భద్రాద్రి క్లస్టర్ స్థాయి క్రీడా ఎంపికలు ప్రారంభం
టేకులపల్లి,(విజయక్రాంతి): టేకులపల్లి మండలం బద్దుతండాలోని ఎకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్(Eklavya Model Residential School)లో భద్రాద్రి క్లస్టర్ స్థాయి క్రీడా ఎంపికలు బుధవారం ప్రారంభమయ్యాయి. మూడు రోజుల పాటు జరిగే ఈ ఎంపికలకు ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య(Koram Kanakayya) ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులు, పాఠశాల సిబ్బంది ఎమ్మెల్యేకు స్వాగతం పలికారు.క్రీడలు విద్యార్థుల్లో క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, పట్టుదల, నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తాయని ఎమ్మెల్యే అన్నారు.
చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించి ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లోని విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసి జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీలకు తీర్చిదిద్దడమే ఎంపికల లక్ష్యమన్నారు. ఈ కార్యక్రమంలో టేకులపల్లి ఎస్ఐ తిరుపతి, కాంగ్రెస్ నాయకులు కోరం సురేందర్, ఈది గణేష్, మోకాళ్ళ పోశాలు, సర్దార్, కోయగూడెం సర్పంచ్ కోరం సుభాష్ చంద్రబోస్ తదితరులు పాల్గొన్నారు.