రియల్ ఎస్టేట్ వ్యాపారి బాణాల రాంరెడ్డి ఆత్మహత్య
కందుకూరు ఫామ్‌హౌజ్‌లో విషాదం
మహేశ్వరం, సెప్టెంబర్ 10(విజయక్రాంతి): ప్రముఖ రియల్ ఎస్టేట్ (Real Estate) వ్యాపారి, ’హోమ్ల్యాండ్’ గ్రూప్ అధినేత బాణాల రామ్రెడ్డి ఆత్మహత్యకు పాల్పడటం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం నేదు నూరు గ్రామంలోని తన ఫామ్హౌస్లో ఆయన ఉరివేసుకుని మృతి చెందారు.
వివాదాలు, అప్పుల ఊబిలో ప్రాజెక్ట్.....
రామ్రెడ్డి హైదరాబాద్లోని మణికొండలో నివాసముంటూ వ్యాపార లావాదేవీలు నిర్వహిస్తున్నారు. 2018లో పటాన్చెరు ప్రాంతంలో సుమారు 250 ఎకరాల విస్తీర్ణంలో భారీ లేఅవుట్ (వెంచర్) అభివృద్ధికి శ్రీకారం చుట్టారు.
అయితే, సదరు భూమికి సంబంధించి తీవ్రమైన కోర్టు వివాదాలు, లిటిగేషన్లు తలెత్తడంతో ప్రాజెక్టు పనులు నిలిచిపోయి తీవ్ర ఆలస్యమైంది. ఈ వివాదాలను సర్దుబాటు చేయడానికి, ప్రాజెక్టును ముందుకు నడిపించడానికి ఆయన పెద్ద ఎత్తున అప్పులు చేసినట్లు తెలిసింది. ఒకవైపు వడ్డీల భారం పెరిగిపోవడం, మరోవైపు భూ యజమానులతో పాటు కొందరు రాజకీయ నాయకుల నుంచి కూడా తీవ్రస్థాయిలో ఒత్తిళ్లు ఎదురవడంతో ఆయన తీవ్ర మనస్తాపానికి గురైనట్లు సమాచారం.
సూసైడ్ నోట్ లభ్యం...
సంఘటనా స్థలంలో కందుకూరు సీఐ వెంకటేశ్వర్లు నేతృత్వంలో పోలీసులు పరిశీలన జరిపి, రామ్రెడ్డి రాసిన సూసైడ్ నోట్ను స్వాధీనం చేసుకున్నారు. ఆర్థిక ఇబ్బందులు, మానసిక ఒత్తిడి వల్లే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు అందులో పేర్కొన్నట్లు ప్రాథమికంగా సమాచారం.
మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రామ్రెడ్డి ఆత్మహత్యకు ఆర్థిక సమస్యలే కాకుండా రాజకీయ ఒత్తిళ్లు లేదా ఇతర బెదిరింపులు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో సమగ్ర విచారణ జరుపుతున్నట్లు సీఐ పేర్కొన్నారు.