ఇసుకకు నకిలీ పర్మిషన్లు..!
- సర్పంచ్ సంతకాలతో అనుమతులు
- తిర్మలాపూర్ లో జోరుగా ఇసుక అక్రమ రవాణా
- అనుమతి లేకపోయినా ఆదాయ వనరుగా ఇసుక రవాణా
- అటువైపు చూడని అధికార యంత్రాంగం
చిన్నచింతకుంట (కౌకుంట్ల), జూన్ 14: ప్రభుత్వ నిబంధనలను పూర్తిగా తుంగలో తొక్కుతూ కొందరు ఇసుకను అక్రమంగా రవాణా చేస్తున్న ఉదంతం కౌకుంట్ల మండల పరిధిలోని తిరుమలాపూర్ శివారులో వెలుగులోకి వచ్చింది. పగలు, రాత్రి అనే తేడా లేకుండా ఇక్కడి ఊక చెట్టు వాగు నుండి ట్రాక్టర్ల ద్వారా ఇసుకను యథేచ్ఛగా తరలిస్తూ అక్రమార్కులు మూడు పువ్వులు ఆరు కాయలుగా వ్యాపారం సాగిస్తున్నారు.
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పేరుతో, మహిళా సంఘాల భవన నిర్మాణాల ముసుగులో కొందరు అక్రమార్కులు ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి కొడుతున్నారని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దేవరకద్ర నియోజకవర్గం ఎమ్మెల్యే సొంత మండల పరిధిలో అనుమతులు లేకుండా ఇసుక అక్రమంగా తరలిస్తున్నారని ఆ ప్రాంతవాసులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
ఇసుకలో కూరుకుపోయిన ట్రాక్టర్లు
వాగు నుండి ఇసుకను అక్రమంగా లోడ్ చేసుకుని తరలిస్తుండగా, కొన్ని ట్రాక్టర్లు ఇసుకలో తీవ్రంగా కూరుకుపోయాయి వాటిని బయటకు తీసేందుకు స్థానిక కార్మికులు, ఇతర ట్రాక్టర్ల సహాయంతో శ్రమిస్తున్న అయినప్పటికీ అక్రమార్కులు ఏమాత్రం వెనకడుగు వేయకుండా తమ పనిని కానిచ్చేస్తున్నారు.
నిబంధనలు బేఖాతరు..సర్పంచే పర్మిషన్!
ఇసుక రవాణాకు సంబంధించి ప్రభుత్వం ఎంతో పారదర్శకంగా ’ఈ-ఇసుక వాహన పోర్టల్’ ను ప్రవేశపెట్టింది. దీని ద్వారా మాత్రమే ఆన్లైన్లో అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. కానీ తిరుమలాపూర్ లో మాత్రం సర్పంచ్ తన సొంత లెటర్ ప్య్పా సంతకం చేసి, ముద్ర వేసి ఇచ్చిన కాగితాలతోనే ఇసుకను తరలిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం లభించింది.
గత నెలలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల కోసం అంటూ సర్పంచ్ టి. సుజాత సంతకం, ముద్రతో ఉన్న ఒక ’ధృవీకరణ పత్రం’ తేదీ: 12/05/26 ఆ పత్రంలో ఇందిరమ్మ ఇంటి నిర్మాణం కొరకు 4 ట్రిప్పుల ఇసుక తోలుకొనుటకు ట్రాక్టర్ నంబర్ TS 06 EK 3125 (శ్రీనివాసులు ట్రాక్టర్) కు అనుమతి ఇస్తున్నట్లు స్పష్టంగా రాసి ఉంది. అధికారుల లాగిన్ లేకుండా అనుమతులు ఎలా ఇస్తారు? అనే సందేహనికి అర్థం లభించడం లేదు.
నిజానికి ఇసుక రవాణాకు అనుమతి ఇచ్చే అధికారం కేవలం ఎంఆర్‌ఓ, సంబంధిత శాఖ సెక్రటరీ అధికారుల అధికారిక లాగిన్ ద్వారా మాత్రమే ఉంటుంది. అలాంటప్పుడు ఒక గ్రామానికి చెందిన సర్పంచ్ తన సొంత లెటర్ ప్య్పా ఇసుక తరలింపునకు అనుమతులు ఎలా ఇస్తారనేది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. ఈ విషయంపై గ్రామ సభల్లో ఎంతో మంది ప్రశ్నించినప్పటికీ, పంచాయతీ కార్యదర్శి గానీ, ఇతర అధికారులు గానీ దీనిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. తాము ఎటువంటి ఆఫ్లైన్ అనుమతులు ఇవ్వలేదు.
ఇసుక రవాణాకు సంబంధించి పూర్తి ప్రక్రియ ఆన్లైన్ లోనే జరుగుతుంది. సర్పంచ్లు సంతకాలతో అనుమతులు ఇస్తున్నారనే విషయం మా దృష్టికి రాలేదు. ఒకవేళ అలా నిబంధనలకు విరుద్ధంగా ఇసుక తరలిస్తే చట్టపరమైన చర్యలు ఉంటాయి. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తమని పంచాయతీ కార్యదర్శి పవన్ కుమార్ తెలిపారు. మా వైపు నుండి ఎవరికీ అనుమతులు ఇవ్వలేదు. సర్పంచ్లకు ఇసుక పర్మిషన్లు ఇచ్చే అధికారం అస్సలు లేదు.
ఒకవేళ అలా ఇస్తే అది పూర్తిగా చట్టవిరుద్ధం. తిరమలాపూర్లో జరుగుతున్న ఈ వ్యవహారంపై జిపిఓకి, అలాగే మండల పోలీస్ స్టేషన్ ఎస్‌ఐ సమాచారం అందించి తక్షణమే తనిఖీలు చేయిస్తామని కౌకుంట్ల తాసిల్దార్ తెలిపారు. సంబంధిత గ్రామ సర్పంచ్ భర్త ఈ విషయంపై స్పందిస్తూ స్థానికులకు ఇబ్బందులు కలగకూడదని అధికారులకు సమాచారం అందించి ఇసుక రవాణా చేయించినట్లు పేర్కొన్నారు.
కఠిన చర్యలు తీసుకోవాలంటున్నా స్థానికులు
చింతకుంట పోలీస్ స్టేషన్ పరిధిలోకి వచ్చే ఈ ప్రాంతంలో జరుగుతున్న ఇసుక అక్రమ రవాణాపై తక్షణమే రెవెన్యూ మరియు పోలీస్ అధికారులు సంయుక్తంగా స్పందించి, తనిఖీలు చేపట్టాలని.. సర్పంచ్ సంతకాలతో సాగుతున్న ఈ నకిలీ అనుమతుల దందాపై విచారణ జరిపి అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.






