నిప్పుల వాన
మండుతున్న ఎండాకాలం
వడదెబ్బతో అల్లాడుతున్న జనం
మండుతున్న మొక్కజొన్న, వరి పంటలు
హైదరాబాద్, ఏప్రిల్ 30 (విజయక్రాంతి): గతంలో ఎన్నడూ లేనంతగా రాష్ట్రంలో ఎండలు మండుతున్నాయి. పదేళ్లలో కనీవినీ ఎరగనిరీతిలో ఎండల తీవ్రత ఈసారి ఉంది. భానుడి ఉగ్రరూపం దాల్చుతుండటంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఇప్పటికే చాలా జిల్లాల్లో.. కొన్ని రోజులుగా 46 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో వడదెబ్బబారిన పడి ప్రజలు మృత్యువాత కూడా పడుతున్నారు.
మరోవైపు ఎండల ప్రభావంతో జరుగుతున్న అగ్నిప్రమాదాల్లో మొక్కజొన్న, వరి, ఇతర పంటలు దగ్ధం అవుతున్నాయి. అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైతే, అడవులు కూడా తగలపడతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వడదెబ్బ కారణం గా మృతిచెందిన వారి కుటుంబాలను ఆదుకునేందుకు ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా అందించాలనే ఉత్తర్వులూ ఉన్నాయి.
రాష్ట్రంలో హీట్ వేవ్..
సాధారణంగా ఏప్రిల్ నెల అనగానే ఉష్ణోగ్రతలు ఎక్కువగానే ఉంటుంది. కానీ ఈ ఏడాది ఏప్రిల్‌లో నమోదవుతున్న ఉష్ణోగ్రతలు చూస్తుంటే ఆందోళన కలుగుతున్నది. ఉదయం 10 దాటిందంటే వేడి తీవ్రత పెరుగుతోంది. దీంతో జనం ఫ్యాన్లు, కూలర్లు, ఏసీల కింద కూర్చుంటున్న పరిస్థితి నెలకొంది. మే నెల రాకముందు నుంచే గత వారం పది రోజుల నుంచి అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. పలు జిల్లాల్లో అప్పుడే 46 డిగ్రీలు దాటి ఉష్ణోగ్రతలు నమోదవుతూ భయపడేలా చేస్తున్నారు. నిజానికి, ఈ స్థాయి ఎండలు రోహిణీ కార్తె’ సమయంలో, అంటే మే 25వ తేదీ తర్వాత ఉంటాయి. ఒక నెల ముందుగానే ఆ స్థాయిలో ఎండలతో రాష్ట్రంలో మండిపోతున్నాయి.
ఇది ప్రపంచ వాతావరణాన్ని అతలాకుతలం చేయబోతున్న సూపర్ ఎల్‌నినో ప్రభా వమని శాస్త్రజ్ఞులు చెబుతున్నారు. అయితే దీని ప్రభావం దక్షిణ భారతంపై కాస్త తక్కువగానే ఉన్నా మధ్యభారతంపై ఈసారి ఎక్కువగా ఉందని వారు పేర్కొంటున్నారు. గురువారం రాష్ట్రంలోని జగిత్యాల్, ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాలకు హీట్ వేవ్ హెచ్చరికలను వాతావరణ శాఖ జారీ చేసింది. అంటే ఈ ప్రాంతాల్లో 45.0 డిగ్రీల కంటే అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
47 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు చేరుకుంటే తీవ్రమైన వడగాలులు వీచే ప్రమా దం ఉంది. ఇక పెద్ద పల్లి జిల్లా రామగుండంలో అత్యధికకంగా 45.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైతే, నల్లగొండ జిల్లా మునుగోడులో 45.8 డిగ్రీలు, జిగిత్యాల్ జిల్లా ధర్మపురిలో 45.4 డిగ్రీలు, ఆదిలాబాద్ జిల్లా బేలాలో 45.3 డిగ్రీలు, నిర్మల్ జిల్లా దస్తురాబాద్‌లో 45.3 డిగ్రీలు, కరీంనగర్ జిల్లా చొప్పదండిలో 45.2 డిగ్రీలు, సిద్ధిపేట జిల్లా కోహెడాలో 45.2 డిగ్రీల చొప్పు అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మిగిలిన 22 జిల్లాల్లో 42.4 డిగ్రీల నుంచి 44.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవ్వడం గమనార్హం. మరో రెండు రోజులు రా ష్ట్రంలో ఎండల తీవ్ర ఉండనుంది. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్‌ను వాతావరణ శాఖ జారీ చేసింది.
వడదెబ్బ బారినపడుతున్న జనం..
ఎండల తీవ్రతతో జనం వడదెబ్బ బారిన పడుతున్నారు. ఈ పరిస్థితుల్లో ఎక్కువగా వృద్ధులు, చిన్నారులు జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచిస్తున్నారు. ఏప్రిల్ 9న ముగ్గురు, 15న వడదెబ్బ కారణంగా మహబూబాబాద్ జిల్లాలో నలుగురు, 23న రాష్ట్రంలో ఏడుగురు, 26న ఆరుగురు, 27న ముగ్గురు వడదెబ్బతో మృత్యువాత పడ్డారు.
పంటలపై ప్రభావం..
