అసంఘటిత రంగ కార్మికుల సంక్షేమానికి ప్రత్యేక చట్టాలు రావాలి
సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి నరాటి ప్రసాద్
భద్రాద్రికొత్తగూడెం, మార్చి 23, (విజయక్రాంతి): కార్మిక హక్కుల రక్షణకు ఐక్య పోరాటాలే శరణ్యమని, ప్రభుత్వాల కార్మిక వ్యతిరేక విధానాలను ఐక్యంగా తిప్పికొట్టాలని సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా పిలుపునిచ్చారు. సోమవారం పట్టణంలోని ఏఐటీయూసీ జిల్లా కార్యాలయం ‘శేషగిరిభవన్’లో ఏఐటీయూసీ జిల్లా కౌన్సిల్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాల వల్ల కార్మికులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
బ్రిటీష్ కాలం నుండి పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను కేంద్ర ప్రభుత్వం 4 లేబర్ కోడ్లుగా మార్చి కార్మికులను బానిసలుగా మారుస్తోందని విమర్శించారు. అసంఘటిత రంగ కార్మికులకు సామాజిక భద్రత కల్పించడంలో పాలకులు నిర్లక్ష్యం వహిస్తున్నారని, కనీస వేతనం అమలు కావడం లేదని ధ్వజమెత్తారు. ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి నరాటి ప్రసాద్* మాట్లాడుతూ ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్ శక్తులకు ధారాదత్తం చేయడాన్ని అడ్డుకోవాలని, కార్మిక శ్రేణులు రాజకీయాలకు అతీతంగా ఏకతాటిపైకి రావాలని కోరారు.
పెరిగిన ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలని, పెండింగ్లో ఉన్న కార్మిక సమస్యలను తక్షణమే పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. భవిష్యత్ కార్యాచరణలో భాగంగా చలో అసెంబ్లీ, కలెక్టరేట్ ముట్టడి వంటి కార్యక్రమాలను విజయవంతం చేయాలని శ్రేణులకు దిశా నిర్దేశం చేశారు. ఏఐటీయూసీ జాతీయ, రాష్ట్ర, జిల్లా, మండల స్థాయి మహాసభలకు ఏఐటీయూసీ నాయకులు, కార్యకర్తలు సిద్ధం కావాలని కోరారు. సమావేశంలో ఏఐటీయూసీ జిల్లా నాయకులు కంచర్ల జమలయ్య, కందుల భాస్కర్, దేవరకొండ శంకర్, వంగ వెంకట్, జి వీరాస్వామి, గెడ్డాడు నగేష్, గొనె మని, వేల్పుల మల్లికార్జున్, ఎండి నజీర్ అహ్మద్, పిట్టల రాంచందర్ తదితరులు పాల్గొన్నారు.




