నేర్చుకున్న క‌ళ చ‌దువుకు భ‌రోసానిచ్చింది...!

13-09-2026 | 01:14am

జగ్గారెడ్డిని కలిస్తే సమస్య తీరుతుందని థ్రెడ్ ఆర్ట్ నేర్చుకున్న విద్యార్థిని

పది రోజులు కష్టపడి జ‌గ్గారెడ్డి చిత్ర‌ప‌టాన్ని త‌యారు చేసిన భ‌వాని

స‌మ‌స్య‌లో ఉన్న రెండున్న‌ర ఎక‌రాల భూమి ప‌రిష్కారానికి జ‌గ్గారెడ్డి హామీ

సంగారెడ్డి,(విజ‌య‌క్రాంతి): చదువుకోవాలనే తపనకు ఆర్థిక ఇబ్బందులు అడ్డొచ్చాయి. కుటుంబానికి ఉన్న రెండున్నర ఎకరాల భూమి సమస్యల్లో చిక్కుకోవడంతో చదువు కొనసాగించాలా? ఆపేయాలా? అన్న సందిగ్ధంలో పడింది రాయికోడ్ మండలం కప్పాడ్ గ్రామానికి చెందిన భ‌వాని. అయితే సమస్యను పరిష్కరించుకుని తన చదువును కొనసాగించాలనే పట్టుదలతో ముందడుగు వేసిన ఆమె కథలో కళ కూడా ఒక భాగమైంది. కప్పాడ్ గ్రామానికి చెందిన భ‌వాని మోడల్ స్కూల్‌(Bhavani Model School)లో చదువుకుంది. ప్రస్తుతం అసోసియేటెడ్ చార్టర్డ్ సర్టిఫైడ్ అకౌంటెంట్ కోర్సు చదువుతోంది. ఇప్పటికే ఫస్ట్ లెవల్ పూర్తి చేసింది.

అయితే కుటుంబ ఆర్థిక పరిస్థితులు అనుకూలించకపోవడంతో గత ఆరు నెలలుగా చదువుకు దూరంగా స్వగ్రామంలోనే ఉంటోంది. భ‌వాని కుటుంబానికి రెండున్నర ఎకరాల భూమి ఉంది. ముగ్గురు ఆడపిల్లలున్న కుటుంబంలో ఒకవైపు బీటెక్ పూర్తి చేసిన అక్క వివాహం, మరోవైపు తన చదువు కొనసాగించడం కోసం ఆ భూమే ప్రధాన ఆధారం. అయితే ఆ భూమి గత 12 సంవత్సరాలుగా వివాదంలో ఉండటంతో విక్రయించలేని పరిస్థితి ఏర్పడింది. సమస్య రెవెన్యూ అధికారుల వద్ద పెండింగ్‌లో ఉండటంతో కుటుంబం ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటోంది.

చదువు ఆపేయాలని తండ్రి సూచించినా…

ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ఇక చదువు మానేయాలని తండ్రి భ‌వానికి సూచించారు. కానీ చదువును మధ్యలోనే ఆపేయడం ఆమెకు ఇష్టం లేదు. భూమి సమస్య పరిష్కారమైతే వచ్చిన డబ్బుతో తన చదువును కొనసాగించవచ్చని భావించింది. తన సమస్యకు పరిష్కార మార్గం చూపగలరని భావించి టీపీసీసీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి(TPCC Working President Jagga Reddy)ని కలవాలని నిర్ణయించుకుంది. జగ్గారెడ్డిని కలిసినప్పుడు తనవంతుగా ఏదైనా బహుమతి ఇవ్వాలని అనుకుంది. చిన్నప్పటి నుంచే ఆర్ట్‌పై ఆసక్తి ఉన్నభ‌వాని, ఏదైనా ప్రత్యేకమైన కళను నేర్చుకుని స్వయంగా బహుమతి తయారు చేయాలని నిర్ణయించుకుంది. ఇందుకోసం ఇంటర్నెట్‌ ద్వారా ఫీజు చెల్లించి థ్రెడ్ ఆర్ట్ (ధారాలతో చిత్రం) తయారీని నేర్చుకుంది.

పది రోజుల పాటు శ్రమించి…

థ్రెడ్ ఆర్ట్ నేర్చుకున్న అనంతరం ఏకంగా పది రోజుల పాటు శ్రమించి జగ్గారెడ్డి చిత్రపటాన్ని రూపొందించింది. చిత్రం సిద్ధమైంది. కానీ దాన్ని జగ్గారెడ్డికి ఎలా అందించాలన్నది మరో ప్రశ్నగా మారింది. చివరకు తన గ్రామానికి చెందిన పరిచయస్తుల ద్వారా సంగారెడ్డి నియోజకవర్గ(Sangareddy Constituency) కాంగ్రెస్ నాయకులు చేర్యాల ఆంజనేయులు, చిమ్నాపూర్ ప్రకాష్, పాస్టర్ మోజెస్ లను సంప్రదించింది. వారి సహకారంతో శనివారం తల్లిదండ్రులతో కలిసి జగ్గారెడ్డిని కలిసే అవకాశం లభించింది. తాను పది రోజుల పాటు కష్టపడి రూపొందించిన థ్రెడ్ ఆర్ట్ చిత్రపటాన్ని జగ్గారెడ్డికి అందించింది.

చిత్రం వెనుక అసలు కథ తెలుసుకున్న జగ్గారెడ్డి..

భ‌వాని అందించిన చిత్రపటాన్ని స్వీకరించిన జగ్గారెడ్డి ఆమెతో ఆప్యాయంగా మాట్లాడి ఆర్ట్ ఎలా నేర్చుకుంది, ప్రస్తుతం ఏం చదువుతోంది తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం తన కుటుంబ పరిస్థితిని భ‌వాని వివరించింది. తల్లిదండ్రులకు ఉన్న రెండున్నర ఎకరాల భూమి వివాదంలో ఉందని, రెవెన్యూ అధికారుల వద్ద సమస్య పెండింగ్‌లో ఉందని తెలిపింది. ఆ భూమి సమస్య పరిష్కారమైతే తాను తిరిగి చదువును కొనసాగించి తన లక్ష్యాన్ని చేరుకుంటానని జగ్గారెడ్డికి వివరించింది.

భ‌వాని పరిస్థితిని తెలుసుకున్న జగ్గారెడ్డి స్పందిస్తూ, భూమి సమస్యపై కలెక్టర్‌తో మాట్లాడి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. చదువు మధ్యలో ఆగిపోకుండా ముందుకు సాగాలని భ‌వానిని ప్రోత్సహించారు. ఒక చిత్రపటం ఇచ్చేందుకు వచ్చిన భ‌వాని… తన జీవితానికి దారి చూపించే భరోసాతో తిరిగి వెళ్లింది. ఆమె చేతిలోని థ్రెడ్ ఆర్ట్ ఒక బహుమతే కావచ్చు. కానీ దాని వెనుక ఉన్న చదువుకోవాలనే తపన, కుటుంబాన్ని నిలబెట్టాలనే బాధ్యత, సమస్యను పరిష్కరించుకోవాలనే పట్టుదల ఈ కలయికను ప్రత్యేకంగా నిలిపాయి.

మరిన్ని వార్తలు