నడిపిన సభలోనే నిలిచిన శ్రీపాద

08-09-2026 | 05:30am

కొన్ని పేర్లు చరిత్రలో నిలిచిపోతాయి.. మరికొన్ని పేర్లే చరిత్రకు గౌరవం తెస్తాయి. మాజీ స్పీకర్ దివంగత దుద్దిళ్ల శ్రీపాదరావు(Duddilla Sripada Rao) అలాంటి అరుదైన ప్రజానాయకుడు. ప్రజల కష్టాలను తనవిగా భావించి శాసనసభలో గళమెత్తిన ఆయన.. సభా నిబంధనలను ఆయుధంగా, ప్రజాస్వామ్యాన్ని బాధ్యతగా భావించి స్పీకర్ పదవికి ప్రత్యేక గౌరవం తెచ్చారు. ఒకప్పుడు తన నిష్పాక్షిక నిర్ణయాలతో సభను నడిపించిన ఆ నాయకుడి పేరు ఇప్పుడు అదే శాసనసభలోని నూతన సెంట్రల్ హాల్‌కు పెట్టడం ఆయన ప్రజా జీవితానికి లభించిన చారిత్రక గౌరవం.

ఇది ఒక హాల్‌కు పేరు పెట్టిన కార్యక్రమం మాత్రమే కాదు.. ప్రజల కోసం పలికిన గొంతుకు, ప్రజాస్వామ్య విలువలను కాపాడిన వ్యక్తిత్వానికి, శాసనసభా సంప్రదాయాలను గౌరవించి న నాయకత్వానికి లభించిన శాశ్వత గుర్తింపు. ఒకప్పుడు స్పీకర్ కుర్చీలో కూర్చొని సభను నడిపించిన శ్రీపాదరావు.. ఇప్పుడు అదే సభలోని సెంట్రల్ హాల్ ద్వారా ప్రతి రోజూ గుర్తుకు రానున్నారు.

ప్రజల మధ్య పుట్టిన ప్రజా నాయకత్వం

1937 నవంబర్ 6న దుద్దిళ్ల రాధాకృష్ణయ్య, కమలాభాయి దంపతులకు జన్మించిన శ్రీపాదరావు బీఎస్సీ, ఎల్‌ఎల్‌బీ విద్యను అభ్యసించారు. స్వగ్రామం ధన్వాడ నుంచే ప్రజాసేవకు శ్రీకారం చుట్టారు. వరుసగా మూడుసార్లు ఏకగ్రీవ సర్పంచ్ గా ఎన్నికై గ్రామ ప్రజల నమ్మకాన్ని పొందారు. గ్రామస్థాయి నుంచి ప్రారంభమైన ఆయన ప్రజా ప్రస్థానం.. మంథని భూ తనఖా బ్యాంక్ చైర్మన్, మహాదేవ్‌పూర్ సమితి ఉపాధ్యక్షుడి వరకు సాగింది. ప్రజల మధ్య పనిచేసిన అనుభవం.. వారి కష్టాల ను దగ్గరగా చూసిన అనుభూతి.. తర్వాతి రాజకీయ జీవితానికి బలమైన పునాదిగా మారాయి.

మంథని నుంచి శాసనసభకు

1983లో తొలిసారి మంథని నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన శ్రీపాదరావు(Sripada Rao).. 1984, 1989 ఎన్నికల్లోనూ విజయాలు సాధించారు. కాంగ్రెస్ లెజిస్లేటివ్ పార్టీ విప్‌గా, రీజినల్ టొబాకో బోర్డు సభ్యుడిగా, పలు శాసనసభా కమిటీల్లో కీలక బాధ్యతలు నిర్వహించారు. ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో తన నియోజకవర్గ సమస్యలతో పాటు ఉత్తర తెలంగాణ ప్రాంత ప్రజల ఇబ్బందులను శాసనసభలో ప్రస్తావించారు. పదవులు ఆయన రాజకీయ జీవితాన్ని పరిచయం చేస్తే.. ప్రజల కోసం ఆయన పలికిన మాటలు ఆయన వ్యక్తిత్వాన్ని పరిచయం చేస్తాయి.

