15 June, 2026 | 1:14 AM

బోధన్‌లో విచ్చలవిడిగా వాటర్ ప్లాంట్లు..

15-06-2026 12:13 AM
  1. మినరల్ పేరుతో జనరల్ వాటర్ ప్లాంట్లు
  2. ప్రమాణాలు పాటించని నిర్వాహకులు 
  3. ఎక్కడ పడితే అక్కడ ఏర్పాటు
  4. మినరల్ పేరుతో విక్రయిస్తూ ప్రజల ప్రాణాలతో  చెలగాటం
  5. వాటర్ ఎలర్జీతో బోధన్ జిల్లా ఆస్పత్రిలో నమోదైన కేసులు

బోధన్, జూన్14 (విజయక్రాంతి): బోధన్ నియోజకవర్గంలో మినరల్ వాటర్ ప్లాంట్ల పేరుతో ఎక్కడ పడితే అక్కడ వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేసి విక్రయిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. కొందరు నిర్వాహకులు కనీస నాణ్యత ప్రమాణాలు పాటించకుండా కాసులకు కక్కుర్తిపడి విచ్చల విడిగా ప్లాంట్లు ఏర్పాటు చేస్తూ ప్రజల ఆరోగ్యం పాలిట శాపంగా మారుతున్నారు.

బోధన్ పట్టణంతో పాటు 5మండలాల్లో 350 పైగా అధికారుల లెక్కలు చెబుతున్నాయి. బోధన్ పట్టణంలోనే 190 పైగా వాటర్ ప్లాంట్లు ఉన్నట్లు చెప్పారు. అందులో 25 వాటర్ ప్లాంట్లకు లైసెన్సు  లేవని తెలిపారు. ఏర్పాటు చేసిన వాటర్ ప్లాంట్లలో ఐఎస్‌ఐ ప్రమాణాలతో కూడిన ప్లాంట్లు, పరికరాలు ఏర్పాటు చేసి తాగునీటిని శుద్ధి చేయాల్సి ఉంటుంది. కానీ అందుకు విరుద్ధంగా ప్లాంట్లు కొనసాగడంతో ప్రజలు రోగాల బారిన పడుతున్నారు. బోధన్ పట్టణంలో చాలామందికి వాటర్ ఎలర్జీ వ్యాధులు వస్తున్నాయని బోధన్ జిల్లా ఆస్పత్రిలో కేసుల నమోదు అయిన వివరాలు ఉన్నాయి.

ఆటోలపై ఇంటింటికి తిరుగుతూ వేసే మంచినీళ్ల బాటిళ్లలో నాచు పేరుకుపోయిన అలాగే విక్రయించడం గమనర్హం. సంబంధిత శాఖ అధికారులు వాటర్ ప్లాంట్లను పరిశీలించి అనుమతులు లేకుండా, నాణ్యత ప్రమాణాలు పాటించకుండా కొనసాగిస్తున్న వాటర్ ప్లాంట్లను సీజ్ చేసి తగు చర్యలు తీసుకుంటే బాగుంటుందని ప్రజలు కోరుతున్నారు. పట్టణంలోని పలు కాలనీలు, ప్రధాన రహదారుల వెంట కొత్తగా వాటర్ ప్లాంట్లు ఏర్పాటు అవుతుండగా, వాటి అనుమతులు, నిర్వహణ విధానం, నీటి నాణ్యత ప్రమాణాలపై స్థానికులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.

స్థానికుల కథనం ప్రకారం, అనేక వాటర్ ప్లాంట్లు రోజువారీగా భారీ స్థాయిలో భూగర్భ జలాలను వినియోగిస్తున్నాయి. ఇప్పటికే వేసవి కాలంలో నీటి ఎద్దడి సమస్యను ఎదుర్కొంటున్న ప్రాంతాల్లో నియంత్రణ లేకుండా భూగర్భ జలాల వినియోగం కొనసాగితే భవిష్యత్తులో తీవ్ర నీటి సంక్షోభం తలెత్తే ప్రమాదం ఉందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు, పట్టణంలో నిర్వహణలో ఉన్న అన్ని వాటర్ ప్లాంట్లు సంబంధిత శాఖల నుంచి అవసరమైన అనుమతులు పొందాయా? నిర్దిష్ట వ్యవధిలో నీటి నాణ్యత పరీక్షలు నిర్వహిస్తున్నాయా? ప్రజలకు సరఫరా చేస్తున్న నీరు భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా ఉందా? అనే అంశాలపై అధికారులు స్పష్టత ఇవ్వాలని స్థానికులు కోరుతున్నారు.

