7 July, 2026 | 9:17 PM

గిరిజన తండాల్లో ఘనంగా సీత్ల భవాని పండుగ వేడుకలు

07-07-2026 08:02 PM

కోనరావుపేట,(విజయక్రాంతి): కోనరావుపేట మండలంలోని వివిధ గిరిజన తండాల్లో మంగళవారం సీత్ల భవాని పండుగను గిరిజనులు అత్యంత భక్తిశ్రద్ధలతో, ఘనంగా నిర్వహించారు. ప్రకృతిని ఆరాధించే ఈ సంప్రదాయ పండుగను "దాటుడు" అని కూడా పిలుస్తారు. ప్రతి సంవత్సరం పెద్ద పూసల కార్తిలో వచ్చే మంగళవారం ఈ వేడుకలను నిర్వహించడం ఆనవాయితీ. 

ఈ సందర్భంగా లైవ్ రాష్ట్ర ఇంచార్జ్ నరేష్ నాయక్ మాట్లాడుతూ... పాడి పశువులు ఆరోగ్యంగా ఉండాలని, సమృద్ధిగా వర్షాలు కురవాలని, పంటలు బాగా పండాలని, ప్రజలందరూ ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షిస్తూ సీత్ల భవాని పండుగను నిర్వహిస్తారని తెలిపారు. ఈ సందర్భంగా తుల్జా భవానీ, మెరమ్మ భవానీ, సీత్ల భవాని, హింగ్లజ్, మంత్రాల్, ద్వాల్ అంగల్ తదితర సప్త భవానీలను ప్రత్యేకంగా పూజించారు.ఈ వేడుకల్లో తండా పెద్దలు, మహిళలు, యువతులు, చిన్నారులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించి సంప్రదాయ ఆచారాలను పాటించారు. పండుగ సందర్భంగా తండాల్లో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.