16 July, 2026 | 1:08 AM

రాజన్న ఆలయ ఉద్యోగుల సామర్థ్యానికి సిటా శిక్షణ దోహదం

16-07-2026 12:54 AM

వేములవాడ, జూలై 15 (విజయ క్రాంతి): రాజన్న ఆలయ భక్తులకు నాణ్యమైన సేవలు అందించాలంటే ఆలయ ఉద్యోగులకు ఆగమ శాస్త్రాలు, ఆలయ సంప్రదాయాలు, పరిపాలనా విధానాలపై పూర్తి అవగాహన ఉండాలని వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఎల్ రమాదేవి అన్నారు. తెలంగాణ దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలోని స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెంపుల్ అడ్మినిస్ట్రేషన్ (సిటా) నిర్వహించిన మూడు రోజుల శిక్షణ కార్యక్రమం బుధవారం ముగిసింది.

ఈ సందర్భంగా ఈవో రమాదేవి మాట్లాడుతూ ఉద్యోగులు ఈ శిక్షణలో నేర్చుకున్న అంశాలను విధి నిర్వహణలో అమలు చేసి భక్తులకు మరింత మెరుగైన సేవలు అందించాలనీ, ఆలయ సంప్రదాయాలు, శైవాగమ శాస్త్రాల పరిరక్షణతో పాటు పారదర్శక పరిపాలనకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. ఇలాంటి శిక్షణలు ఉద్యోగుల నైపుణ్యాలను పెంపొందించి, దేవస్థానం సేవల నాణ్యతను మరింత మెరుగుపరుస్తాయని పేర్కొన్నారు.

అనంతరం శిక్షణ పూర్తిచేసిన సుమారు 100 మంది దేవాదాయ శాఖ ఉద్యోగులకు ఈవో రమాదేవి శిక్షణ ధ్రువీకరణ పత్రాలను అందజేశారు. జూలై 13 నుంచి 15 వరకు నిర్వహించిన ఈ శిక్షణలో ఆలయ సంస్కృతి, శైవాగమం, దేవాలయ పరిపాలన, పూజా విధానాలు, గో సంరక్షణ, సామాజిక ఆడిట్ తదితర అంశాలపై నిపుణులు శిక్షణ అందించారు. కార్యక్రమంలో అసిస్టెంట్ కమిషనర్ సుప్రియ, డీఈవో నవీన్ కుమార్, ఈఈ రాజేష్, ఆలయ అధికారులు, అర్చకులు, వేద పండితులు పాల్గొన్నారు.