మైత్రి కుదిరేనా?
ముదిరి పాకాన పడిన పర్సంటేజీ వివాదం
ఎగ్జిబిటర్లు, నిర్మాతల చర్చలు కొలిక్కి రాని వైనం
‘జెట్లీ’ చిత్రానికి నైజాంలో చేదు అనుభవం
మల్టీఫెక్స్‌ల్లోనూ సినిమా ప్రదర్శనకు నిరాకరణ
తెలుగు చిత్ర పరిశ్రమలో ఎగ్జిబిటర్లు, నిర్మాతల మధ్య రెవెన్యూ షేరింగ్ పద్ధతిపై తీవ్ర వివాదం ముదిరిపాకాన పడింది. సింగిల్ స్క్రీన్ థియేటర్ల మనుగడ కష్టమవుతోందని, పాత రెంటల్ సిస్టమ్ బదులు పర్సంటేజీ పద్ధతిని అమలు చేయాలని తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ డిమాండ్ చేస్తోంది.
‘యాక్టివ్ తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్’ ఈ ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటే పర్సంటేజీ సిస్టమ్ పాటించే థియేటర్లకు తమ సినిమాలను ఇవ్వబోమని వారు హెచ్చరించారు. థియేటర్ యాజ మాన్యాలు ప్రతిపాదించిన కొత్త మోడల్ ప్రకారం వసూళ్లలో వాటాలు.. మొదటి వారంలో నిర్మాత/డిస్ట్రిబ్యూటర్ 60%, ఎగ్జిబిటర్ 40%, రెండో వారంలో నిర్మాత 50%, ఎగ్జిబిటర్ 50%, మూడో వారం నిర్మాత 40%, ఎగ్జిబిటర్ 60% ఉంటాయి.
వివాదాలు.. వాయిదాలు
ఈ పర్సంటేజీ ఇష్యూ ప్రధానంగా డిస్ట్రిబ్యూటర్లు, ప్రొడ్యూసర్ల మధ్య ఘర్షణకు దారితీస్తోంది. నష్టాలు వచ్చినప్పుడు ప్రొడ్యూసర్లు పర్సంటేజీలు తగ్గించాలని, డిస్ట్రిబ్యూటర్లు తమ పెట్టుబడిని రక్షించాలని కోరుతూ ఇటీవల పలు చిత్రాల విషయంలో వివాదాలు, వాయిదాలు చోటుచేసుకున్నాయి. ఛాంబర్ ఆఫ్ కామర్స్ దీనిపై చర్చలు జరుపుతోంది.
కొత్త నిబంధన కోసం డిస్ట్రిబ్యూటర్లు పట్టు
ఇటీవల భారీ బడ్జెట్ చిత్రాల విషయంలో ముందుగా కుదుర్చుకున్న పర్సంటేజీ ఒప్పందాలు వర్కవుట్ కాకపోవడంతో డిస్ట్రిబ్యూటర్లు నష్టపోతున్నారు. దీంతో ప్రొడ్యూసర్లపై ఒత్తిడి తెస్తున్నారు. డిస్ట్రిబ్యూటర్ల సమస్యలను పరిష్కరించేందుకు ఫిలిం ఛాంబర్, దిల్ రాజు వంటి అగ్ర నిర్మాతలు చర్చలు జరుపుతున్నారు. పర్సంటేజీల పద్ధతిలో మార్పులు తీసుకురావాలని యోచిస్తున్నారు.
కొన్ని సినిమాలు రిలీజ్‌కు ముందు పర్సంటేజీ వివాదాల వల్ల వాయిదా పడుతున్నాయి. లాభాల్లో వాటాపై కొత్త నిబంధనలు తీసుకురావాలని డిస్ట్రిబ్యూటర్లు పట్టుబడుతున్నారు. పర్సంటేజీల విషయంలో థియేటర్ల యజమానులు కూడా నష్టపోతున్నామని, వారానికి ఒకలా కాకుండా, సినిమా ప్రదర్శనను బట్టి వాటాలు ఉండాలని కోరుతున్నారు. ఈ ఇష్యూ ప్రస్తుతం టాలీవుడ్‌లో నిర్మాతలు, పంపిణీదారుల మధ్య ప్రధాన చర్చనీయాంశంగా మారింది.
కొలిక్కి వచ్చేనా?
