7 August, 2026 | 10:33 PM

బాలల కోసం ప్రత్యేక గ్రామసభ.

07-08-2026 09:53 PM

ములకలపల్లి,(విజయక్రాంతి): ములకలపల్లి మండలం జగన్నాధపురంలో సర్పంచి కుంజ వినోద్ అధ్యక్షతన శుక్రవారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో బాలసభ  నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాలలో విద్యార్థులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు, బోధనా తీరు, సిబ్బంది కొరత, తాగునీటి సమస్యలు ఇతర అంశాలపై విద్యార్థుల నుండి వినతులను స్వీకరించారు. పాఠశాల ముగిసిన అనంతరం రాత్రి సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని విద్యార్థులు సర్పంచ్ దృష్టికి తీసుకువచ్చారు.

దీనిపై సానుకూలంగా స్పందించినటువంటి సర్పంచ్ వినోద్ ములకలపల్లి ఎస్సై మధుప్రసాద్ తో సెల్ ఫోన్ లో  మాట్లాడి రాత్రి సమయంలో పాఠశాల వద్ద పెట్రోలింగ్ ఏర్పాటు చేయాలని కోరారు. అనంతరం ఆయన విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ విద్యార్థి దశలోనే నాయకత్వ లక్షణాలు పెంపొందించుకుంటూ సమస్యలను గుర్తించడం, వాటి పరిష్కారాల కోసం గ్రామసభ దృష్టికి తీసుకురావడం అభినందనీయం అన్నారు.

విద్యార్థులకు గుర్తించినటువంటి సమస్యలను సత్వరమే పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు. ఇకపై పంచాయతీలు నిర్వహించే గ్రామ సభలో విద్యార్థులు కూడా పాల్గొనాలని తెలియజేశారు. గ్రామస్థాయిలో ఉన్నటువంటి సమస్యలను కూడా గుర్తించి తన దృష్టికి తీసుకొని రావాలన్నారు.    ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ మాధవి, పంచాయతీ కార్యదర్శి సురేష్, పాఠశాల హెచ్ఎం, వెంకట నరసమ్మ ఉపాధ్యాయులు,CH రామాచారి కురం రామకృష్ణ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా పూనెం వెంకటేష్  తదితరులు పాల్గొన్నారు.