నేడు సిద్దిపేట జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన
రూ. 3,590 కోట్ల రైతు భరోసా నిధులు విడుదల
రూ. 100 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం
నంగునూరు,(విజయక్రాంతి): సిద్దిపేట జిల్లాలో నేడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. మధ్యాహ్నం 2:30 గంటలకు నంగునూరు మండలం నర్మేట చేరుకోనున్న సీఎం, అక్కడ రూ.300 కోట్లతో నిర్మించిన అత్యాధునిక ఆయిల్‌పామ్ ఫ్యాక్టరీని ప్రారంభిస్తారు. ఇదే ప్రాంగణంలో నూతన రిఫైనరీకి శంకుస్థాపన చేయడంతో పాటు, సుమారు 150 వ్యవసాయ అనుబంధ స్టాల్‌లను సందర్శిస్తారు.
అనంతరం ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో 70 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి రైతు భరోసా మొదటి విడత నిధులను (రూ. 3,590 కోట్లు) నేరుగా విడుదల చేయనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఎన్సాన్‌పల్లిలో నూతన జిల్లా జైలు, 50 పడకల ఆయుష్ ఆసుపత్రి, సెంట్రల్ మెడిసిన్ స్టోర్‌లను సీఎం ప్రారంభిస్తారు.
అలాగే కొండపాకలో రూ. 200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్‌కు, సిద్దిపేట పట్టణంలో రూ. 141 కోట్ల తాగునీరు, డ్రైనేజీ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తారు. గజ్వేల్ నియోజకవర్గంలో నూతన మండల కార్యాలయాల సముదాయం, గట్లమల్యాల, సిద్దిపేటల్లో నూతన ఆరోగ్య కేంద్రాలను కూడా సీఎం ప్రారంభించనున్నారు. మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్ లు ఈ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.




