ఉపాధ్యాయులు సమాజానికి దిక్సూచీలు
నల్గొండ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రమాదేవి
యంగ్ ఇండియన్ బ్లడ్ డోనర్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డుల ప్రదానం
చుంచుపల్లి,(విజయ క్రాంతి): ఉపాధ్యాయులు సమాజానికి దిక్సూచీ లాంటి వారని, వారి దిశా నిర్దేశంలో విద్యార్థులు(Students) తమ ప్రతిభకు పదునుపెట్టి ఉన్నతులుగా ఎదుగుతారని నల్గొండ జిల్లా స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఎం.రమాదేవి(Deputy Collector M. Ramadevi) అన్నారు. యంగ్ ఇండియన్ బ్లడ్ డోనర్స్ క్లబ్ వ్యవస్థాపక అధ్యక్షులు జె.బి. బాలు ఆధ్వర్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉత్తమ ఉపాధ్యాయులను గుర్తించి వారికి అవార్డులను ప్రదానం చేశారు. జిల్లా కేంద్రమైన కొత్తగూడెం పట్టణంలోని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ హాల్లో శనివారం జరిగిన కార్యక్రమంలో జిల్లాలోని 24 మంది ఉత్తమ ఉపాధ్యాయులకు ముఖ్య అతిధులు డిప్యూటీ కలెక్టర్ రమాదేవి, భద్రాచలం మోటారు వెహికిల్ ఇన్స్పెక్టర్, టీజీఓ జిల్లా అధ్యక్షులు సంగం వెంకట పుల్లయ్య చేతులమీదుగా అవార్డులు అందచేసి సత్కరించారు.
ఈ సందర్భంగా రమాదేవి మాట్లాడుతూ పాఠశాలల్లో ఉపాధ్యాయులు విద్యార్థులకు బోధించే అంశాలు భవిష్యత్తుకు భరోసా కల్పిస్తాయన్నారు. ప్రతీ విద్యార్థి ఉపాధ్యాయులకు ముఖ్యమేనని చెప్పారు. ఎంతోమంది ప్రభుత్వ ఉపాధ్యాయులు తమ బాల్యంలో ప్రభుత్వ పాఠశాలల్లోనే విద్యాభ్యాసం చేశారని గుర్తుచేశారు. ఎంవీఐ సంగం వెంకటపుల్లయ్య మాట్లాడుతూ ఉపాధ్యాయ వృత్తి ఎంతో పవిత్రమైనదని, పాఠశాలలు దేవాలయాలు అయితే అందులో ఉపాధ్యాయులు దేవుళ్లతో సమానమని అభివర్ణించారు. ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన వారిపై మరింత బాధ్యత పెరుగుతుందని అన్నారు. జిల్లా ఎలక్షన్ సెల్ సూపరింటెండెంట్ రంగా ప్రసాద్ మాట్లాడుతూ ఉపాధ్యాయులంటే సమాజంలో ప్రత్యేక స్థానం ఉందని అన్నారు. ప్రతీ ఉపాధ్యాయుడు తమ తరగతిగదిలోని ప్రతి విద్యార్థికి విలువలతో కూడిన విద్యను అందిస్తారని చెప్పారు.