జీడీపీ డేటా, ఎగ్జిట్ పోల్స్‌పై దృష్టి
న్యూఢిల్లీ, మే 26: లోక్‌సభ ఎన్నికల తదుపరి దశ పోలింగ్, ఈ వారం వెలువడే క్యూ4 జీడీపీ డేటా, వారాంతంలో వెల్లడయ్యే ఎగ్జిట్ పోల్స్‌పై రానున్న రోజుల్లో ఇన్వెస్టర్లు దృష్టిపెడతారని, ఆయా అంచనాలకు అనుగుణంగా జరిగే కొనుగోళ్లు, అమ్మకాలు ఈ వారం ఈక్విటీ మార్కెట్ ట్రెండ్‌ను నిర్దేశిస్తాయని విశ్లేషకులు చెపుతున్నారు. ఎన్నికల సీజన్ కారణంగా ఇన్వెస్టర్లు జాగ్రత్త వహిస్తారని, దీంతో మార్కెట్ ఒడిదుడుకులు కొనసాగుతాయని భావిస్తున్నారు. మే 24తో ముగిసినవారంలో స్టాక్ సూచీలు కొత్త రికార్డుస్థాయిల వద్ద ముగిసాయి. కార్పొరేట్ల ఫలితాలు అంచనాలకు మించి ఉండటం, విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు తగ్గడం, దేశీయ సంస్థలు అదేపనిగా కొనుగోళ్లు జరపడం, ఆర్బీఐ కేంద్ర ప్రభుత్వానికి రూ.2.11 లక్షల కోట్లు భారీ డివిడెండు చెల్లించాలన్న నిర్ణయం తదితర అంశాలు రికార్డుర్యాలీకి పురికొల్పాయి.
వారం మొత్తంమీద సెన్సెక్స్ 1,404 పాయింట్లు (1.89 శాతం), నిఫ్టీ 455 పాయింట్లు (2 శాతం) చొప్పున పెరిగాయి. ఎగ్జిట్ పోల్స్, ఎన్నికల ఫలితాలు వెలువడే సమయం దగ్గరపడుతున్నందున మార్కెట్ తీవ్ర హెచ్చుతగ్గులకు లోనయ్యే అవకాశం ఉన్నప్పటికీ, సెంటిమెంట్ పాజిటివ్‌గానే కొనసా గుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ వారం కొంతమేర ఒడిదుడుకులు ఏర్పడినా క్రమేపీ మార్కెట్ అప్‌మూవ్ చేస్తుంద ని మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రిటైల్ హెడ్ సిద్దార్థ్ ఖెమ్కా చెప్పారు. ఇండియా, యూఎస్ జనవరి జీడీపీ గణాంకాలు, మే నెలలో జరిగిన ఆటో అమ్మకాల డేటా, చివరి విడత కార్పొరేట్ ఫలితా లు, ఎగ్జిట్ పోల్స్ ఈ వారం మార్కెట్‌కు ప్రధానాంశాలని విశ్లేషకులు తెలిపారు.
లోక్‌సభ ఎన్నికలు
లోక్‌సభ ఎన్నికల ఆరోదశ పోలింగ్ ముగిసినందున, జూన్ 1న జరిగే చివరిదశ పోలింగ్‌పై మార్కెట్ దృష్టినిలుపుతుంది. ఇప్పటివరకూ జరిగిన అన్ని దశల్లోకెల్లా 6వ దశ పోలింగ్‌లో 59.46 శాతం అతితక్కువ ఓటింగ్ నమోదయ్యింది. జూన్ 1న మొత్తం 57 లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి. అదే రోజు సాయంత్రం పలు ఏజెన్సీలు నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్ వెల్లడికానున్నాయి.






