ఉద్యోగ విరమణ ఉద్యోగానికి మాత్రమే.. జ్ఞానానికి కాదు
పీజీటి తెలుగు ఉపాధ్యాయుడు దంతోజు సత్యంకు ఘన సన్మానం
మొయినాబాద్, ఏప్రిల్ 1 (విజయక్రాంతి): చిలుకూరు గురుకుల పాఠశాల & కళాశాలలో పీజీటి తెలుగు ఉపాధ్యాయుడు దంతోజు సత్యం పదవీ విరమణ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. విద్యార్థుల ఆటపాటలు, సాంస్కృతిక కార్యక్రమాలతో సభ ప్రాంగణం మారుమోగింది.కార్యక్రమంలో ముందుగా జ్యోతి ప్రజ్వలనం చేసి, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
అనంతరం నిర్వహించిన సభలో పాఠశాల ప్రధానాచార్యులు శౌరి రాజు మాట్లాడుతూ, సుదీర్ఘంగా 36 సంవత్సరాలు సేవలందించిన సత్యం ఎంతోమంది పేద విద్యార్థులకు జ్ఞానం అందించి వారి భవిష్యత్తును నిర్మించారని కొనియాడారు. ఉపాధ్యాయ వృత్తి అన్నిటికంటే గొప్పదని, సత్యం చేసిన సేవలు ఆదర్శంగా నిలుస్తాయని అన్నారు. చిలుకూరు పేరెంట్స్ కమిటీ చైర్మన్ బేగరి రాజు మాట్లాడుతూ,
పదవీ విరమణ ఉద్యోగానికి మాత్రమే తప్ప వ్యక్తికి కాదని, ఉపాధ్యాయుడు అందించిన జ్ఞానం ఎప్పటికీ నిలిచే సంపద అని పేర్కొన్నారు. విద్యార్థులు గురువుల పాఠాలను ఆదర్శంగా తీసుకుని ఉన్నత స్థానాలకు ఎదగాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ ప్రిన్సిపాల్ అశోక్ బాబు, ఉపాధ్యాయులు దేవేందర్ గౌడ్, లక్ష్మణరావు, మల్లయ్య, ఎం. రవీందర్ గౌడ్, రవీందర్, పీడీ ఆదిబాబు, పీటీ గురువయ్య, విష్ణు, సునీత, ఇతర పాఠశాలల ఉపాధ్యాయులు, పేరెంట్స్ కమిటీ సభ్యులు, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.