స్పీకర్ కుర్చీకి కొత్త గౌరవం

1991 ఆగస్టు 19న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్‌గా శ్రీపాదరావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 1995 జనవరి 11 వరకు ఆ పదవిలో కొనసాగారు. స్పీకర్ కుర్చీని ఆయ న అధికారానికి ప్రతీకగా చూడలేదు. అది ప్రజాస్వామ్యానికి అప్పగించిన బాధ్యతగా భావించారు. సభా నిబంధనలను క్షుణ్ణంగా అధ్యయనం చేసిన ఆయన రూల్‌బుక్‌ను తన నిర్ణయాలకు ప్రాతిపదికగా చేసుకున్నారు. అధికార పక్షం, ప్రతిపక్షం అనే తేడా లేకుండా సభా నియమాలకు ప్రాధాన్యం ఇచ్చారు. పాయింట్ ఆఫ్ ఆర్డర్, రూలింగ్స్ విషయంలో ఆయన తీసుకున్న నిర్ణయాలు శాసనసభా వ్యవహారాల్లో ప్రత్యేక ముద్రవేశాయి. ప్రతిపక్ష సభ్యు ల హక్కులను గౌరవిస్తూ.. సభా గౌరవాన్ని కాపాడుతూ వ్యవహరించిన నిష్పాక్షిక స్పీకర్‌గా ఆయన పేరు నిలిచిపోయింది.

ప్రజల గుండె చప్పుడు

శ్రీపాదరావు శాసనసభలో మాట్లాడినప్పుడు ఆయన ముందున్నది రాజకీయ ప్రత్యర్థి కాదు.. ప్రజల సమస్య. గోదావరి పరీవాహక ప్రాంత రైతుల సాగునీటి సమస్యలు, ఉత్తర తెలంగాణ కరువు పరిస్థితులు, దళితబహుజన, పేద వర్గాల ఆవేదన, నిరుద్యోగం, నక్సలిజం సమస్యలు వంటి అనేక అంశాలను ఆయన సభ ముందుంచారు. ఆయన ప్రసంగాల్లో ఆవేశం ఉండే ది.. కానీ దాని వెనుక అధ్యయనం ఉండేది. ప్రశ్నించడంలో పదును ఉండేది.. కానీ ఆ ప్రశ్న వెనుక ప్రజా ప్రయోజనం ఉండేది. అందుకే ఆయన ప్రసంగాలు కేవలం రాజకీయ ప్రసంగాలుగా కాకుండా.. ఆ కాలం ప్రజల జీవన సమస్యలకు అద్దం పట్టిన శాసనసభా దస్తావేజులుగా నిలిచాయి.

ప్రజల పక్షాన శ్రీపాద వాణి

శ్రీపాదరావు శాసనసభా ప్రసంగాలు ఇప్పుడు ‘ప్రజల పక్షాన శ్రీపాద వాణి’ పేరుతో గ్రంథరూపంలోకి వస్తున్నాయి. ఎమెస్కో ప్రచురణగా రూపొందుతున్న ఈ సంకలనం ఆయన శాసనసభా ఆలోచనలు, ప్రజా సమస్యలపై ఆయన దృక్పథం, సభా వ్యవహారాలపై ఆయనకున్న పట్టు వంటి అంశాలను భవిష్యత్ తరాలకు అందించనుంది. మైకు దొరికిన వెంటనే ఎంత గట్టిగా మాట్లాడామన్నది కాదు.. మాట వెనుక ఎంత విషయ పరిజ్ఞానం, ఎంత ప్రజా ప్రయోజనం ఉందన్నదే ముఖ్యమని ఆయన ప్రసంగాలు నేటి తరానికి చెబుతున్నాయి.

అర్ధరాత్రి తలుపు తట్టినా..

