27 July, 2026 | 1:46 AM

నేడు కీలక బిల్లు

27-07-2026 01:08 AM
  1. లోక్‌సభ ముందుకు.. 
  2. పేపర్ లీక్‌ల నియంత్రణకు కేంద్రం కఠిన చట్టం 
  3. ‘పబ్లిక్ ఎగ్జామినేషన్స్ సవరణ బిల్లు- సిద్ధం
  4. ఉన్నతస్థాయి టాస్క్‌ఫోర్స్ 
  5. నందన్ నిలేకని నేతృత్వంలో ఆరుగురు సభ్యులతో.. 
  6. విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటే జైలుకే 
  7. ప్రధాని మోదీ కీలక ప్రకటన

న్యూఢిల్లీ, జూలై 26: దేశవ్యాప్తంగా విద్యార్థుల్లో ఆందోళనకు కారణమైన నీట్, ఇతర నియామక పరీక్షల పేపర్ లీకేజీ ఘటనల నేపథ్యంలో కేంద్ర ప్రభు త్వం సరికొత్త వ్యూహంతో సిద్ధమైంది. ప్రభుత్వ ఉద్యోగాలు, ఉన్నత విద్య ప్రవేశ పరీక్షల్లో అక్రమాలకు పాల్పడే వారిపై ఉక్కుపాదం మోపేలా తీసుకువస్తున్న‘పబ్లిక్ ఎగ్జామినేషన్స్ (ప్రివెన్షన్ ఆఫ్ అన్‌ఫె యిర్ మీన్స్) సవరణ బిల్లు  సోమవారం లోక్‌సభలో ప్రవేశపెట్టనుంది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేం ద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేసిన కొన్ని గంటల్లోనే ఈ పరిణామా లు చోటు చేసుకున్నాయి. ఈ బిల్లును కేంద్ర మంత్రి జితేంద్రసింగ్ లోక్‌సభ ముందుకు తీసుకురానున్నారు.

బిల్లు ముసాయిదాను ఎంపీలకు కూడా పంపి ణీ చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. 2024 నాటి చట్టాన్ని మరింత బలోపేతం చేస్తూ నూతన ప్రతిపాదనలను కేంద్ర ప్రభుత్వం సిద్ధం చేసింది. దేశవ్యాప్తంగా ఇటీవల వెలుగుచూసిన వివిధ పోటీ పరీక్షల పేపర్ లీకేజీ ఉదంతాల నేపథ్యంలో కాక్రోచ్ జనతా పార్టీ సారథ్యంలో లక్షలాది మంది విద్యార్థులు ఢిల్లీతో పాటు దేశవ్యాప్తంగా నిరసనలకు దిగారు. వారి డిమాండ్లకు అనుగుణంగా ఈ సవరణలు అవసరమని భావించిన కేంద్రం.. చర్యలను వేగవంతం చేసింది. 

నూతన ప్రతిపాదనలు ఇవీ..

సవరణ బిల్లు ప్రకారం.. పరీక్షల్లో అక్రమాలకు లేదా మాల్ ప్రాక్టీస్‌లకు పాల్ప డే వ్యక్తులకు విధించే జైలు శిక్షను అయి దు నుంచి పదేళ్లకు పెంచాలని కేంద్రం ప్రతిపాదించింది. ప్రస్తుతం ఉన్న చట్టం ప్రకారం ఈ శిక్ష మూడేళ్ల నుంచి అయిదేళ్లు మాత్రమే. దీంతో పాటు వ్యక్తిగతంగా విధించే గరిష్ఠ జరిమానా పరిమితిని కూడా రూ.10 లక్షల నుంచి ఏకంగా రూ. 50 లక్షల వరకు పెంచనున్నారు. పరీక్షలను నిర్వహించే సర్వీస్ ప్రొవైడర్ల నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా కూడా కఠిన చర్యలకు కేంద్రం ప్రతిపాదనలు రూపొందించింది.

