24 August, 2026 | 11:20 PM

జ్వరాల నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు

24-08-2026 08:52 PM

పాల్వంచ, (విజయక్రాంతి): పాల్వంచ మండలం ఉల్వనూర్ పీహెచ్‌సీ పరిధిలో ఇటీవల జ్వరంతో మరణం సంభవించిన నేపథ్యంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా. తుకారం రాథోడ్ సోమవారం తుమ్మలగూడెం పీహెచ్‌సీని సందర్శించారు. ఆరోగ్య శిబిరం, ఏఎల్‌ఓ, డ్రై డే కార్యక్రమాలను పరిశీలించి ప్రజలు, సర్పంచ్‌, వైద్య సిబ్బందితో మాట్లాడారు. జ్వర కేసులపై ఇంటింటి సర్వే నిర్వహించాలని, ప్రతి కేసును క్షుణ్ణంగా పరిశీలించాలని సిబ్బందిని ఆదేశించారు. తీవ్ర కేసులను వెంటనే ఉన్నత వైద్య కేంద్రాలకు, అవసరమైతే 108 ద్వారా తరలించాలని సూచించారు.

స్వల్ప జ్వర కేసులను ప్రతి నాలుగు గంటలకు పర్యవేక్షించాలని, పరిస్థితి విషమిస్తే తక్షణమే ఆస్పత్రికి తరలించాలని ఆదేశించారు.  గ్రామాల్లో ఏఎల్‌ఓ, డ్రై డే కార్యక్రమాలను పంచాయతీ సిబ్బంది సహకారంతో ప్రతిరోజూ నిర్వహించాలని, గర్భిణీల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. జ్వర కేసుల విషయంలో నిర్లక్ష్యం చేయకుండా అప్రమత్తంగా ఉండాలని ఆశ కార్యకర్తలకు ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు వైద్యాధికారి సిబ్బందికి సూచనలు చేశారు.