మహిళా సాధికారతతోనే సమాజాభివృద్ధి
గజ్వేల్, జూన్ 24: మహిళల సాధికారతతోనే కుటుంబం, గ్రామం, సమాజం సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుందని జాలిగామ గ్రామ సర్పంచ్ తాళ్ల సునీత ఆంజనేయులు గౌడ్ అన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం జాలిగామ గ్రామంలో ‘మహిళా స్నేహపూర్వక గ్రామం’ నిర్మాణంలో భాగంగా బుధవారం ప్రత్యేక మహిళా సభను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ సునీత, పంచాయతీ కార్యదర్శి అజారుద్దీన్ మాట్లాడుతూ మహిళలు విద్య, ఉపాధి, స్వయం ఉపాధి రంగాలతో పాటు కుటుంబ, సామాజిక, రాజకీయ నిర్ణయాల్లోనూ కీలక పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు.
సమాజంలో ఇంకా కొనసాగుతున్న స్త్రీ–పురుష వివక్షను పూర్తిగా నిర్మూలించాల్సిన అవసరం ఉందన్నారు. మహిళలు అన్ని రంగాల్లో ముందంజలో నిలిచి తమ ప్రతిభను చాటుకోవాలని, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని సూచించారు. జాలిగామ గ్రామాన్ని మహిళలకు మరింత సురక్షితమైన, అనుకూలమైన గ్రామంగా తీర్చిదిద్దేందుకు గ్రామ ప్రజలు, ప్రజాప్రతినిధులు, మహిళా సంఘాలు సమిష్టిగా కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ కొమురయ్య, వార్డు సభ్యులు, చిట్యాల ఎల్లం, మంకిడి కరుణాకర్, నాయక మనోహర్, రసముల కర్ణాకర్, నాని, గ్రామ ప్రజాప్రతినిధులు, మహిళా సంఘాల ప్రతినిధులు, అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆశా వర్కర్లు మరియు గ్రామ మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.






