8 May, 2026 | 3:28 PM

ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసులో సుప్రీంకోర్టు నోటీసులు జారీ

04-03-2025 07:47 PM

న్యూఢిల్లీ,(విజయక్రాంతి): కాంగ్రెస్‌ పార్టీలోకి ఫిరాయించిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై  సుప్రీంకోర్టు మంగళవారం విచరణ చేపట్టింది. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై నిర్ణయం తీసుకోవడంలో అసెంబ్లీ స్పీకర్ జాప్యం చేశారని ఆరోపిస్తూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, పాడి కౌశిక్ రెడ్డి దాఖలైన పిటిషన్లపై విచారించిన ధర్మాసనం తెలంగాణ ప్రభుత్వం, అసెంబ్లీ కార్యదర్శి సహా ప్రతివాదులందరికి నోటీసులు జారీ చేసింది. అయితే కౌంటర్లు దాఖలు చేయడానికి ఇప్పటివరకు కోర్టు నుంచి ఎలాంటి నోటీసులు రాలేదని ప్రతివాదుల న్యాయవాదులు కోర్టు దృష్టికి తెచ్చారు. దీంతో ప్రతివాదుల వాదనలను సుప్రీంకోర్టు పరిగణనలోకి తీసుకుంది.

తదుపరి విచారణ తేదీకి ముందు రాష్ట్ర ప్రభుత్వం, స్పీకర్ అధికారి, తెలంగాణ శాసనసభ కార్యదర్శి, భారత ఎన్నికల సంఘం, ఫిరాయించిన శాసనసభ్యుల ప్రతిస్పందనలను ధర్మాసనం కోరింది. ఈనెల 22 లోపు నోటీసులకు కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ అగస్టిన్ మాహిస్ జార్జ్ లతో కూడిన ధర్మాసనం మార్చి 25కు వాయిదా వేసింది. రాష్ట్రంలో అధికార కాంగ్రెస్‌లో చేరిన ముగ్గురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అనర్హత వేటుపై తెలంగాణ హైకోర్టు నవంబర్ 2024లో ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ ఒక పిటిషన్ దాఖలైతే, మరొక పిటిషన్ పార్టీ ఫిరాయించిన మిగిలిన ఏడుగురు శాసనసభ్యులపై ఉంది.