4 April, 2026 | 1:15 AM

ప్రజారోగ్యంతో చెలగాటం

04-04-2026 12:00 AM
  1. ప్రతి పదార్థం కల్తీయే! 
  2. వ్యాపారులకు ధనార్జనే ముఖ్యం 
  3. మేడ్చల్‌లో బేకరీలో గడువు 
  4. ముగిసిన రసాయనాలతో కేకుల తయారీ 
  5. నార్త్ ఇండియా నుంచి గొర్రె, మేక కాళ్లు, తలకాయల దిగుమతి 

మేడ్చల్, ఏప్రిల్ 3 (విజయ క్రాంతి): వ్యాపారులు ధనార్జనే ధ్యేయంగా పెట్టుకొని ప్రజారోగ్యంతో చెలగాటమాడుతున్నారు. ఆహార పదార్థాలను కల్తీ చేస్తూ విక్రయిస్తున్నారు. ఇటీవల అధికారుల తనిఖీలలో విస్తుపోయే విషయాలు బయటపడ్డాయి. రుచి, వాసన, రంగు కోసం విష పదార్థాలను సైతం కలుపుతున్నారంటే వ్యాపారులు ఎంతకు తెగిస్తున్నారో అర్థమవుతుంది. చిన్నపిల్లలు తినే బిస్కెట్లు, పాలు, ఐస్ క్రీం, బేకరీ ఐటమ్లను విషపూరిత చేస్తున్నారు.

ఇటీవల మేడ్చల్ లో ఒక బేకరీలో ఎస్‌ఓటి పోలీసులు తనిఖీ చేయగా గడువు ముగిసిన రసాయనాలతో కేకులు ఇతర బేకరీ ఉత్పత్తులు తయారు చేస్తున్నట్లు బయటపడింది. కాలం చెల్లిన ఫ్లేవర్లు, కలర్ కెమి కల్స్ ఇతర ముడి పదార్థాలను భారీ మొత్తంలో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ బేకరీ లోనే కాకుండా అన్ని బేకరీలలో కూడా ఇలాంటి పరిస్థితి ఉంది. 

జోరుగా కల్తీ పాల విక్రయాలు 

జిల్లాలో కల్తీపాల విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. జిల్లాలో గ్రామీణం, సెమీ అర్బన్, అర్బన్ ప్రాంతాలు ఉన్నాయి. గ్రామీణ, సెమీ అర్బన్ ప్రాంతాలలో కల్తీపాలు తయారీ బాగా జరుగుతుంది. స్టార్చ్, యూరియా,  సర్ఫ్, పాలపొడి కలిపి కల్తీ పాలు తయారు చేస్తున్నారు. గత సంవత్సరం మేడ్చల్ జిల్లా మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో కల్తీ పాలు తయారు చేస్తున్న ఒక వ్యక్తిని అరెస్టు చేశారు.

మేడ్చల్, షామీర్పేట్, కీసర, ఘట్కేసర్, పిర్జాదిగూడ, కుత్బుల్లాపూర్ తదితర ప్రాంతాల్లో కల్తీ పాలు తయారు చేసి విక్రయిస్తున్నారు. చిన్నపిల్లలకు పాలు ఇవ్వడానికి స్వచ్ఛమైన పాలు దొరకడం లేదు. కల్తీ పాల తయారీ మీద అధికారులు దృష్టి పెట్టడం లేదు. డైరీ ఫార్మ్ లో గేదెలు, ఆవులు ఉండవు కానీ పాలు ఉత్పత్తి అవుతున్నాయి. కొంతమంది డైరీ ఫార్ములా నిర్వాహకులు గేదెలు ఇస్తున్న పాలతో పాటు అదనంగా కల్తీ పాలు తయారు చేస్తున్నారు. 

ఇతర రాష్ట్రాల నుంచి గొర్రె, మేక కాళ్లు, తలకాయల దిగుమతి 

చికెన్, మటన్ వ్యాపారులు కుళ్ళి న  మాంసాన్ని హోటల్లు, రెస్టారెంట్లకు, శుభకార్యాలకు విక్రయిస్తున్నారు. ఇటీవల అధికారులు నగరంలో పలుచోట్ల దాడులు నిర్వహించే కుళ్ళిన మాంసాన్ని చికెన్ పట్టుకున్నారు. నగరం నుంచి శివారు ప్రాంతాలకు సరఫరా చేస్తున్నారు. మేక, గొర్రెల తలకాయ, కాళ్లు నార్త్ ఇండియా నుంచి వస్తున్నాయి. తలకాయ, కాళ్లు నార్త్ ఇండియాలో డిమాండ్ ఉండదు. తెలంగాణలో డిమాండ్ ఉంటుంది. దీంతో లారీలలో అక్కడి నుండి తీసుకు వస్తున్నారు.

గత సంవత్సరం తలకాయ, కాళ్లతో హైదరాబాద్ కు వస్తున్న లారీ మార్గమధ్యలో తెలంగాణలో బోల్తా పడింది. అప్పట్లోనే తలకాయ కాళ్లు నార్త్ ఇండియా నుంచి వస్తున్నాయని తెలిసిన అధికారులు పట్టించుకోలేదు. ఇటీవల మరోసారి హైదరాబాదులో బయటపడింది. హైదరాబాదు నుంచి చుట్టుపక్కల ప్రాంతాలకు సరఫరా అవుతున్నాయి. మేడ్చల్ పట్టణానికి కూడా తలకాయ కాళ్లు తీసుకు వస్తున్నారు.

నార్త్ ఇండియా నుంచి కాల్చి తీసుకువచ్చిన తలకాయ, కాళ్లు స్థానిక వ్యాపారు లు కొనుగోలు చేసి మరోసారి కాల్చి విక్రయానికి పెడుతున్నారు. పైన వేడిగా ఉంటున్నప్పటికీ లోపల చల్లగా ఉంటుంది. వారం పది రోజులు ఫ్రిడ్జ్ లో ఉండడం వల్ల లోపలి భాగాలు చల్లగా ఉంటున్నాయి.

కొనుగోలుదారులు ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత కడిగే సమయంలో అర్థమవుతోంది. అంతేగాక తలకాయలు పురుగులు కూడా ఉంటున్నాయి. అధికారులు నిరంతరం తనిఖీలు చేసి కల్తీలను, కుళ్ళిన పదార్థాలను విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.