వాటర్ ప్లాంట్ల ఏర్పాటు వల్ల కొంత మేర ఉపాధి అవకాశాలు కలుగుతున్నప్పటికీ, సరైన నియంత్రణ లేకుండా యూనిట్లు పెరగడం వల్ల భూగర్భ జలాల క్షీణత, పర్యావరణ సమతుల్యత దెబ్బతినడం, ప్రజారోగ్య సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశాలను విస్మరించరాదని పర్యావరణవేత్తలు సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో బోధన్ పట్టణంలోని అన్ని వాటర్ ప్లాంట్లపై సంబంధిత శాఖలు సమగ్ర తనిఖీలు నిర్వహించి, అనుమతులు, భూగర్భ జలాల వినియోగం, నీటి నాణ్యత ప్రమాణాలపై ప్రజలకు పూర్తి వివరాలు వెల్లడించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. పట్టణంలో విచ్చలవిడిగా పెరుగుతున్న వాటర్ ప్లాంట్ల వ్యవహారం ప్రస్తుతం ప్రజల్లో తీవ్ర చర్చకు దారితీస్తోంది.

ఐస్ తో ఆరోగ్యం తుస్

వేసవిలో ఎండ తాపం తట్టుకోలేక గొంతు చల్లార్చుకుందామని ఐస్ వేసిన జ్యూస్, లస్సీ, చెరుకుపాలు తదితర పానీయాలు తాగితే ఆరోగ్యం తుస్ మంటుంది. తడి గుడ్డతో గొంతుకోయడం అంటారే ఇదీ అంతే. ఐస్ వేసిన పానీయాలు తాగగానే గొంతులో చల్లగా ఉంటుంది. నిదానంగా ఆ చల్లదనం కడుపులోకి వెళ్లి మనస్సు ఉల్లాసమనిపిస్తోంది. అయితే కడుపులోకి చల్లదనంతో పాటు బ్యాక్టీరియా, ఇతర క్రిమి కీటకాలు ప్రవేశించి జీర్ణకోశ వ్యాధులకు దారి తీస్తాయి.

ప్రస్తుతం మార్కెట్లో పానీయాలు చల్లబరిచేందుకు ఉపయోగించే ఐస్గడ్డలన్ని పరిశ్రమల అవసరాల కోసం తయారు చేసేవే. చేపలు, రొయ్యలు, ఇతర పానీయాలు నిల్వ ఉంచిన పాత్రల బయట వైపు ఉపయోగించడానికి మాత్రమే ఈ ఐస్ వాడాలి. కానీ చెరుకురసం, లస్సీ, మజ్జిగ, పలు పండ్లు రసాల పానీయాల్లో విరివిగా ఐస్ను కలుపుతున్నారు.

అయితే ప్రమాణాలు పాటించని ఐస్లో ఆరోగ్యాన్ని పాడుచేసే బ్యాక్టీరియాలు ఎక్కువగా ఉంటాయి. కొందరు నాణ్యత ప్రమాణాలు పాటించకుండా ఐస్ను తయారు చేస్తున్నారు. ఈ ఐస్ వేసిన పానియాలు తాగడం వల్ల మొదట చిన్న పేగు, పెద్ద పేగుల్లో బ్యాక్టీరియా చేరి ప్రాణాంతకరమైన వ్యాధులు సంభవిస్తాయని వైద్యనిపుణులు పేర్కొంటున్నారు. అందుకనే ఐస్ వేయని పదార్థాలు తాగడమే ఉత్తమం. సంబంధిత అధికారులు ఐస్ ఫ్యాక్టరీలల్లో తనిఖిలు చేసి ప్రమాణాలు పాటించని నిర్వాహకులపై చర్యలుతీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.