మత్తు పదార్థాలను తరిమికొడదాం
నేరస్తులను కాదు.. నేర ప్రేరేపితాలను అరికట్టాలి
ఇల్లెందు,(విజయక్రాంతి): విద్యార్థులు(Students), యువత జీవితాలను నాశనం చేస్తున్న మత్తు పదార్థాలను(drugs) సమాజం సమష్టిగా ఎదుర్కోవాలని PDSU రాష్ట్ర అధ్యక్షుడు కాంపాటి పృథ్వీ(PDSU State President Kampati Prithvi), PYL ఇల్లెందు డివిజన్ కార్యదర్శి వెలుగు శాంతారావు, కొమరారం సర్పంచ్ అజ్మీర బిచ్చ అన్నారు. PDSU, PYL ఆధ్వర్యంలో ఎల్లన్ననగర్ గ్రామపంచాయతీ పరిధిలోని తొంటబాలు తండాలో మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా విద్యార్థులు, యువకులతో ప్రదర్శన నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పట్టణాలతో పాటు గ్రామీణ ప్రాంతాలకు సైతం మత్తు పదార్థాలు చేరుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పాఠశాలలు, కళాశాలలు, బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు, సినిమా హాళ్ల పరిసరాల్లో అక్రమ విక్రయాలపై కఠిన నిఘా పెట్టాలని డిమాండ్ చేశారు. నేరస్తులను శిక్షించడం కంటే నేరాలకు ప్రేరేపిస్తున్న మత్తు పదార్థాల సరఫరా, విక్రయాలను అరికట్టడమే ప్రధానమని పేర్కొన్నారు. మత్తుకు బానిసైన యువతకు చికిత్స, కౌన్సెలింగ్, పునరావాసం కల్పించాలని కోరారు. యువతను విద్య, ఉపాధి, క్రీడలు, విజ్ఞానం వైపు నడిపించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.