calender_icon.png 21 February, 2026 | 2:23 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కరువు నివారణ చర్యలు చేపట్టాలి!

13-02-2026 12:00:00 AM

ప్రగతి పథంలో దూసుకుపోతున్న భారతదేశానికి కరువు, ఎడారీకరణ పెను సవాళ్లుగా మారాయి. ఒక ప్రాంతంలో సుదీర్ఘ కాలం పాటు వర్షపాతం గణనీయంగా తగ్గి, పంటలు పండని దారుణ పరిస్థితినే  కరువు అని పిలుస్తున్నాం. భారత వాతావరణ శాఖ ప్రమాణాల ప్రకారం, వార్షిక వర్షపాతంలో 25 శాతం కంటే ఎక్కువ లోటు ఉంటే దానిని కరువుగా, 50 శాతం దాటితే ‘తీవ్రమైన కరువు’గా పరిగణిస్తారు.

ఇది కేవలం నీటి కొరతతో ముగిసే సమస్య కాదు. వాతావరణం నుంచి ప్రారంభమై వ్యవసాయ, జల, పర్యావరణ రంగాలకు విస్తరిస్తూ మన జీవవైవిధ్యాన్ని అతలాకుతలం చేస్తోంది. స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి మన దేశం 1965-67, 1972--73, 1979-80, 1985--88 కాలాల్లో భయంకరమైన కరువులను ఎదుర్కొంది. గణాంకాల ప్రకారం, దేశ భౌగోళిక విస్తీర్ణంలో సుమారు 68 శాతం ప్రాంతం ఏదో ఒక స్థాయిలో కరువు ముప్పును ఎదుర్కొంటూ వస్తున్నది.

అయితే కరువును కేవలం ప్రకృతి వైపరీత్యంగా చూడటం ప్రాథమిక పొరపాటు. బలహీనమైన రుతుపవనాలు వంటి సహజ కారణాలు ఉన్నప్పటికీ, మానవ తప్పిదాల పాత్ర ఇందులో చాలా ఎక్కువగా ఉంది. అడవుల నరికివేత, అనియంత్రిత మానవ కార్యకలాపాలు, వాతావరణ మార్పుల వల్ల సారవంతమైన భూములు బంజరుగా మారుతున్నాయి. పశువుల అతిమేత, సహజ వృక్ష సంపదను నాశనం చేయడం, దీర్ఘకాలికంగా ఒకే రకమైన పంటలను పండించడం వల్ల భూమి నిస్సారమవుతోంది.

దీనికి తోడు గ్లోబల్ వార్మింగ్, ఎల్-నినో వంటి అంతర్జాతీయ వాతావరణ మార్పులు రుతుపవనాల గమనాన్ని మార్చివేస్తున్నాయి. సగటు వర్షపాతం నమోదైనప్పటికీ అనేక ప్రాంతాలు నీటి ఎద్దడిని ఎదుర్కోవడం వెనుక అస్తవ్యస్తమైన నీటి యాజమాన్య పద్ధతులే ఉన్నాయి. చెరువులు, కుంటలు వంటి సంప్రదాయ వనరులను నిర్లక్ష్యం చేయడం వల్ల వర్షపు నీరు భూమిలోకి ఇంకకుండా వృథాగా పోతోంది. ఇది మానవ నిర్మిత సంక్షోభమే.

ఈ జాతీయ విపత్తును ఎదుర్కోవాలంటే కేవలం ప్రభుత్వ పథకాలే కాకుండా ప్రజా భాగస్వామ్యం కూడా ఎంతో అవసరం. ఆధునిక సాంకేతికతను ఉపయోగించి కరువును ముందే పసిగట్టడం ఒక కీలకమైన అడుగు. రిమోట్ సెన్సింగ్, జియోగ్రాఫిక్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ వంటి సాంకేతికత ద్వారా భూమిలోని తేమను, మేఘాల గమనాన్ని పర్యవేక్షించి రైతులను ముందే అప్రమత్తం చేయవచ్చు. అలాగే కృత్రిమ మేధ, డేటా అనలిటిక్స్ ద్వారా గత దశాబ్దాల వాతావరణ సమాచారాన్ని విశ్లేషించి భవిష్యత్తు అంచనాలను రూపొందించవచ్చు.

ఈ సమాచారం రైతులకు ఏ పంటలు వేయాలి, ఎప్పుడు విత్తనాలు చల్లాలి అనే విషయాల్లో వ్యక్తిగతీకరించిన సలహాలను అందిస్తుంది. డ్రోన్ సాంకేతికతను ఉపయోగించి తక్కువ నీటితో మందులు చల్లడం, స్మార్ట్ సెన్సార్ల ద్వారా మొక్కలకు అవసరమైన మేరకే నీటిని విడుదల చేయడం వంటి పద్ధతులను అవలంబించాలి.

ప్రభుత్వం చేపడుతున్న ‘జల శక్తి అభియాన్’ వంటి కార్యక్రమాలు క్షేత్రస్థాయిలో ప్రజల భాగస్వామ్యంతో విజయవంతం కావాలి. ప్రకృతితో మమేకమై వనరులను విజ్ఞతతో వాడుకున్నప్పుడే, మనం రాబోయే తరాలకు సస్యశ్యామలమైన కరువు రహిత భారతదేశాన్ని అందించగలము.

 డీజే మోహనరావు, నల్లగొండ