విద్యార్థులకు అందని నాణ్యమైన భోజనం
గురుకులంలో రంగు మారిన కోడిగుడ్లు
ప్రభుత్వ పాఠశాలలో ఇళ్ల నుంచి లంచ్ బాక్సులు
ఫుడ్ కమిషన్ బృందం తనిఖీలో బహిర్గతం
మేడ్చల్, సెప్టెంబర్ 11 (విజయక్రాంతి): జిల్లాలో గురుకులాల్లో, ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన భోజనం అందడం లేదు. ప్రభుత్వం గురుకులాలు, ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనం తనిఖీ చేయాలని ఆదేశాలు జారీ చేసినప్పటికీ జిల్లాలో నాణ్యమైన భోజనం అందకపోవడం విస్మయం కలిగిస్తోంది. ఫుడ్ కమిషన్ బృందం(Food Commission Team) తనిఖీలలోనే ఈ లోపాలు బయటపడడం గమనార్హం. రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాసరెడ్డి(State Food Commission Chairman Goli Srinivasa Reddy), సభ్యులు జిల్లాలో శుక్రవారం పలు చోట్ల తనిఖీలు చేశారు.
ద్మగూడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించగా చాలామంది విద్యార్థులు ఇంటి నుంచి లంచ్ బాక్సులు తెచ్చుకోవడం గమనించారు. లంచ్ బాక్సులు ఎందుకు తెచ్చుకుంటున్నారని విద్యార్థులను ప్రశ్నించగా, భోజనం సరిగా ఉండడం లేదని, అందుకే ఇంటి నుంచి తెచ్చుకుంటున్నామని చెప్పారు. దీనిని కమిషన్ చైర్మన్, సభ్యులు తీవ్రంగా పరిగణించారు. ఇలాంటి నిర్లక్ష్యాన్ని సహించేది లేదని స్పష్టం చేశారు.
విచారించి తగిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. విద్యార్థుల కోసం ప్రభుత్వం ఎంతో ఖర్చు చేస్తుంటే ఇక్కడ మధ్యాహ్న భోజనం అందకపోవడం మేమిటని ప్రశ్నించారు. తాము మళ్లీ వచ్చేలోపు రుచికరమైన భోజనం అందించాలని స్పష్టం చేశారు. మేడ్చల్ సమీపంలోని కిష్టాపూర్ తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్లో గుడ్లు రంగు మారడాన్ని గుర్తించారు. గుడ్లు ఎందుకు రంగు మారాయని నిర్వాహకులను ప్రశ్నించారు. గుడ్లు గత నెలకు చెంది నవని తేలింది.
పరీక్ష చేసి నివేదిక అందించాలని ఫుడ్ సేఫ్టీ అధికారిని ఆదేశించారు. డైనింగ్ హాల్, స్టోర్ రూమ్, ఇతర వసతులను పరిశీలించారు. నాణ్యమైన సన్న బియ్యం మాత్రమే వాడాలని, బియ్యం నాణ్య త లేకుంటే అధికారులకు తెలియజేయాలని సూచించారు. మేడ్చల్ లోని చౌక ధరల దుకాణాన్ని పరిశీలించారు. దుకాణంలో ఫిర్యాదుల బాక్స్ అందుబాటులో ఉంచాలని, సివిల్ సప్లై, తహసిల్దార్ల ఫోన్ నెంబర్లు ప్రదర్శించాలని సూచించారు.
దమ్మాయిగూడ అంబేద్కర్ నగర్‌లోని, జవహార్ నగర్ మల్కాపురంలోని అంగన్ వాడీ కేంద్రాలను ఛైర్మన్ సభ్యులు సందర్శించారు. కేంద్రాల లో ఎంత మంది చిన్నారులున్నారని, ఎంతమంది గర్భిణులు వస్తారని, వారికి సరిపడా పౌష్టికాహారం, గుడ్డు, పాలు అందించడం జరుగుతుందా అని పరిశీలించారు. అంగన్ వాడీ సెంటర్లలో భోజనం మెను ప్రదర్శించాలని అదేశించారు. గర్భిణులు, 14 సంవ త్సరాల లోపు పిల్లలకు పౌష్టికాహారం తీసుకోవడం వారి హక్కు అని, చట్టబద్దమైన ఈ హక్కును కచ్చితంగా అమలయ్యేలా చూడాల్సిన బాధ్యత కమీషన్ పైన ఉందన్నారు.
ఈ హక్కు దారులకు నష్టం జరుగకుండా వారి హక్కులకు భంగం కలుగకుండా చూడడానికి కమిషన్ ఎప్పుడు సిద్దంగా ఉంటుంద న్నారు. ఏక్కడైన సమస్యలు ఉంటే తమదృష్టికి తీసుకురావాలని సభ్యులు తమ ఫోన్ నంబర్లను గర్భిణి స్త్రీలకు అందజేసారు. ఈ పర్యటనలో నోడల్ అధికారి సాంబశివరావు, జిల్లా బిసి, ఎస్సీ, ఎస్టి, మైనారిటి సంక్షేమ అధికారులు ఝాన్సీరాణి, వినోద్ కుమార్, పద్మజా, కాంతమ్మ, డిఎం అండ్ హెచ్‌ఓ అనంద్, సివిల్ సప్లై అధికారులు సుగుణబాయి, శ్రీనివాస్, జిల్లా సంక్షేమ అధికారి శారద, తదితరులు పాల్గొన్నారు.