సుహానా కోసం.. షారుక్

24-04-2024 12:10:00 AM

సూపర్‌స్టార్స్ వారసులు తెరపైకి వస్తున్నారంటే తల్లిదండ్రులుగా సదరు స్టార్స్‌కు బాధ్యత మరింత పెరుగుతుంది. ప్రస్తుతం షారుక్ ఖాన్ పరిస్థితీ ఇదే. ‘కింగ్’ సినిమాతో షారుక్ తనయ సుహానా ఖాన్ వెండితెరకి పరిచయం కానుంది. ‘కహాని’, ‘బద్లా’ వంటి థ్రిల్లర్ చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న సుజయ్ ఘోష్ ఈ సినిమాకి దర్శకత్వం వహించనున్నారు. ఈ చిత్రంలో సుహానాను ప్రధాన పాత్రలో నటింపజేసి, షారుక్‌చే అతిథి పాత్ర చేయించాలని తొలుత చిత్ర బృందం భావించారట. అయితే తర్వాత జరిగిన చర్చల మేరకు షారుక్ పాత్ర నిడివి పెంచి పూర్తి స్థాయిలో మలిచారు.

యాక్షన్ సన్నివేశాలకు సైతం ప్రాధాన్యత ఉండటం ఇందుకు మరో కారణంగా తెలుస్తుంది. మరోవైపు ఈ సినిమాలో షారుక్, తన కుమార్తె సుహానాకు ‘గురు’ తరహా పాత్రలో కనపడనున్నారని సమాచారం. ఆమె పాత్ర చుట్టూనే కథ ఉంటుందట. ఇవన్నీ ఒకెత్తయితే భారీ బడ్జెట్ చిత్రంతో షారుక్ తనయ అరంగేట్రం చేయనుండటం ఆసక్తికరంగా మారింది. సుమారు రెండు వందల కోట్ల నిర్మాణ వ్యయంతో రానున్న ఈ సినిమా 2025లో విడుదల కానుంది. ఆ బడ్జెట్‌కు న్యాయం చేయాలంటే షారుక్ ఉండాల్సిందేనంటున్నాయి బాలీవుడ్ వర్గాలు.