16-02-2026 12:14:04 AM
మేడ్చల్, ఫిబ్రవరి 15 (విజయ క్రాంతి): దేశ రాజకీయాల్లో బద్ధ శత్రువులైన బిజెపి, కాంగ్రెస్ పార్టీలు మున్సిపల్ చైర్ పర్సన్ ఎన్నికల సందర్భంగా మేడ్చల్ జిల్లాలో ఒకటయ్యాయి. మూడు మున్సిపాలిటీలలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఒక మున్సిపాలిటీలో బీఆర్‌ఎస్ కు స్పష్టమైన మెజారిటీ రాగా, మరో మున్సిపాలిటీలో ఎక్స్ అఫీషియో ఓటుతో గెలుచుకునే అవకాశం ఉంది.
మరోచోట హంగు ఏర్పడింది. హంగు ఏర్పడిన మున్సిపాలిటీ తో పాటు బిఆర్‌ఎస్ గెలుచుకునే అవకాశం ఉన్న మున్సిపాలిటీని గెలుచుకోవడానికి ఈ రెండు పార్టీలు ఒకటయ్యాయి. హంగు ఏర్పడిన చోట ఎవరికీ మద్దతు ఇవ్వబోమని బిజెపి అధ్యక్షుడు రామ్ చందర్రావు స్పష్టం చేయగా, మేడ్చల్ జిల్లాలో ఒక ముఖ్య నాయకుడు ఆధ్వర్యంలో సిద్ధాంత పరంగా వైరుధ్యం ఉన్న రెండు పార్టీలు ఒకటి కావడం గమనార్హం.
మేడ్చల్ జిల్లాలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో మూడు చింతలపల్లి మున్సిపాలిటీలో 24 స్థానాలు ఉండగా బీఆర్‌ఎస్ 14 స్థానాలు గెలుపొంది స్పష్టమైన మెజారిటీ సాధించింది. ఎల్లంపేట మున్సిపాలిటీలో 24 స్థానాలు ఉండగా 12 స్థానాలు బీఆర్‌ఎస్ గెలుపొందగా, కాంగ్రెస్ ఎనిమిది, బిజెపి నాలుగు స్థానాలు గెలుపొందాయి. బి ఆర్ ఎస్ కు చెందిన ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి ఎక్స్ అఫీషియో సభ్యుడిగా ఎల్లంపేట మున్సిపాలిటీలో నమోదు చేసుకున్నారు. దీంతో బిఆర్‌ఎస్ బలం మ్యాజిక్ ఫిగర్ 13 కు చేరింది.
ఎల్లంపేటలో ఈటెల ఓటు నమోదు
ఎల్లంపేట మున్సిపాలిటీలో ఎంపీ ఈటల రాజేందర్ ఓటు నమోదు చేసుకున్నారు. మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధిలో మేడ్చల్ జిల్లాకు చెందిన మూడు మున్సిపాలిటీలే ఉన్నాయి. ఇందులో ఏదో ఒక చోట ఓటు నమోదు చేసుకోవాల్సిందే. ఎల్లంపేటలో ఎంపీ ఓటు నమోదు చేసుకోవడం సాధారణమే అయినా దీని వెనక పెద్ద వ్యూహం ఉందనే ప్రచారం జరుగుతోంది.
కాంగ్రెస్ బిజెపి నాయకుల మధ్య అవగాహన కుదిరిందని, ఎల్లంపేట చైర్పర్సన్ పీఠం దక్కించుకోవడానికి ప్రయత్నిస్తున్నారని అంటున్నారు. అలియాబాద్ లో కాంగ్రెస్ కు బిజెపి, ఎల్లంపేటలో బిజెపికి కాంగ్రెస్ మద్దతు ఇచ్చేలా అవగాహన జరిగినట్లు తెలిసింది. ఎల్లంపేటలో కాంగ్రెస్ కు ఎనిమిది, బిజెపికి నాలుగు స్థానాలు వచ్చినందున ఎంపీ ఓటుతో 13 అవుతాయి. బి ఆర్ ఎస్ కు, ఈ కూటమికి ఓటు సమానమవుతాయి.
వీలైతే బీఆర్‌ఎస్ కు చెందిన ఒకరిని తమ వైపు తిప్పుకోవాలని భావిస్తున్నారు. ఒకవేళ అది సాధ్యం కాకుంటే టాస్ లో అదృష్టం పరీక్షించుకోవాలని భావిస్తున్నారు. అలియాబాద్ లో కాంగ్రెస్ కు 8 స్థానాలు రాగా మ్యాజిక్ ఫిగర్ కు ముగ్గురు కౌన్సిలర్ అవసరం. ఇక్కడ బిజెపి మూడు స్థానాలు గెలుపొందింది. కాంగ్రెస్ బిజెపి రెండు పార్టీలు కలిస్తే చైర్మన్ పీఠం సునాయాసంగా దక్కించుకోవచ్చు.
బీఎస్పీ నుంచి గెలుపొందిన సభ్యుడు కూడా కాంగ్రెస్ కు మద్దతునిస్తున్నారు. అలియాబాద్ లో కాంగ్రెస్, ఎల్లంపేటలో బిజెపి చైర్ పర్సన్ పదవులు దక్కించుకోవడానికి రెండు పార్టీలు వ్యూహం రచించాయి. కాంగ్రెస్ తో అవగాహన విషయమై బిజెపి రాష్ట్ర కమిటీకి సమాచారం లేదని తెలిసింది. ఒకవేళ రాష్ట్ర కమిటీ దృష్టికి వెళితే అభ్యంతరం చెప్పే అవకాశం ఉందని బిజెపి నాయకులు అంటున్నారు.
క్యాంపులలో కౌన్సిలర్లు
మూడు మున్సిపాలిటీలలో ఎన్నికల కౌన్సిలర్లు క్యాంపు లలో ఉన్నారు. మూడు పార్టీలు వివిధ ప్రాంతాల్లో క్యాంపులు నిర్వహిస్తున్నాయి. తమ పార్టీ నుంచి కౌన్సిలర్లు చేజారకుండా జాగ్రత్త పడుతున్నాయి. రెండు మున్సిపాలిటీలలో హంగు ఏర్పడినందున ప్రత్యర్థి శిబిరాలపై దృష్టి సారించాయి. కౌన్సిలర్లకు బాగా డిమాండ్ పెరిగింది. మద్దతు కోసం పెద్ద మొత్తంలో డిమాండ్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అలియాబాద్, ఎల్లంపేటలో ఎవరు చైర్ పర్సన్ అవుతారనే విషయమై ఉత్కంఠ ఏర్పడింది.
నేడే చైర్ పర్సన్ల ఎన్నిక
మున్సిపల్ చైర్ పర్సన్ లో ఎన్నిక సోమవారం జరగనుంది. ఉదయం 11 గంటలకు ప్రత్యేక సమావేశం జరుగుతుంది. ముందుగా కౌన్సిలర్లు ప్రమాణస్వీకారం చేస్తారు. ఆ తర్వాత చైర్పర్సన్ ఎన్నిక ఉంటుంది.