అధిక ఉష్ణోగ్రతల వల్ల పంటలు ఎండిపోయే ప్రమాదం ఉంది. ఏప్రిల్‌లో వచ్చే తీవ్రమైన వేడి గాలులు పంటలను నాశనం చేస్తాయి. వరి పొట్టకొచ్చే దశ లో (ఫ్లోవరింగ్ స్టేజ్) అధిక ఉష్ణోగ్రతలకు గురైతే గింజ గట్టిపడక నిలువునా ఎండిపోతుంది. మొక్కజొ న్న... వేడి గాలులు, అధిక ఉష్ణోగ్రతల వల్ల మొక్క జొన్న ఎదుగుదల ఆగిపోయి దిగుబడి తగ్గుతుంది. పప్పుధాన్యాలైతే మినుము, పెసర, సోయాచిక్కుడు వంటి పం టలు తీవ్రమైన వేడిని తట్టుకోలేక ఎండిపోతా యి. దీంతో గింజల నాణ్యత దెబ్బతింటుందని నిపుణులు చెప్తున్నారు. అధికవేడి వల్ల పత్తి కాయలు సరిగ్గా పరిపక్వం చెందవు. కొన్నిసార్లయితే రాలిపోతాయి.
నాలుగు లక్షల పరిహారం..
ఎండల తీవ్రతకు ప్రజలు ప్రాణాలు కో ల్పోతే వారి కుంటుంబాలకు ప్రభుత్వం ఆదుకుంటుంది. వడదెబ్బ కారణంగా మృతి చెందితే ప్రభుత్వం పరిహారం అందిస్తుంది. దీనిని ఇటీవల రూ.50 వేల నుంచి రూ.4 లక్షలకు పెంచింది. మండల స్థాయిలోని రెవెన్యూ, పోలీసు, వైద్య శాఖల అధికారులతో కూడిన త్రిసభ్య కమిటీ వడదెబ్బ మరణాలను నిర్ధారిస్తుంది. కాగా, వడదెబ్బ కారణంగా మృ తి చెందిన మృతుల కుటుంబాలను ఆదుకునేందుకు ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా అంది స్తోంది. స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ ద్వారా రూ.4 లక్షల వరకు మృతుల కుటుంబాలకు అందుతాయి. అయితే ఈ పరిహారం పొందడానికి పోస్టుమార్టం రిపోర్టు, ఎఫ్‌ఐఆర్, వాతావరణ శాఖ ధ్రువీకరణ వంటి నిబంధనలు తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది.
పరిహారం కోసం కావల్సిన పత్రాలు
* ప్రభుత్వ ఆసుపత్రిలో ఇచ్చిన మృతుడి పోస్టుమార్టం రిపోర్టు
* స్థానిక పోలీస్ స్టేషన్ నుంచి ఎఫ్‌ఐఆర్, ఫైనల్ రిపోర్టు
* స్థానిక రెవెన్యూ అధికారులు ఇచ్చిన డెత్ సర్టిఫికేట్
* మృతుడి, వారసుల ఆధార్‌కార్డు జిరాక్స్
* పరిహారం జమ చేసేందుకు బ్యాంకు పాస్‌బుక్ వివరాలు
* మృతుని కుటుంబ సభ్యుల డిక్లరేషన్
* కలెక్టర్ ఆమోదం పొందిన వెంటనే నామినీ బ్యాంకు ఖాతాలో జమచేస్తారు.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు..
* ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3.30 గంటల మధ్య వీలైనంత వరకు ఎండనుంచి దూరంగా ఉండటం మంచిది.
* నీళ్లు, లేదా జ్యూసులు లాంటివి ఎక్కువగా తీసుకోవాలి. శరీర ఉష్ణోగ్రత ఒక్కసారిగా 104 డిగ్రీల ఫారెన్‌హీట్ (40 డిగ్రీలకు చేరితే) వడదెబ్బ సోకినట్లుగా గుర్తించి వెంటనే హాస్పిటల్‌కు తరలించాలి.
* పరిశ్రమలు, సంస్థల్లో పని చేసే కార్మికులకు రొటేషన్ పద్ధతిని అమలుచేయాలి.
* పట్టణ ప్రాంతాల్లో కూల్ వార్డులు ఏర్పాటు చేసి, వడ దెబ్బ బాధితులకు చికిత్స అందించేందుకు చర్యలు తీసుకోవాలి.
* కార్మికులు మధ్యాహ్నం గంట లేదా రెండు గంటల పాటు నీడపట్టున విశ్రాంతి తీసుకోవడం ముఖ్యం.
* ఎండలో తప్పనిసరిగా బయటికి వెళ్లాలంటే గొడుగు, టోపీ, తెల్లని రుమాలు ధరించండి.
* తెల్లని నూలు వస్త్రాలు ధరించడం ఉత్తమం.
* కూల్ డ్రింక్స్, మత్తు పానీయాల జోలికి వెళ్లకూడదు.
* నీరు, ఇతర ద్రవపదార్థాలు ఎక్కువ తీసుకోవాలి.
* వడదెబ్బ సోకిన వారికి 15 నిమిషాలకు ఒకసారి కోల్డ్ స్పాంజింగ్ చేయాలి. చికిత్స చేయించాలి.
ఏటా 5.45 లక్షల మంది మృతి..
ప్రపంచ ఆరోగ్య సంస్థ, ప్రపంచ వాతావరణ సంస్థ అధ్యయనం ప్రకా రం ఆరుబయట పనులు చేసే 160 కోట్ల మందికి అధిక వేడి ముప్పుఎక్కువగా ఉంది. భారత్ సహా 77 దేశా ల్లోని 100 కోట్ల మందికి ఈ ముప్పు మరీ ఎక్కువగా ఉంది. అత్యధిక హీట్ వల్ల ప్రపంచవ్యాప్తంగా ఏటా 5,45, 000 మంది చనిపోతున్నారని ‘సస్టెయినబుల్ ఎనర్జీ ఫర్‌ఆల్’ అనే సంస్థ గణాంకాలు చెబుతున్నాయి.