పరీక్షలను సక్రమంగా నిర్వహించడంలో విఫలమైతే విధించే గరిష్ఠ జరిమానాను రూ. కోటి నుంచి రూ.5 కోట్లకు పెంచింది. పరీక్షల నిర్వహణ నుండి సంబంధిత ప్రైవేటు ఏజెన్సీలు లేదా అనుబంధ సంస్థలను నిషేధించే బ్లాక్‌లిస్ట్ కాలాన్ని 4 నుంచి 8 సంవత్సరాలకు రెట్టింపు చేసింది. సంస్థలకు చెందిన డైరెక్టర్ల స్థాయి వ్యక్తులు ఉద్దేశపూర్వకంగా తప్పులకు పాల్పడితే వారికి కనీస జైలు శిక్షను మూడేళ్ల నుంచి ఐదేళ్లకు పెంచారు. వీరికి విధించే వ్యక్తిగత జరిమానాను కూడా రూ. కోటి నుండి రూ.5 కోట్ల వరకు పెంచుతున్నారు. ముఖ్యంగా వ్యవస్థీకత నేరాలకు (ఆర్గనైజ్డ్ క్రైమ్స్) పాల్పడే ముఠాలకు కనీస శిక్షను ఏడేళ్లకు పెంచడం, జరిమానాను రూ. 10 కోట్లుగా ప్రతిపాదించారు.

అత్యంత వేగవంతమైన న్యాయ విచారణ..

ఈ బిల్లు ద్వారా అత్యంత వేగవంతమైన న్యాయ విచారణకు ప్రత్యేక వ్యవస్థను ప్రతిపాదించారు. కేసు దర్యాప్తు ప్రక్రియను కేవలం రెండు నెలల్లోనే పూర్తి చేయాలని స్పష్టం చేశారు. హైప్రాధాన్యత లేదా అంతర్రాష్ట్ర పరీక్షల మోసాలను విచారించడానికి కేంద్రం ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేయనుంది. అలాగే ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేసి, రోజువారీ విచారణ ద్వారా ఛార్జ్‌షీట్ దాఖలైన వడు నెలల్లోపు ట్రయిల్ పూర్తి చేసేలా కఠిన కాలపరిమితిని విధించారు. లోక్‌సభలో సోమవారం నూతన బిల్లు ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.  

ఉన్నతస్థాయి టాస్క్‌ఫోర్స్..

పరీక్షల్లో అక్రమాలపై త్వరలో కఠిన చట్టం తెస్తామని, ప్రశ్నాపత్రాల లీకేజీల ప్రక్షాళనకు ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నందన్ నిలేకని నేతృత్వంలో ఉన్నత స్థాయి టాస్క్‌ఫోర్స్ కమిటీని ఏర్పాటు చేస్తానమి ప్రధాని మోదీ ప్రకటించారు. విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకున్న వారిని జైలుకు పంపిస్తామని హెచ్చరించారు. దేశంలో పరీక్షల వ్యవస్థపై ఆదివారం ఓ వీడియో సందేశం ద్వారా ఎక్స్ వేదికగా ప్రధాని మోదీ కీలక ప్రకటన చేశారు.

పరీక్షల వ్యవస్థలో పారదర్శకత కోసం ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నందన్ నిలేకని నేతృత్వంలో ఉన్నత స్థాయి టాస్క్‌ఫోర్స్ కమిటీని ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఇందులో సభ్యులుగా డాక్టర్ ఎస్ సోమనాథ్ (మాజీ ఇస్రో చైర్మన్), తపన్ డేకా (ఇంటెలిజెన్స్ బ్యూరో మాజీడైరెక్టర్), ప్రొఫెసర్ వి కామకోటి (ఐఐటీ మద్రాస్ డైరెక్టర్), అనితా కర్వాల్ (కేంద్ర విద్యాశాఖ మాజీ కార్యదర్శి), అమృత్ లాల్ మీనా (లాజిస్టిక్స్, పరిపాలనా నిపుణుడు) ఉంటారని వెల్లడించారు.

ఇందుకు సంబంధించిన బిల్లును సోమవారం పార్లమెంట్‌లో ప్రవేశపెడుతామని వెల్లడించారు. నిలేకని నేతృత్వంలోని కమిటీ త్వరలోనే తన నివేదికను ప్రభుత్వానికి సమర్పిస్తుందని, ఈ నివేదిక ఆధారంగా రాబోయే పరీక్షల నిర్వహణలో ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకుంటుందని వెల్లడించారు. విద్యార్థుల భవిష్యత్తును కాపాడేందుకు కేంద్రం చర్యలు తీసుకుంటున్నదని, వారి భవిష్యత్తుతో ఆడుకుంటే జైలుకు వెళ్లడం ఖాయమని హెచ్చరించారు. పేపర్ లేక్ చేసిన వారు ప్రస్తుతం జైలులో ఉన్నారని చెప్పారు.