10 March, 2026 | 7:06 AM

నీటి ఎద్దడి నిరసిస్తూ ఖాళీ బిందెలతో ర్యాలీ, ధర్నా

10-03-2026 12:34 AM

నీరు సరఫరా చేయాలని డీసీ కాళ్లు మొక్కిన బీఆర్‌ఎస్ నేత 

మేడ్చల్ అర్బన్, మార్చి 9 (విజయ క్రాంతి): మేడ్చల్ పట్టణంలో నీటి సమస్యపై బి ఆర్ ఎస్ ఆందోళన బాట పట్టింది. నీటి సమస్యను నిరసిస్తూ బి ఆర్ ఎస్ ఆధ్వర్యంలో సోమవారం పట్టణంలో భారీ ర్యాలీ, ధర్నా నిర్వహించారు. పట్టణంలో ప్రధాన వీధుల గుండా మున్సిపల్ కార్యాలయం వరకు ఖాళీ బిందెలతో భారీ ర్యాలీ నిర్వహించారు. మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు.

పట్టణంలోని రెండు డివిజన్లో తీవ్ర నీటి కొరత ఉందని వెంటనే పరిష్కరించాలని నినాదాలు చేశారు. మార్చి లోనే వారానికి ఒకసారి నీటి సరఫరా జరిగితే రాబోయే కాలంలో ఎలా ఉంటుందోనని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే మేడ్చల్ లో నీటి సమస్య ఏర్పడిందని బి ఆర్ ఎస్ నాయకులు ఆరోపించారు.

స్థానిక కాంగ్రెస్ నాయకులు నీటి సమస్య గురించి పట్టించుకోకపోవడం విచారకరమని  విమర్శించారు. బి ఆర్ ఎస్ ప్రభుత్వం హయాంలో మిషన్ భగీరథ ద్వారా పుష్కలంగా నీరు అందిందని అన్నారు. నీటి సమస్య పరిష్కరించకుంటే ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి ఆధ్వర్యంలో జలమండలి కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. 

డీసీ కాళ్లు మొక్కిన బి ఆర్ ఎస్ నేత 

ప్రజలు నీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నందున నీటి సమస్య పరిష్కరించాలని బి ఆర్ ఎస్ నాయకుడు, జిల్లా గ్రంథాలయ మాజీ చైర్మన్ భాస్కర్ యాదవ్ సైబరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ మేడ్చల్ డిప్యూటీ కమిషనర్ సుధాంశు కాళ్లు మొక్కి వేడుకున్నారు. డిసి ధర్నా దగ్గరికి రాగానే భాస్కర్ యాదవ్ సమస్య వివరిస్తూ కాళ్ళు మొక్కారు. వారానికి ఒకసారి కూడా మీరు సక్రమంగా రానందున ప్రజల ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. నీటి సమస్యను పరిష్కరించాలని వినతిపత్రం అందజేశారు.