16 July, 2026 | 12:15 PM

హెచ్‌సీఎల్ టెక్ కంపెనీలో షాకింగ్ ఘటన

16-07-2026 12:12 PM

- 5వ అంతస్తు నుంచి దూకి సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఆత్మహత్య

శేరిలింగంపల్లి,(విజయక్రాంతి): హైదరాబాద్‌లోని ఐటీ హబ్‌లో మరో విషాద ఘటన చోటుచేసుకుంది. రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలోని హెచ్‌సీఎల్ టెక్ కంపెనీలో ఐదో అంతస్తు నుంచి దూకి సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. మృతుడు అవినాష్ గా గుర్తించారు. నెల్లూరు జిల్లా గురవాడ మండలానికి చెందిన అవినాష్, గతంలో బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా పనిచేశాడు.

రెండు నెలల క్రితం మాత్రమే హైదరాబాద్‌లోని హెచ్‌సీఎల్ టెక్ కంపెనీలో ఉద్యోగంలో చేరాడు. ఆత్మహత్యకు ముందు అవినాష్ తన భార్యకు ఫోన్ చేసి లాగౌట్ అయ్యాను..ఇంటికి వస్తున్నానని చెప్పినట్లు తెలుస్తోంది. అనంతరం కంపెనీ లాబీలో కొంతసేపు ఒంటరిగా నిలబడి ఆలోచిస్తున్న దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో నమోదయ్యాయి. ఆ తర్వాత ఐదో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అవినాష్ తన భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి కూకట్‌పల్లిలో నివసిస్తున్నాడు.

కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా జనరల్ ఆసుపత్రికి తరలించారు.ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు అన్ని కోణాల్లో విచారణ చేపట్టారు. ఉద్యోగ ఒత్తిడి, వ్యక్తిగత సమస్యలు లేదా ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అని పరిశీలిస్తున్నారు. సీసీటీవీ ఫుటేజ్‌ను కూడా ఆధారంగా తీసుకొని దర్యాప్తు ముమ్మరం చేశారు.ఈ ఘటనపై హైదరాబాద్ ఐటీ రంగంలో మానసిక ఆరోగ్యం, ఉద్యోగ ఒత్తిడి అంశాలపై మళ్లీ చర్చ జరుగుతోంది. సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు మానసిక ఒత్తిడిని తగ్గించేందుకు కంపెనీలు మెరుగైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.