calender_icon.png 19 September, 2025 | 2:39 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సాఫ్ట్‌వేర్ గేమ్!

19-09-2025 01:01:54 AM

ఓట్ చోరీ కంటిన్యూస్..

ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌తో ఓట్ల తొలగింపు

హైడ్రోజన్ బాంబ్ వేరే ఉంది 

లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ

అలంద్‌లో 6వేల పైచిలుకు ఓట్లు తొలగించారు

  1. నకిలీ లాగిన్లు, ఫోన్ నంబర్ల ఉపయోగం 
  2. ప్రతిపక్షాలకు మద్దతిచ్చే వారి ఓట్లే లక్ష్యంగా తొలగింపులు 
  3. మా వద్ద 100% రుజువులున్నాయి
  4. ఎన్నికల సంఘం ప్రజాస్వామ్య హంతకుల్ని రక్షిస్తోంది
  5. కర్ణాటక సీఐడీ 18 నెలల్లో 18 లేఖలు రాసినా.. ఈసీ నుంచి స్పందన కరువు:రాహుల్
  6. రాహుల్ ఆరోపణలు నిరాధారమన్న ఈసీ 
  7. భారత్‌ను మరో నేపాల్‌లా చూడాలని రాహుల్ గాంధీ అనుకుంటున్నారు: బీజేపీ

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 18: నకిలీ లాగిన్స్, నకిలీ ఫోన్ నంబర్స్, సాఫ్ట్‌వేర్ ఉపయోగించి ఓటర్ ఐడీలను తొలగించారని లోక్ సభలో ప్రతిపక్షనేత, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. గురువా రం కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) తీరు ను తీవ్రంగా విమర్శిస్తూ ఆరోపణలు గుప్పించారు. ఢిల్లీలో జరిగిన మీడియా సమావేశంలో ఓట్ల చోరీకి సంబంధించిన పలు అంశాల గురించి సుదీర్ఘ వివరణ ఇచ్చారు.

రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. ‘సాఫ్ట్‌వేర్ ఉపయోగించి ఓట్ల తొలగింపునకు పాల్పడుతున్నారు. ప్రతిపక్షాలకు ఓట్లు వేసే వారినే లక్ష్యంగా చేసుకుంటున్నారు. ఈ తొలగింపు ప్రక్రియకు సంబం ధించి 100 శాతం ఆధారాలు గుర్తించాం. తొలగింపునకు సంబంధించి.. అన్ని ఆధారాలు మీ ముందుంచా. ఇక దీనిపై ఎలా స్పందించాలనేది మీ చేతుల్లోనే ఉంది. భారత ప్రజాస్వామ్య హంతకులను ప్రధా న ఎన్నికల కమిషన్ జ్ఞానేశ్ కుమార్ కాపాడుతున్నారు.

కర్ణాటకలోని అలంద్‌లో ఆరువేల పైచిలుకు ఓట్లను తొలగించేందుకు ప్రయత్నించారు. 2023 ఎన్నికల సందర్భంగా అలంద్ నియోజకవర్గంలో ఎన్ని ఓట్లు తొలగించారో మాకైతే తెలియదు. 6,018 ఓట్ల కంటే ఎక్కువే ఓట్లు తొలగించారు కానీ ఈ 6,018 ఓట్లను తొలగిస్తున్న సందర్భంలో అనుకోకుండా పట్టుబడ్డారు. తన బంధువు ఓటుని తొలగించినట్టు ఓ బీఎల్‌వో గుర్తించారు. తన సహచరులే తొలగించినట్టు ఆమె గుర్తిం చి.. ఎందుకు తొలగించారని వారిని అడ గ్గా.. మేము ఎటువంటి ఓట్లు డిలీట్ చేయలేదని వారు తెలిపారు.

ఆరోపణలు ఎదు ర్కొంటున్న వ్యక్తికి, ఓటు కోల్పోయిన వ్యక్తికి దీని గురించి ఏమీ తెలియదు. ఇంకెవరో వ్యవస్థను హైజాక్ చేసి ఓట్లు తొల గించారు. దేశ వ్యాప్తంగా లక్షల మంది ఓట్లను ఒక క్రమపద్ధతిలో తొలగిస్తున్నారు. ప్రతిపక్షాలకు ఓటు వేసే దళితులు, గిరిజనులు, మైనారిటీలు, ఓబీసీలను టార్గెట్ చేసుకున్నారు. ప్రస్తుతం మా వద్ద ఓట్ల తొలగింపునకు సంబంధించిన 100 శాతం ఆధారాలున్నాయి. 

నేను ఈ వేదిక మీది నుంచి 100 శాతం నిజాలే చెబుతున్నాను. దేశాన్ని, రాజ్యాంగాన్ని ప్రేమించే వ్యక్తులలో నేనూ ఒకడిని. ప్రజాస్వామ్య ప్రక్రియను నేను ఇష్టపడతాను. ఆ ప్రక్రియను రక్షించేందుకు పాటుపడతా. ఆధారాలు లేకుండా నేను ఏమీ మాట్లాడటం లేదు.

