చారగొండలో రాజపండితగల్లు
నాగర్‌కర్నూల్ జిల్లా మండల కేంద్రమైన చారగొండ గ్రామంలో శివాలయం పరిసరాల్లోని మూడు అరుదైన శిల్పాలను కొత్త తెలంగాణ చరిత్రబృందం సభ్యుడు యాదేశ్వర్ దండేతికర్ గుర్తించాడు. రాజపండితగల్లు ఒకటవది రాజకవి శిల్పం. అర్ధపద్మాసనంలో కూర్చున్న రాజు కుడిచేతపట్టిన ఖడ్గం మొనను ఎడమపాదం మీద విశ్రాంతంగా ఆనించాడు.
ఎడమచేత పుస్తకం ధరించాడు. నడినెత్తిసిగ మణిపట్టికతో అలంకరించబడ్డది. చెవులకు పెద్దకుండలాలున్నాయి. మెడలో హారాలున్నా యి. భుజంమీద జంధ్యం ఉంది. నడుమున ధట్టీ వుంది. దండరెట్టలకు పూసలదండలున్నాయి. చేతులకు కంకణాలున్నాయి. వేష, భూష ణాదులన్నీ రాజహోదావే. ఈ శిల్పం రాష్ట్రకూటశైలికి చెందిన రాజపండితగల్లు శిల్పం. గతంలో నాగర్‌కర్నూలు జిల్లాలోనే ‘పండితగల్లు’ శిల్పాలు రెండు లభించాయి. వాటికంటె ఈ శిల్పం విభిన్నమైంది.
భైరవుడు
రెండవది భైరవ శిల్పం. ఈ భైరవుడు జ్వాలాకేశాలతో కపాలమకుటం ధరించాడు. సర్ప కుం డలాలు, సర్పాలే హస్తభూషణాలు, సర్పహారం, కపాలమాల, కపాలమేఖలతో, కాళ్ళకు కడియాలతో, పాంజీబులతో, త్రిభం గిమలో వైతస్తికపాదాలతో చతుర్భుజభైరవుడు పరహస్తాలలో ఢమరుకం, త్రిశూలాలతో, నిజహస్తాలలో ఖడ్గం, రక్తపాత్రలతో పరహస్తాలలో ఢమరుకం, త్రిశూలాలతో, నిజహస్తాలలో ఖడ్గం, రక్తపాత్రలతో స్థానక శిల్పంగా కనిపిస్తున్నాడు. అతనికి రెండువైపుల బేతాళులు ఒకరు నాట్యం చేస్తుండగా, రెండవవాడు కూర్చుని రక్తంకోసం చేతులు చాపుతున్నాడు. ఈ భైరవుడు తాంత్రికమూర్తి. శైలిలో కాకతీయ శిల్పం.
సప్తమాతృకలు
దేవాలయ ప్రాంగణంలో సప్తమాతృకలను చెక్కిన రాతిదిమ్మె ఉంది. పూర్వం నుంచి ఉన్న మాతృకల క్రమం కాకుండా ఈ శిల్పపట్టికలో యమి, బ్రాహ్మి, మహేశ్వరి, వైష్ణవి, కౌమారి, ఇంద్రాణి, చాముండ దేవతలున్నారు. ఏడుగురు అమ్మదేవతల వరుసలో ఉండవలసిన వారాహి లేదు. అందరు దేవతలకన్న ముందుస్థానానికి చేరింది యమి. ఇది ఆధునికం అంటే 14, 15వ శతాబ్దాలకు చెందిన శిల్పం. ఈ తర్వాత సప్తమాతృకల క్రమంలో చేర్పులు, మార్పులు లేవు.
గుడిమెట్ల పక్కన ఉన్న కటాంజనాలు(రెయిలింగ్) చతుర్దళ పుష్పాలతో అలంకరించబడి వున్నాయి. దేవాలయ మంటపస్థలంలో కొన్ని స్తంభాలు అగుపిస్తున్నాయి. ఇవి శైలిని బట్టి రాష్ట్రకూట కాలానికి చెందినవి. అంతరాళ ద్వారబంధంలోని పతంగం మీద లలాటబింబంగా ‘గజలక్ష్మి’ చెక్కివుంది. గర్భాలయంలో పానవట్టంలో అమర్చిన ఛత్ర శిరోవర్తనంతో, లక్షణోద్ధార రేఖాసహిత లింగం ఉన్నది.
శ్రీరామోజు హరగోపాల్, కన్వీనర్, కొత్త తెలంగాణ చరిత్రబృందం
99494 98698






