బీసీలను మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం
హనుమకొండ,(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్ లో 56 శాతం ఉన్న బీసీలకి 3.8 శాతం నిధులను కేటాయించి బలహీనవర్గాలను రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరొకసారి మోసం చేసిందని బిసి సబ్ ప్లాన్ సాధన కమిటీ రాష్ట్ర చైర్మన్ ప్రొఫెసర్ కె. మురళీ మనోహర్ విమర్శించారు. తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ లో బీసీలకి తక్కువ నిధులు కేటాయించినందుకు నిరసనగా ఏకశిలా పార్కు నుండి అమరవీరుల స్తూపం వరకు బీసీ సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన ర్యాలీ నిర్వహించారు.
అనంతరం ప్రొఫెసర్ కె. మురళీ మనోహర్ మాట్లాడుతూ 2026- 27 ఆర్థిక సంవత్సరానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో బీసీల సంక్షేమానికి కేవలం 12,511 కోట్ల రూపాయలను మాత్రమే కేటాయించి ప్రభుత్వం బీసీలకి అన్యాయం చేసిందని అన్నారు. ప్రతి బడ్జెట్ లో బీసీల సంక్షేమానికి రూ.20 వేల కోట్లు కేటాయిస్తామని కామారెడ్డి బీసీ డిక్లరేషన్ లో ఇచ్చిన హామీని విస్మరించి కాంగ్రెస్ ప్రభుత్వం బడ్జెట్ లో నిధులు కేటాయించకుండా బీసీలను మోసం చేసింది.
గత మూడు బడ్జెట్ లలో కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు కామారెడ్డి డిక్లరేషన్ లో ఇచ్చిన హామీ మేరకు నిధులు కేటాయించటం లేదని విమర్శించారు. రిటైర్డ్ ప్రొఫెసర్ వడ్డే. రవీందర్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం బడ్జెట్ లో బీసీలకు తక్కువ నిధులు కేటాయించడమే కాకుండా, కేటాయించిన నిధులను కూడా పూర్తిస్థాయిలో ఖర్చు చేయడం లేదని విమర్శించారు. గత బడ్జెట్ లో బీసీల సంక్షేమానికి 11,405 కోట్ల రూపాయలను కేటాయించి 3000 కోట్ల రూపాయలను కూడా ఖర్చు చేయలేదని అన్నారు.
ఉమ్మడి వరంగల్ జిల్లా బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు బుట్టి శ్యామ్ యాదవ్ మాట్లాడుతూ బడ్జెట్ లో బిసి, ఎంబీసీ కార్పొరేషన్ల కి వివిధ కుల సమాఖ్య ఫెడరేషన్లకి కేటాయిస్తున్న నిధులలో కూడా ఒక్క రూపాయి ఖర్చు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకి అన్యాయం చేస్తుందని విమర్శించారు. బడ్జెట్ నిధుల కేటాయింపులో కాంగ్రెస్ ప్రభుత్వం ఇదే వైఖరి అనుసరిస్తే భవిష్యత్తులో రాజకీయంగా కాంగ్రెస్ పార్టీ మూల్యం చెల్లించుకోవాలని హెచ్చరించారు.
ఈ నిరసన కార్యక్రమంలో బిసి నాయకులు డాక్టర్ తిరునహరి శేషు దారబోయిన సతీష్, ప్రొఫెసర్. బెనర్జీ, ప్రొఫెసర్ సారంగ పాణి, ప్రొఫెసర్ గోపు.సుధాకర్ తాడిశెట్టి క్రాంతి, గొల్లపల్లి వీరస్వామి, ఏదునూరి రాజమౌళి, చందా మల్లయ్య, జిలకర శ్రీనివాస్, తెలంగాణ రాజ్యాధికార పార్టీ నాయకులు పల్లెబోయిన అశోక్ ముదిరాజ్, జిల్లా అధ్యక్షులు సంపత్ పటేల్,దార జనార్దన్ గౌడ్,రాజు, చిన్నాల యశ్వంత్ యాదవ్, డేనియల్, వినయ్ చారి, డాక్టర్ కొంగ వీరస్వామి, డాక్టర్ కూరపాటి రమేష్, డాక్టర్ కొంతం కృష్ణ, డాక్టర్ బ్రహ్మయ్య, డాక్టర్ తండు నాగయ్య, డాక్టర్ రమేష్, దాడబోయిన శ్రీనివాస్, పులి శ్రీనివాస్, మల్లేష్ , ధర్మపురి రామారావు పటేల్, చుంచు సుధాకర్ తదితరులు పాల్గొన్నారు, అనంతరం బడ్జెట్ ప్రతులను బీసీ నాయకులు తగలబెట్టారు.




