను వదులుకుని, కొంత మేర నష్టాలు భరించాయి. కానీ, నష్టాలను ఎక్కువ కాలం భరించలేని పరిస్థితి రావడంతో ఆయా కంపెనీలు అనివార్యంగా ధరలు పెంచాల్సి వస్తోందని ఈ క్రమంలోనే లీటర్‌కు రూ.౩ చొప్పున ఇంధన ధరలు పెరిగాయని, మున్ముందు ఇంకా పెరగవచ్చని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.
సామాన్యుడిపై భారం
కేంద్ర ప్రభుత్వం మార్చి 27న ఇంధన దిగుమతులపై ఎక్సైజ్ సుంకాన్ని రూ.10 తగ్గించినప్పటికీ, చమురు సంస్థలకు నష్టాల నుంచి ఉపశమనం కలగలేదు. ప్రస్తుత త్రైమాసికంలో ఇంధన కంపెనీల రూ.57,000 కోట్ల నుంచి రూ.58,000 కోట్ల వరకు నష్టాలు భరించాయని ఓ అంచనా. ఏదేమైనా ఇంధన ధరల పెంపు ప్రభావం దేశీయ ద్రవ్యోల్బణంపై చూపించనుంది. రవాణా రంగంపైనా తీవ్ర ప్రభావం పడనుంది.
రానున్న రోజుల్లో వాహన రవాణా ఛార్జీలు 2.5 శాతం నుంచి 3 శాతం వరకు పెరిగే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. వాహనాల్లో వాడే డీజిల్ ఎగ్జాస్ట్ ఫ్లూయిడ్ (రియా) ధరలు ఇప్పటికే 50 శాతానికి పైగా పెరిగాయని, టైర్లు, లూబ్రికెంట్లు, టోల్ ఛార్జీలు, నిర్వహణ వ్యయమూ భారీగా పెరిగిందని గుర్తుచేస్తున్నారు.
ట్రక్కుల నిర్వహణ ఖర్చులో సగానికి పైగా డీజిల్ కోసమే ఖర్చవుతుందని వాహన యజమానులు వాపోతున్నారు. ఆ అదనపు ఖర్చుల భారాన్ని వినియోగదారులపై మోపడం తప్ప తమకు మరో దారి కనిపించడం లేదని కుండబద్దలు కొడుతున్నారు. రవాణా చార్జీలు పెరిగితే, ఇక నిత్యావసర వస్తువులు, కూరగాయలు, పండ్ల ధరలు పెరుగుతాయి. క్యాబ్‌లు, ఆటో ఛార్జీలు, లాజిస్టిక్స్ రంగం చార్జీలూ పెరుగుతాయి.






