ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ విజయవంతం చేయాలి
కౌన్సిలర్ సిద్ధ తిరుపతి
సుల్తానాబాద్,(విజయక్రాంతి): కేంద్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా చేపట్టిన ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్‌ఐఆర్ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని పూసాల పదమూడవ వార్డులో కౌన్సిలర్ సిద్ధ తిరుపతి ఆధ్వర్యంలో ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా వార్డు ప్రజలకు ఓటరు నమోదు, పేర్ల సవరణ, చిరునామా మార్పు, కొత్త ఓటర్ల నమోదు, మరణించిన లేదా ఇతర ప్రాంతాలకు మారిన వారి వివరాల తొలగింపు వంటి అంశాలపై అవగాహన కల్పించారు. ఎన్నికల సంఘం నిర్దేశించిన నిబంధనల మేరకు ప్రతి అర్హులైన పౌరుడు తమ వివరాలను సక్రమంగా నమోదు చేసుకోవాలని,
అందుకు అవసరమైన ఎన్యుమరేషన్ ఫారాలను పూర్తిగా నింపి సంబంధిత అధికారులకు అందజేయాలని కౌన్సిలర్ సిద్ధ తిరుపతిసూచించారు.ఓటరు జాబితా ప్రజాస్వామ్య వ్యవస్థకు పునాది అని పేర్కొన్న ఆయన, ప్రతి కుటుంబం ఈ ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకుని తమ ఓటు హక్కును పరిరక్షించుకోవాలని కోరారు. ఎన్నికల సంఘం చేపట్టిన ఈ కార్యక్రమానికి ప్రజలు సంపూర్ణ సహకారం అందించి, అర్హులైన ప్రతి ఒక్కరి పేరు ఓటరు జాబితాలో ఉండేలా బాధ్యతగా వ్యవహరించాలని విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో వార్డు ప్రజలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, బూత్ లెవల్ అధికారులు బీఎల్‌ఓలు, ఎన్నికల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు..