అలంద్ నియోజకవర్గంలోని ఓట్ల తొలగింపుపై కర్ణాటక సీఐడీ విచారణ ప్రారంభించి.. ఈసీ నుంచి వివరాలు కోరగా.. ఎటువంటి వివరాలు ఇవ్వలేదు. సీఐడీ 18 నెలల కాలంలో ఈసీకి 18 లేఖలు రాసినా స్పందన లేదు. నేను ఈ దేశ యువతకు ఒక్కటే విషయం చెప్పదలచుకున్నా. ప్రజాస్వామ్య హంతకులను ఈసీ రక్షిస్తోంది’ అని ఆరోపణలు గుప్పించారు. 

రాహుల్‌వి తప్పుడు ఆరోపణలు: ఈసీ

రాహుల్ గాంధీవి తప్పుడు, నిరాధార ఆరోపణలని ఎన్నికల సంఘం కొట్టిపారేసింది. ‘సంబంధిత వ్యక్తికి సమాచారం ఇవ్వకుండా ఏ ఒక్కరి ఓటు తొలగించడం లేదు. ఆన్‌లైన్‌లో ఓట్ల తొలగింపు అసాధ్యం. 2023లో అలంద్ నియోజకవర్గంలో ఓటర్ల తొలగింపుకు అనేక ప్రయత్నాలు జరిగాయి. ఆ వ్యవహారంపై దర్యాప్తు కోసం ఫిర్యాదు చేశాం. అలంద్ అసెంబ్లీ నియోజకవర్గంలో 2018లో బీజేపీ అభ్యర్థి గెలవగా.. 2023లో కాంగ్రెస్ అభ్యర్థి గెలిచారు’ అని ఈసీ తెలిపింది.  

ఆరోపణలు కాంగ్రెస్ ఆభరణాలు: బీజేపీ

ఆరోపణలు కాంగ్రెస్ పార్టీకి ఆభరణాల్లాంటివని బీజేపీ నేతలు విమర్శించారు. బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్ మాట్లాడుతూ.. ‘ఇటువంటి ఆరోపణలు చేయడం కాంగ్రెస్ పార్టీకి ఒక అలవాటుగా మారింది. ఈసీ ఎటువంటి పక్షపాతం లేకుండా పని చేస్తోంది. ప్రజాస్వామ్యాన్ని బలహీనపరచడంలో రాహుల్ తలమునకలై ఉన్నారు. తప్పుడు ఆరోపణలతో పౌరులను తప్పుదోవ పట్టిస్తూ భారత్‌లో బంగ్లాదేశ్, నేపాల్ వంటి పరిస్థితులను సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారు’ అని విమర్శించారు. రాహుల్ గాంధీ దేశంలోని ఓటర్లను అవమానిస్తున్నారని కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఆరోపించారు. 

వారమే గడువు 

కేంద్ర ఎన్నికల సంఘానికి రాహుల్ గాంధీ తుది గడువు విధించారు. ఓట్ల తొలగింపుకు సంబం ధించిన ఫారాలను వారంలోపు రిలీజ్ చేయాలని సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌ను డిమాండ్ చేశారు. ‘వేర్వేరు రాష్ట్రాలకు చెందిన ఫోన్ నంబ ర్లను ఉపయోగించి ఓట్లు తొలగించారు. ఓట్ల తొలగింపు ఫారాలను నింపినట్టు చెబుతున్న వ్యక్తులు ఎన్నడూ ఆ ఫారం నింపలేదు. ఈ ఫిల్లింగ్ అనేది సాఫ్ట్‌వేర్ ద్వారా ఆటోమేటిగ్గా జరిగింది.

వివిధ రాష్ట్రాలకు చెందిన ఫోన్ నంబర్లు ఉపయోగించి అలంద్ నియోజకవర్గంలోని ఓట్లు తొలగించారు. కాంగ్రెస్ ఓటర్లనే టార్గె ట్ చేసి తొలగించారు. ఓట్ల తొలగిం పు కోసం ఫేక్ లాగిన్స్ క్రియేట్ చేశారు. కాంగ్రెస్ గెలిచే బూత్స్‌లో ఓటర్లను తొలగించారు. గోడాబాయి అనే మహిళ పేరు మీద ఫేక్ లాగిన్ క్రియేట్ చేసి 12 ఓట్లను తొలగించేందుకు ప్రయత్నించారు. కర్ణాటకతో పాటు మహారాష్ట్ర, హర్యానా, ఉత్తర్‌ప్రదేశ్‌లో కూడా పెద్ద ఎత్తున ఓట్లను తొలగించారు.

ప్రజాస్వామ్యాన్ని హత్య చేసే వారిని కాపాడడం సీఈసీ ఆపేయాలి. ఇది హైడ్రోజన్ బాంబు కాదు. హైడ్రోజన్ బాంబును త్వరలో ప్రయోగిస్తా’ అని తెలిపారు. ఓటర్ అధికార్ యాత్రలో భాగంగా ఓట్ చోరీ గురించి ఆధారాలతో సహా వివరించి.. త్వరలోనే హైడ్రోజన్ బాంబు వేస్తానని చెప్పిన తర్వాత ప్రధాని దేశానికి ముఖమే చూపించలేదని రాహుల్ గాంధీ ఆరోపించారు.