13-02-2026 12:00:00 AM
కృత్రిమ మేధ (ఏఐ) సాంకేతికతను వాడి అబద్ధాలను నిజాలుగా నమ్మించే ప్రయత్నాలు పెరిగిపోతున్నాయి. ఏఐ పుణ్యమా అని నిజాన్ని పసిగట్టడంలో విఫలమవుతున్నాం. ఫలితంగా సమస్యల వలయంలో చిక్కుకుపోవాల్సి వస్తున్నది. సామాన్య ప్రజల నుంచి వీఐపీల దాకా అందరూ ఏఐ ముప్పుకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో ఏఐ సాయంతో సృష్టించే డీప్ ఫేక్, అవాస్తవాలతో కూడిన కంటెంట్ పై కేంద్ర ప్రభుత్వం కొరడా ఝళిపించింది.
ఇకపై ఏఐతో సృష్టించే కంటెంట్‌కి లేబుల్ తప్పనిసరి వేయాలని ఆదేశాలు జారీ చేయడం ముదావహం. అంతేకాదు అశ్లీల, నిషేధిత సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్న సోషల్ మీడి యా ప్లాట్‌ఫామ్‌లు మూడు గంటల్లోగా వాటిని కచ్చితంగా తొలగించాల్సిందేనని, లేకపోతే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించింది. ఏఐ కంటెంట్‌ను రూపొందించింది ఎవరన్న వివరాలు లేబుల్‌పై స్పష్టంగా పేర్కొనాలని తెలిపింది.
కేంద్రం జారీ చేసిన నిబంధనలు ఈ నెల 20వ తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి. సాంకేతికకు కొత్త సొగసులు అద్ది అనతికాలంలోనే అభివృద్ధికి కేంద్రంగా నిలిచిన ఏఐ అంతే వేగంగా సమాజానికి ముప్పుగా పరిణమించడం ఆలోచించాల్సిన అంశం. ఏఐ సృష్టించే డీప్‌ఫేక్ సమాచారం వల్ల తమ ప్రతిష్ఠకు భంగం కలుగుతుందంటూ ఇటీవలే కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్, రాజ్యసభ ఎంపీ సుధామూర్తి సహా సినీరంగం నుంచి పెద్ద ఎత్తున ఫిర్యాదులు వెల్లువెత్తాయి.
నిజానికి కృత్రిమ మేధ సృష్టిస్తున్న అద్భుతాల్లో మంచి ఎంత ఉందో, అంతకుమించి చెడూ ఉంది. ఏఐతో నకిలీ వీడియోలు సృష్టిస్తున్న మోసగాళ్లు ఆర్థిక సమస్యలతో సతమతమయ్యే సామాన్య ప్రజలను లక్ష్యంగా చేసుకుంటున్నారు. వారి అవసరాలను, బలహీనతలను సొమ్ము చేసుకు నేందుకు సినీ, ఇతర ప్రముఖుల పేర్లను ఎరగా వాడుకుంటున్నారు. ఏఐను ఉపయోగించి సాగిస్తున్న అతిపెద్ద కుంభకోణంలో సామాన్యులు బలవుతున్నారు.
గతంలో సామాజిక మాధ్యమాల్లో వచ్చే వార్తలనూ, ఫో టోలను పెద్దగా పట్టించుకునేవారు కారు. కానీ ఏఐ రాకతో నష్టపోతున్న బాధితులు సంఖ్య పెరిగిపోతున్నది. ఏఐ పేరుతో మోసాలకు పాల్పడుతున్న నేరగాళ్లకు ముకుతాడు వేసేందుకే కొత్త నిబంధనలు తీసుకు రావడం మంచిదని చెప్పొచ్చు. కేంద్రం జారీ చేసిన నిబంధనల్లో లేబులింగ్ అత్యంత ప్రధానమైనది. ఇందులో వినియోగదారుల డిక్లరేషన్స్, జవాబుదారీతనం కచ్చితంగా ఉండాలని ఆదేశించింది.
ఏఐ చాట్‌బోట్ టూల్స్ ఎంత ప్రమాదకరమో చెప్పడానికి సామాజిక మాధ్యమం ‘ఎక్స్’కు చెందిన ‘గ్రూక్’ టూల్ ఒక ఉదాహరణ. గ్రూక్ టూల్ ద్వారా సైబర్ నేరగాళ్లు మహిళల చిత్రాలను అశ్లీలంగా మార్చి ఎక్స్‌లో పోస్టు చేస్తుండడంపై నేటికీ ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఏఐ టూల్స్‌తో పెను ప్రమాదం పొంచి ఉందని, వాటితో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరముందని పేర్కొన్న ఏఐ సంస్థ ఆంథ్రోపిక్ టీమ్ లీడర్ మృణాంక్ శర్మ తన పదవికి రాజీనామా చేశారు.
తాజాగా మరో ఏఐ ఇంజనీర్ హ్యఫామ్ కూడా ఉద్యోగానికి రాజీనామా చేశారు. ఏఐ టూల్స్ వల్ల భవిష్యత్తులో ఉద్యోగాలకు ముప్పు కలగడంతో పాటు మానవ జీవనంపై తీవ్ర ప్రభావం చూపనుందని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ప్రపంచ దేశాలన్నీ కలసికట్టుగా భద్రతతో కూడిన ఏఐ కోసం శ్రమించాల్సిన అవసరముంది.