థియేటర్ యాజమాన్యాలు ‘పర్సంటేజ్’ పద్ధతిని కోరుతుంటే, మైత్రీ మూవీ మేకర్స్ వంటి నిర్మాతలు దీనిని వ్యతిరేకిస్తూ రెంటల్ సిస్టమ్‌కే మొగ్గు చూపుతున్నారు. సింగిల్ స్క్రీన్ థియేటర్ల నిర్వహణ ఖర్చులు పెరగడం వల్ల అద్దె ప్రాతిపదికన నడపడం కష్టమని, అందుకే పర్సంటేజ్ పద్ధతిని కోరుతున్నామనేది ఎగ్జిబిటర్ల చెప్తున్న మాట. ఈ చర్యను మైత్రీ మూవీ మేకర్స్ ‘ఆర్మ్-ట్విస్టింగ్’ (బలవంతం చేయడం)గా అభివర్ణించారు.
మల్టీప్లెక్సులతో సంబంధం లేని సమస్యను అక్కడ కూడా సినిమా ఆపడం అన్యాయమని పేర్కొన్నారు. ఈ వివాదం కారణంగా గతంలో మే 1 నుంచి తెలంగాణ వ్యాప్తంగా సింగిల్ స్క్రీన్ థియేటర్లను బంద్ చేస్తామని కూడా హెచ్చరించారు. ఈ వివాదం వల్ల ప్రొడ్యూసర్ గిల్డ్ సపోర్ట్ ఉన్న సినిమాలపై ప్రభావం పడుతోంది. ఈ సమస్య వల్లే జెట్లీ వంటి సినిమాలు కొన్ని థియేటర్లలో ప్రదర్శనకు నోచుకోలేదు. మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో విడుదలైన ఈ ‘జెట్లీ’ సినిమాను ప్రదర్శించడానికి అనేక థియేటర్ల యాజమాన్యాలు నిరాకరించాయి.
కొత్త పద్ధతిని వ్యతిరేకించిన మైత్రీ మూవీ మేకర్స్ పంపిణీ చేస్తున్న ‘జెట్లీ‘ చిత్రాన్ని హైదరాబాద్‌లోని ప్రముఖ మల్టీప్లెక్సులైన ఏఎంబీ సినిమాస్, ట్రిపుల్ ఏ సినిమాస్‌తోపాటు ఏసియన్ సినిమాస్ నెట్‌వర్క్‌లోని పలు థియేటర్లు ప్రదర్శించలేదు. రాష్ట్ర రాజధానిలోని శ్రీరాములు, గోకుల్, హైటెక్ వంటి సుమారు 23 ప్రధాన సింగిల్ స్క్రీన్లు ఏప్రిల్ నుంచి ఈ పద్ధతిని ప్రారంభించగా, ఇతర ఎగ్జిబిటర్లు కూడా అదే బాటలో నడవాలని భావిస్తున్నారు.
ఈ వివాదం కారణంగా వేసవి సీజన్‌లో పెద్ద సినిమాల విడుదలలు తగ్గిపోయాయి. మైత్రీ మూవీ మేకర్స్ వంటి పెద్ద నిర్మాణ సంస్థల సినిమాలపై కూడా దీని ప్రభావం పడుతోంది. మల్టీప్లెక్సులకు ఈ వివాదంతో సంబంధం లేకపోయినా, కొన్నిచోట్ల సినిమాల ప్రదర్శన నిలిచిపోయింది. ప్రస్తుతం రెండు వర్గాల మధ్య చర్చలు జరుగుతున్నాయి. మే మొదటి వారంలో దీనిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.
‘జెట్లీ’ చిత్ర ప్రదర్శనకు ఎగ్జిబిటర్ల నిరాకరణ
ఇటీవల ‘జెట్లీ’ సినిమా ప్రదర్శనకు నైజాంలోని థియేటర్ యాజమాన్యాలు నిరాకరించాయి. తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ (టీఎఫ్‌సీసీ), యాక్టివ్ ప్రొ డ్యూసర్స్ గిల్డ్ మధ్య రెవెన్యూ షేరింగ్ పద్ధతిపై భేదాభి ప్రాయాలు రావడంతో ఈ వివాదం మొదలైంది. దీంతో ఏషియన్ చైన్, ఎస్‌వీసీ కంట్రోల్‌లో ఉన్న థియేటర్లు, హైదరాబాద్‌లోని పలు సింగిల్ స్క్రీన్లతో పాటు ఏఎంబీ, ట్రిపుల్ ఏ వంటి కొన్ని మల్టీప్లెక్స్ యాజ మాన్యాలు ఈ సినిమాను ప్రదర్శించడానికి నిరాక రించాయి.






