ఓవర్సీస్ స్కాలర్‌షిప్‌ల పెంపు?
హైదరాబాద్, మే 26 (విజయక్రాంతి): విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థుల సంఖ్య ఏటా పెరుగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న విదేశీ విద్యా పథకానికి ఏటా దరఖాస్తులు పెరుగుతూనే ఉన్నాయి. దీంతో ఇప్పుడున్న విద్యార్థుల పరిమితిని పెంచాలని ప్రభుత్వం భావిస్తోంది. విదేశాల్లో ఉన్నత చదవు కోసం వెళ్లే పేద విద్యార్థులకు ప్రభుత్వం విదేశీ విద్యానిధి పథకం కింద రూ.20 లక్షల ఉపకార వేతనం ఇస్తున్నది. ఈ పథకం కోసం ఏటా వేలమంది దరఖాస్తు చేసుకుంటున్నారు. అయితే పరిమిత బడ్జెట్ దృష్ట్యా వందల్లోనే ఎంపిక చేయాల్సి ఉండటం.. రాజకీయ నాయకులు, ప్రజా సంఘాల ఒత్లిళ్లతో నిజంగా అర్హులైన అభ్యర్థులను ఎంపికచేయటం కష్టంగా మారుతోంది. దీనిని గమనించిన ప్రభుత్వం విదేశీ విద్యా నిధి కింద ఎక్కువ మందికి ఉపకార వేతనాలు ఇవ్వాలని ఆలోచిస్తున్నట్టు సమాచారం.
పలు శాఖల నుంచి విదేశీ విద్యా అవకాశాలను పెంచాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు కూడా వచ్చాయి. బీసీ సంక్షేమ శాఖలో ప్రస్తుతం ఏటా 300 మందికి అవకాశం కల్పిస్తుండగా, కొత్తగా 3 వేల మందికి అవకాశం ఇవ్వాలని ప్రతిపాదనలు వచ్చినట్లు సమాచారం. ఎస్సీ సంక్షేమ శాఖ పరిధిలో 250 నుంచి 500 మందికి, మైనార్టీ శాఖలో 500 మంది నుంచి 1000 మంది వరకు అవకాశాలు పెంచాలని సంక్షేమ శాఖలు నివేదించాయి. పెంచిన ప్రతిపాదనలను ఈ మార్చి నుంచి జూన్ వరకు అమలు చేయాలని భావించినప్పటికీ లోక్‌సభ ఎన్నికల కోడ్ రావడంతో నిలిచిపోయిందని అధికారులు చెప్పారు. జూన్ 4న ఎన్నికల ఫలితాలు రాగానే కోడ్ ముగుస్తుంది. ఆ వెంటనే విదేశీ విద్యా నిధి పథకం లబ్దిదారుల సంఖ్య పెంపుపై ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.
భారీగా పెరిగిన దరఖాస్తులు
విదేశీ విద్యానిధి పథకం కింద అర్హులైన విద్యార్థులకు సంక్షేమ శాఖలు రూ.20 లక్షల ఉపకార వేతనం మంజూరు చేయడంతో పాటు విమాన ఖర్చులను కూడా భరిస్తున్నాయి. విదేశీ విశ్వవిద్యాలయాల్లో ప్రవేశాలు పొందిన వారికి తొలి ప్రాధాన్యం ఇస్తున్నారు. ఈ పథకం ప్రవేశపెట్టినప్పుడు దరఖాస్తులు తక్కువగా వచ్చాయి. గత రెండేళ్లుగా భారీ సంఖ్యలో దరఖాస్తులు వస్తున్నాయి. దీంతో లబ్ధిదారులను ఎంపిక చేయడం కష్టంగా మారింది. దరఖాస్తుల దారుల మార్కులు, ఇంగ్లిష్‌లో ప్రావీణ్యం, చదవాలనుకుంటున్న కోర్సు, వెళ్లే దేశం తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని దరఖాస్తులను వడపోస్తున్నారు. సంక్షేమశాఖలవారీగా రాష్ట్రస్థాయి కమిటీలు ఇంటర్వ్యూలు నిర్వహించి అభ్యర్థులను ఎంపిక చేస్తున్నాయి. మహాత్మా జ్యోతిబాపూలే విదేశీ విద్యా పథకం కింద బీసీ విద్యార్థులు, అంబేద్కర్ ఓవర్సీస్ పథకం కింద ఎస్సీ, ఎస్టీలతో పాటు మైనార్టీ విద్యార్థుల నుంచి వేలాదిగా వచ్చిన దరఖాస్తుల వడపోత జరుగుతుందని సంబంధిత అధికారులు చెప్తున్నారు.






