11 July, 2026 | 9:18 PM

అంబేద్కర్ విగ్రహ ప్రారంభోత్సవానికి సర్వం సిద్ధం

11-07-2026 08:25 PM

మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి చేతుల మీదుగా ఆవిష్కరణ

ఎమ్మెల్యేలు, కలెక్టర్, ఎస్పీతో పాటు పలువురు ప్రముఖులు హాజరు

విగ్రహ స్థాపన కమిటీ పిలుపు

చుంచుపల్లి,(విజయక్రాంతి): చుంచుపల్లి మండలంలోని హౌసింగ్ బోర్డు కాలనీలో  నందా తండా గ్రామపంచాయతీ లో నూతనంగా ఏర్పాటు చేసిన భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహ ప్రారంభోత్సవానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని హౌసింగ్ బోర్డు అంబేద్కర్ విగ్రహ స్థాపన కమిటీ సభ్యులు శనివారం తెలిపారు. ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు నిర్వహించే ఈ కార్యక్రమాన్ని తెలంగాణ కార్మిక, ఉపాధి కల్పన, పరిశ్రమలు, గనులు, భూగర్భ వనరుల శాఖ మంత్రి డాక్టర్ గడ్డం వివేక్ వెంకటస్వామి ఘనంగా ప్రారంభించనున్నట్లు వెల్లడించారు.

అంబేద్కర్ ఆశయాలను భావితరాలకు చేరవేయాలనే సంకల్పంతో కాలనీలో ప్రజల సహకారంతో విగ్రహాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సమానత్వం, సామాజిక న్యాయం, రాజ్యాంగ విలువలను ప్రతి ఒక్కరూ ఆచరించాలనే సందేశాన్ని ఈ విగ్రహం సమాజానికి అందిస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సంబశివరావు, వర్ధన్నపేట ఎమ్మెల్యే కె.ఆర్. నాగరాజు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అంకిత్, జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారని తెలిపారు.

విలేకరుల సమావేశంలో హౌసింగ్ బోర్డు అంబేద్కర్ విగ్రహ స్థాపన కమిటీ అధ్యక్షుడు తుంపూరి శివ, కార్యదర్శి తాండ్ర వెంకటేశ్వర్లు, సభ్యులు శనగ వెంకటేశ్వర్లు, గొనె శ్రీకాంత్, గుర్రం లక్ష్మణ్, గడ్డం రగన్ బాబు, శనగ స్వామి తదితరులు పాల్గొని కార్యక్రమ వివరాలను వెల్లడించారు. కార్యక్రమం విజయవంతం కావడానికి స్థానిక ప్రజలు, దాతలు, యువకులు, కమిటీ సభ్యులు అందరూ సమిష్టిగా కృషి చేస్తున్నారని వారు తెలిపారు.