ఊరికి దూరంగా రైతువేదికలు
దొంగల పాలవుతున్న సామాగ్రి
అధికారుల పర్యవేక్షణ కరువు
మంచిర్యాల, జూలై 15 (విజయక్రాంతి): బీఆర్‌ఎస్ ప్రభుత్వం రైతులకు అన్ని రకాలుగా ప్రయోజనం చేకూర్చేందుకు క్లస్టర్ (ఐదు వేల ఎకరాలకు) ఒక రైతు వేదిక చొప్పున జిల్లాలో 55 క్లస్టర్లకు 55 రైతు వేదికలు నిర్మించింది తప్ప వాటిని పెద్దగా వినియోగించలేకపోయింది.
రైతులకు వాటి ద్వారా మరింత సేవలు అందుబాటులోకి తేవడానికి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కసరత్తు చేసి రైతు వేదికలను దృశ్య, శ్రవణ(వీడియో కాన్ఫరెన్స్) కేంద్రాలుగా మార్చింది. వీటి ద్వారా రైతులకు శాస్త్ర సాంకేతిక పరిఙ్ఞానంతో పాటు నిరంతరం ఉన్నతాధికారుల సూచనలు, సలహాలు, ప్రభుత్వ సంక్షేమ పథకాలు, శాస్త్రవేత్తలతో పంటలపై అవగాహన కల్పించడానికి వీలుగా రైతు వేదికలను దృశ్య, శ్రవణ కేంద్రాలుగా తీర్చిదిద్దింది. పైలెట్ ప్రాజెక్టుగా నియోజక వర్గానికి ఒక రైతు వేదికను ఎంపిక చేసి రైతులకు ఉపయోగకరంగా ఉండటంతో పెంచారు.
రైతులకు ఉపయోగకరమైన సమాచారం...
రైతు వేదికలలో రైతులకు ఉపయోగపడే వ్యవసాయ, అనుబంధ రంగాల సమాచారాన్ని అందించారు. రైతులకు వ్యవసాయ, ఉద్యాన, పట్టు, మల్బరీ, మత్స్య, పశుసంవర్ధక, విద్యుత్, నీటిపారుదల శాఖలకు సంబంధించిన అన్ని ప్రభుత్వ పథకాలు, వివిధ సమాచారం అందించడం మొదలు పెట్టారు. సాగులో మెలకువలు, శాస్త్ర సాంకేతిక పద్దతులు తెలిసేలా వీడియో, ఆడియోల ద్వారా వివరించారు.
ప్రభుత్వం ప్రవేశపెడుతున్న రైతు భరోసా, రైతు భీమా, రుణమాఫీ, పంటరుణాలు, రాయితీ వివరాలు తెలుసుకోవడానికి తహసీల్దార్ కార్యాలయంలో ఉండే వీడియో కాన్ఫరెన్స్ మాదిరి రైతులకు ఇది ఉపయోగపడింది. దీని కోసం ఒక్కో రైతు వేదికకు రూ. 3.75 లక్షలు వెచ్చించి 125 కుర్చీలు, రెండు టేబుళ్లు, 8 పెద్ద కుర్పీలు, ఒక మైక్సెట్, కంప్యూటర్ సీపీ యూ, మానిటర్, నెట్ వర్క్ పరికరాలు తదితర ఆడియో, వీడియోకు అవసరమైన సా మగ్రి కొనుగోలు చేసింది. రైతులకు అవసరమైన శిక్షణలు ఇచ్చేందుకు వారానికి రెండు సార్లు (మంగళ, శుక్రవారాలు) కార్యక్రమాలు నిర్వహిస్తుంది.
దొంగల పాలవుతున్న సామాగ్రి...
జిల్లాలో మొత్తం 55 రైతు వేదికలు ఉండగా వీటిలో ఎక్కువ శాతం గ్రామాలకు దూరంగానే ఉన్నాయి. వీటిలో 43 రైతు వేదికల్లో మాత్రమే దృశ్య, శ్రవణ (వీడియో కాన్ఫరెన్స్) కేంద్రాలను ఏర్పాటు చేశారు. వీటికి ఎలాంటి భద్రత కూడా లేదు.
జిల్లాలో లక్షెట్టిపేట, వెంకట్రావుపేట, సూరారం, ద్వారక, ముత్యంపేట, గూడెం, సీతారాంపల్లి, గుడిపేట, ర్యాలీ(ముల్కల్ల), దొనబండ, జన్నారం, చింతగూడ, తిమ్మాపూర్, కిష్టంపేట, అంగ్రాజుపల్లి, శివలింగాపూర్, ఇందారం, జైపూర్, కుందారం, భీమారం, మందమర్రి, బొక్కలగుట్ట, కోటపల్లి, దేవులవాడ, మల్లంపేట, ఆవుడం, నెన్నెల, జోగాపేట్, కన్నెపల్లి, జన్కాపూర్, మెట్ పల్లి, వేమనపల్లి, నీల్వాయి, భీమిని, రాంపూర్, కేస్లాపూర్, కన్నాల, గురిజాల, ముత్యంపల్లి, ధర్మరావుపేట, కొత్తపల్లి, రేచిని, కిష్టంపేట గ్రామాల్లోని రైతు వేదికలలో వీడియో కాన్ఫరెన్స్ సౌకర్యాలు కల్పించారు.
చాలా వరకు ఆర్వీలు గ్రామాలకు దూరంగా ఉండి, భద్రత లేకపోవడం, ఆర్వీల తలుపులు చెడిపోయి ఉండ టంతో వస్తువులు దొంగలపాలవుతున్నాయి. వీటి విషయంలో సంబంధిత శాఖ అధికారులు ఏమాత్రం పట్టించుకోకపొవడంతో సామాగ్రి దొంగలెత్తుకెళ్లారా? సిబ్బందే అమ్ముకున్నారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికైనా అధికారులు అన్ని రైతు వేదికలను పరిశీలించి దొంగలపాలు కాకుండా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది.






