న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌లోని అజంగఢ్‌లో గురువారం జరిగిన ర్యాలీలో ప్రసంగించిన ప్రధాని నరేంద్ర మోడీ, పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)పై కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ శరణార్థులను దశాబ్దాలుగా వేధించిందని, వారి అవసరాలపై ఎప్పుడూ పెద్దగా దృష్టి పెట్టలేదని ప్రధాని ఆరోపించారు. మోడీ గ్యారెంటీపై ప్రజలకు నమ్మకం ఉందన్నారు. సీఏఏ చట్టమే మోడీ గ్యారెంటీకి తాజా ఉదాహరణ అని ఆయన పేర్కొన్నారు. సీఏఏ కింద భారత్ పౌరసత్వం ఇవ్వడం మొదలైందని తెలిపారు. దేశంలో వీరంతా చాలా ఏళ్లుగా శరణార్థులుగా ఉన్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మోడీ వెళ్తే సీఏఏ కూడా వెళ్తుందని కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. విపక్ష కూటమి ఓటు బ్యాంక్ రాజకీయం చేస్తోందని ప్రధాని ద్వజమెత్తారు. ఎవరూ సీఏఏను ఆపలేరన్న ఆయన ప్రజలంతా బీజేపీ, ఎన్డీఏ కూటమితోనే ఉన్నారని ధీమా వ్యక్తం చేశారు.