ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం ఏది?
సీఎం పర్యటనలో పే పెండింగ్ పనులు ప్రారంభించాలి
సిరిసిల్లకు మరిన్ని ప్రత్యేక నిధులు విడుదల చేయాలి
మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళా డిమాండ్
రాజన్న సిరిసిల్ల,(విజయక్రాంతి): ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి(CM Revanth Reddy) ఈ నెల 30న సిరిసిల్ల పర్యటనకు రానున్న నేపథ్యంలో పట్టణంలో నిలిచిపోయిన అభివృద్ధి పనులను వెంటనే ప్రారంభించాలని మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళా(Chairperson Jindam Kala) ప్రభుత్వాన్ని కోరారు. సోమవారం సిరిసిల్ల మున్సిపల్(Sircilla Municipality) కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు.
ఇవి కూడా చదవండి: ఇందిరమ్మ మోడల్ హౌస్ పూర్తి చేయాలి
కాంగ్రెస్ ప్రభుత్వం(Congress government) ఏర్పడి దాదాపు మూడేళ్లు కావస్తున్నా జిల్లా కేంద్రమైన సిరిసిల్లకు ప్రత్యేకంగా నిధులు కేటాయించలేదని ఆమె విమర్శించారు. గత ప్రభుత్వ హయాంలో పట్టణ అభివృద్ధి కోసం మంజూరైన రూ.40 కోట్ల టీయూఎఫ్ఐడీసీ నిధులతో వివిధ వార్డుల్లో సీసీ రోడ్లు, మురుగునీటి కాలువలు తదితర పనులకు టెండర్లు పూర్తయ్యాయని తెలిపారు. అయితే ప్రభుత్వం మారిన తర్వాత ఆ పనులు నిలిచిపోయాయని ఆమె పేర్కొన్నారు.
ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం ఏది?
సిరిసిల్ల పట్టణంలోని ముంపు ప్రాంతాలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు కొత్త చెరువు నుంచి శ్రీనగర్ కాలనీ మీదుగా వరద నీటి ప్రవాహ కాలువ నిర్మాణానికి గత ప్రభుత్వం రూ.15 కోట్ల ప్రత్యేక నిధులు మంజూరు చేసిందని జిందం కళా తెలిపారు. అయితే ఈ పనులకు ఇప్పటివరకు టెండర్ ప్రక్రియ ప్రారంభం కాలేదని చెప్పారు.
ప్రభుత్వం ఏర్పడిన ప్రారంభంలోనే మున్సిపల్ పాలకవర్గ సభ్యులతో కలిసి ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్(Government Whip Aadi Srinivas)ను కలిసి పెండింగ్ అభివృద్ధి పనులకు అనుమతులు, నిధులు మంజూరు చేయాలని కోరినట్లు ఆమె తెలిపారు. అయినప్పటికీ ఇప్పటివరకు ఆశించిన స్థాయిలో స్పందన రాలేదని అన్నారు.
పక్కనే ఉన్న వేములవాడ మున్సిపాలిటీకి ప్రత్యేక నిధులు కేటాయిస్తున్నప్పటికీ జిల్లా కేంద్రమైన సిరిసిల్లకు నిధుల విషయంలో ప్రాధాన్యత ఇవ్వకపోవడంపై ఆమె అభ్యంతరం వ్యక్తం చేశారు. నిలిచిపోయిన పనులకు నిధులు విడుదల చేసి త్వరితగతిన పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ సమావేశంలో మున్సిపల్ వైస్ చైర్మన్ దార్ల సందీప్, విప్ బుర్ర మల్లికార్జున్, కోఆప్షన్ సభ్యులు నంది శంకర్, సయ్యద్ సోహెల్, పలువురు కౌన్సిలర్లు పాల్గొన్నారు.