ప్రజా జీవితంలో ఎంతటి ఉన్నత పదవులు చేపట్టినా.. సామాన్యుడికి దూరం కాకపోవడం శ్రీపాదరావు ప్రత్యేకత. అర్ధరాత్రి తలుపు కొట్టినా స్పందించే నాయకుడు అన్న విశ్వాసం ఆయనకు ప్రజల్లో ఉండేది. మంథనితో ఆయనకున్న అనుబంధం కేవలం రాజకీయ సంబంధం కాదు.. ఆత్మీయ బం ధం. సతీమణి జయశ్రీ, నలుగురు కుమారులు, ఇద్దరు కుమార్తెలతో కూడిన కుటుంబంలో మంథనితో ఉన్న ఆత్మీయ బంధాన్ని చివరివరకు శ్రీపాదరావు వీడలేదు. 1999 ఏప్రిల్ 13న 62వ ఏట నక్సలైట్ల చేతిలో ఆయన హత్యకు గురయ్యారు. జీవితం అర్ధాంతరంగా ముగిసినా.. ప్రజలతో ఆయనకున్న అనుబంధం, ప్రజాస్వామ్యంపై ఆయనకున్న నిబద్ధత, శాసనసభలో ఆయన వేసిన ముద్ర మాత్రం కాలంతో చెరిగిపోలేదు.

తండ్రి బాటలో తనయుడు

దివంగత మాజీ స్పీకర్ దుద్దిళ్ల శ్రీపాదరావు చూపిన ప్రజాసేవా బాటలోనే మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ముందుకు సాగుతున్నారు. శ్రీధర్‌బాబు ప్రస్తుతం రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రిగా వ్యవహరిస్తున్నారు. తండ్రి నుంచి వారసత్వంగా వచ్చిన పదవి మాత్రమేకాదు.. ప్రజల పట్ల నిబద్ధత, సౌమ్యమైన వ్యవహారశైలి, విషయ పరిజ్ఞానంతో కూడిన నాయకత్వాన్ని తన రాజకీయ ప్రస్థానంలో కొనసాగిస్తున్నారు. శ్రీపాదరావు ప్రజల సమస్యలను శాసనసభలో బలంగా వినిపించినట్లే.. శ్రీధర్‌బాబు కూడా ప్రజా సమస్యలకు ప్రాధాన్యమిస్తూ అభివృద్ధి, పాలనలో తనదైన ముద్ర వేస్తున్నారు.

తండ్రి ఆశయాలను ముందుకు తీసుకెళ్లడమే లక్ష్యంగా రాజకీయాల్లోకి వచ్చిన శ్రీధర్‌బాబు ‘తండ్రికి తగ్గ తనయుడు’ అనే గుర్తింపును నిలబెట్టుకుంటున్నారు. ఇప్పుడు తెలంగాణ శాసనసభలోని నూతన సెంట్రల్ హాల్‌కు దుద్దిళ్ల శ్రీపాదరావు పేరు పెట్టడం ఆయన సేవలకు లభించిన అపూర్వ గౌరవం. శాసనసభను నడిపించిన వ్యక్తి పేరు.. అదే శాసనసభలోని కీలక ప్రాంగణానికి చిరునామా కావడం అరుదైన సందర్భం.

ఇది కేవలం పేరు కాదు..

ప్రజల గొంతుకకు గౌరవం. నిష్పాక్షికతకు గౌరవం.శాసనసభా సంప్రదాయాలకు గౌరవం. ప్రజాస్వామ్య విలువలకు గౌరవం. ఒకప్పుడు స్పీకర్‌గా సభను నడిపించారు.. ఇప్పుడు అదే సభలో ఓ ప్రాంగణంగా నిలిచారు. మాటలతో ప్రజల మనసుల్లో నిలిచిన శ్రీపాదరావు.. ఇప్పుడు తన పేరుతో శాసనసభలో శాశ్వతంగా నిలిచారు. నడిపిన సభలోనే.. నిలిచిన పేరు శాసనసభకు శ్రీపాద గౌరవం.

- వ్యాసకర్త: జర్నలిస్టు, 9441884389

మరిన్ని వార్తలు