06-02-2026 02:11:47 AM
హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 10 గ్రాముల పసిడి రూ.1,59,680
కిలో వెండి రూ.3 లక్షలు
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 5: బంగారం, వెండి ధరలు.. భారీగా పతనమయ్యాయి. మంగళ, బుధవారాల్లో పెరిగిన ఈ రెండింటి ధరలు గురువారం మళ్లీ తగ్గి, కొనుగోలుదారులకు ఊరట కలిగించాయి. అంతర్జాతీయ అనిశ్చితి పరిస్థితుల ప్రభావం వల్ల గత రెండ్రోజులు పెరిగిన బంగారం, వెండి ధరల్లో తాజాగా మళ్లీ లాభాల స్వీకరణ జరుగుతున్నట్టు తెలుస్తోంది. దీంతో మళ్లీ ఈ లోహాల ధరలు దిగువకు పడిపోతున్నాయి. ఈ నేపథ్యంలో గురువారం హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,59,680 పలికింది.
నిన్నటి ధరతో పోల్చుకుంటే ఏకంగా రూ.6,600 తగ్గింది. ఇక, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,41,550కి చేరింది. నిన్నటి ధరతో పోల్చుకుంటే రూ.4,600 పడిపోయింది. ఇక, దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రేటు రూ.1,59,870కి చేరుకోగా, 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.1,42,700కి చేరుకుంది. ఇక, వెండి ధర కూడా భారీగా పడిపోయింది. మంగళ, బుధవారాల్లో భారీగా పెరిగిన వెండి గురువారం మళ్లీ రూ.3 లక్షలకు వచ్చేసింది.
నిన్నటి ధరతో పోల్చుకుంటే కిలోకు ఏకంగా రూ.30 వేల మేర తగ్గిపోయింది. హైదరాబాద్‌లో, దేశరాజధాని ఢిల్లీలో కిలో వెండి ధర ప్రస్తుతం రూ.3 లక్షలుగా ఉంది. అంతర్జాతీయ స్థాయిలో కూడా బంగారం, వెండి ధరలు కాస్త తగ్గాయి. ఔన్స్ పసిడి ధర 4,919 డాలర్లు, ఔన్సు వెండి ధర 79 డాలర్లుగా నడుస్తోంది. మల్టీ కమొడిటీ మార్పిడిలో మార్చి డెలివరీ కాంట్రాక్టుకు వెండి దాదాపు 7శాతం తగ్గి, కిలో వెండి రూ.2.49లక్షల వద్ద ఆగింది. ఏప్రిల్ డెలివరీలకు పసిడి ధర స్వల్పంగా పెరిగి 10 గ్రాముల ధర రూ.1.53 లక్షలకు చేరింది.