రాష్ట్ర స్థాయి పాటల పోటీల్లో ప్రజ్ఞకు తృతీయ స్థానం
కలెక్టర్ రాహుల్ శర్మ అభినందనలు
భూపాలపల్లి, సెప్టెంబర్ 28 (విజయక్రాంతి): ప్రపంచ పర్యాటక దినోత్సవం(World Tourism Day) సందర్భంగా నిర్వహించిన రాష్ట్ర స్థాయి పాటల పోటీ(State Level Singing Competition)ల్లో భూపాలపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థిని కమ్మల ప్రజ్ఞ తృతీయ స్థానం సాధించింది. సోమవారం ఐడీఓసీలో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ప్రజ్ఞను అభినందించి ప్రశంసాపత్రం అందజేశారు.
విద్యతో పాటు క్రీడలు, సంగీతం, కళల్లో విద్యార్థులు రాణించాలని ఆయన సూచించారు. మలహర్రావు మండలం పాత రుద్రారం గ్రామానికి చెందిన ప్రజ్ఞ ఎంసీపీఎస్ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. మండల, జిల్లా స్థాయి పోటీల్లో ప్రథమ స్థానాలు సాధించి రాష్ట్ర స్థాయికి ఎంపికై, హైదరాబాద్‌లో జరిగిన పోటీల్లో తృతీయ స్థానం సాధించింది. ఆమె తండ్రి ప్రవీణ్‌కుమార్ తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారుడిగా సేవలందిస్తున్నారు. ప్రజ్ఞ విజయంపై కళాశాల ప్రిన్సిపాల్, అధ్యాపకులు, విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు.