ఇన్‌ఫ్రా రుణాలపై వడ్డీ రేటు పెంపునకు ఎస్బీఐ సిద్ధం
న్యూఢిల్లీ, మే 26: ఇన్‌ఫ్రా ప్రాజెక్టులు, కమర్షియల్ రియాల్టీ ప్రాజెక్టులకు ఇచ్చే రుణాలపై వడ్డీ రేటు పెంచడానికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) సిద్ధమయ్యింది. ఈ మేరకు కొత్త ప్రాజెక్ట్ ఫండింగ్ విధానానికి శ్రీకారం చుట్టింది. ఇన్‌ఫ్రా రుణాలపై అధిక కేటాయింపులు జరపాలన్న రిజర్వ్‌బ్యాంక్ ప్రతిపాదనలు అమలులోకి వస్తే తమకు పెరిగే వ్యయాల్ని రుణగ్రస్తుడికి బదిలీ చేసేలా లోన్ డాక్యుమెంట్‌లో ఒక క్లాజ్‌ను పొందుపర్చి కొత్త ఇన్‌ఫ్రా రుణాల్ని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇస్తున్నట్టు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ప్రాజెక్టు రుణాల ఫైనాన్సింగ్, అకౌంటింగ్‌పై రిజర్వ్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా మే నెల తొలినాళ్లలో ముసాయిదా మార్గదర్శకాలను జారీచేసింది.
నిర్మాణంలో ఉన్న ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, కమర్షియల్ రియల్ ఎస్టేట్ రుణాలపై బ్యాంక్‌లు వాటి ఖాతాల్లో 5 శాతం ప్రొవిజన్లు ఉంచాలని ఆ మార్గదర్శకాల్లో ఆర్బీఐ ప్రతిపాదించింది. ప్రస్తుతం బ్యాంక్‌లు కమర్షియల్ రియల్ ఎస్టేట్ రుణాలపై 1 శాతం, రెసిడెన్షియల్ హోం ప్రాజెక్టులపై 0.75 శాతం, ప్రాజెక్ట్ ఫైనాన్స్‌తో సహా ఇతర అన్ని రుణాలపై 0.40 శాతం చొప్పున కేటాయింపులు జరుపుతున్నాయి. తాజా ముసాయిదా ప్రకారం తొలుత జరిపే 5 శాతం కేటాయింపు ప్రాజెక్టు కార్యకలాపాలు ప్రారంభించిన తర్వాత క్రమేపీ తగ్గుతుంది.
రుణం ఇచ్చిన తర్వాత వడ్డీ రేటు పెంచే హక్కు
అయితే ఈ ప్రతిపాదనలను వ్యతిరేకిస్తూ పరిశ్రమ వర్గాలు ప్రస్తుతం లాబీయింగ్ చేస్తున్న తరుణంలోనే ఎస్బీఐ లోన్ డాక్యుమెంట్‌లో ఈ క్లాజ్‌ను చేర్చడం గమనార్హం. ఆర్బీఐ నిబంధనల్లో ఎటువంటి మార్పులు వచ్చిన తాము అధికంగా జరిపే కేటాయింపుల ఫలితంగా పెరిగే వ్యయాల్ని బదిలీ చేస్తామని ఆ క్లాజ్‌లో ఎస్బీఐ పేర్కొన్నది. ఈ క్లాజ్‌తో ఒక నిర్దేశిత రేటుతో రుణం మంజూరైనా ఆ రేటును పెంచే హక్కు బ్యాంక్‌కు లభిస్తుంది.






