విద్యుత్ సమస్యల పరిష్కారానికి సర్పంచ్ చొరవ
గంభీరావుపేట,(విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా(Rajanna Siricilla District) గంభీరావుపేటలో నెలకొన్న దీర్ఘకాలిక విద్యుత్ సమస్యల పరిష్కారానికి సర్పంచ్ మల్లుగారి పద్మ నర్సాగౌడ్ చొరవ తీసుకున్నారు. బుధవారం విద్యుత్ శాఖ డీఈ అంజయ్య(Electricity Department DE Anjaiah), ఏఈ ఆనంద్ కుమార్‌లను కలిసి గ్రామంలోని పలు విద్యుత్ సమస్యలను వారి దృష్టికి తీసుకెళ్లారు. సమస్యల పరిష్కారం కోసం అవసరమైన పనుల జాబితాను అధికారులకు సమర్పించారు.
ఈ సందర్భంగా గాంధీ ఏరియా, రెడ్డి కాలనీలకు కొత్త ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు చేయడం, సుభాష్‌నగర్‌లో లో వోల్టేజ్, లూజ్ కనెక్షన్ సమస్యలను నివారించడం, బరిగెల గూడెం ప్రాంతంలో పాత ట్రాన్స్‌ఫార్మర్ స్థానంలో కొత్తదాన్ని ఏర్పాటు చేయడం వంటి అంశాలను ప్రాధాన్యంగా ప్రస్తావించారు. అదేవిధంగా పాత థియేటర్ ప్రాంతంలోని ట్రాన్స్‌ఫార్మర్‌ను సురక్షిత ప్రదేశానికి తరలించడం, సుభాష్‌నగర్, రామాలయం, సీతారాం బజార్, న్యూ బీసీ కాలనీ, ఎస్సీ కాలనీల్లో అవసరమైన చోట విద్యుత్ స్తంభాలు, వీధి దీపాలు ఏర్పాటు చేయాలని కోరారు.
బతుకమ్మ వేడుకలు జరిగే ప్రదేశాల్లో కూడా తగిన విద్యుత్ సౌకర్యాలు కల్పించాలని, గ్రామంలోని అన్ని వార్డుల్లో లో వోల్టేజ్, లూజ్ కనెక్షన్ సమస్యలను గుర్తించి పరిష్కరించాలని అధికారులను విజ్ఞప్తి చేశారు.సర్పంచ్ ప్రతిపాదనలను పరిశీలించిన విద్యుత్ శాఖ అధికారులు సమస్యలను ప్రాధాన్యత క్రమంలో దశలవారీగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. గ్రామ ప్రజలకు మెరుగైన విద్యుత్ సరఫరా అందించేందుకు త్వరితగతిన పనులు చేపడతామని తెలిపారు.