18-02-2026 12:00:00 AM
ఢాకా, ఫిబ్రవరి17: బంగ్లాదేశ్‌లో కొత్త రాజకీయ అధ్యాయం మొదలైంది. దేశ 11వ ప్రధానమంత్రిగా బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్పీ) చైర్మన్ తారిక్ రెహ్మాన్ మంగళవారం ప్రమాణస్వీకారం చేశారు. ఇటీవల జరిగిన 13వ పార్లమెంటరీ ఎన్నికల్లో బీఎన్పీ ఘన విజయం సాధించడంతో ఆయన ప్రధాని పీఠాన్ని అధిష్టించారు. దాదాపు 35 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత బంగ్లాదేశ్‌కు ఒక పురుషుడు ప్రధాని కావడం విశేషం.
ఢాకాలోని జాతీయ పార్లమెంట్ సౌత్ ప్లాజాలో జరిగిన కార్యక్రమంలో బంగ్లాదేశ్ అధ్యక్షుడు మహమ్మద్ షహబుద్దీన్, తారిక్ రెహ్మాన్‌తో ప్రమాణం చేయించారు. ఆయనతో పాటు 50 మంది సభ్యుల మంత్రివర్గం కూడా ప్రమాణం చేసింది. ఈ కేబినెట్‌లో 25 మంది మంత్రులు, 24 మంది సహాయ మంత్రులు, ముగ్గురు టెక్నోక్రాట్లు ఉన్నారు. తొలిసారి ఎన్నికైన వారితో పాటు పలువురు కొత్త ముఖాలకు మంత్రివర్గంలో చోటు కల్పించారు.
అంతకుముందు, పార్లమెంట్ సభ్యులుగా బీఎన్పీకి చెందిన 209 మంది ఎంపీలు ప్రమాణం చేశారు. అయితే, రాజ్యాంగ సంస్కరణల మండలి ప్రమాణ పత్రంపై సంతకాలు చేయడానికి పార్టీ అధిష్ఠానం ఆదేశాల మేరకు వారు నిరాకరించారు. తాము కౌన్సిల్ సభ్యులుగా ఎన్నిక కాలేదని, అందుకే ఆ ప్రమాణాన్ని స్వీకరించబోమని బీఎన్పీ నేత సలావుద్దీన్ అహ్మద్ స్పష్టం చేశారు.
ప్రజలను మోసం చేస్తే వీధుల పోరాటమే: జమాతే ఇస్లామీ హెచ్చరిక
జూలై చార్టర్ ప్రకారం ప్రమాణ స్వీకారం చేయకపోతే ఆందోళనలు చేస్తామని జమాతే ఇస్లామీ, నేషనల్ సిటిజన్స్ పార్టీ (ఎన్‌సీపీ) హెచ్చరించాయి. తొలుత ప్రమాణ స్వీకారాన్ని బహిష్కరిస్తామని ప్రకటించినప్పటికీ, కూటమి భాగస్వామ్య పక్షాలు చివరకు విధుల్లోకి చేరాయి. ఫిబ్రవరి 12న జరిగిన ఎన్నికల్లో ఎంపీల ఎంపికతో పాటు ’జూలై చార్టర్’పై ప్రజాభిప్రాయ సేకరణ జరిగింది. జూలై చార్టర్‌కు 62 శాతం మంది ప్రజలు మద్దతు తెలిపారు.
ఈ చార్టర్ ప్రకారం ఎన్నికైన ఎంపీలు రాజ్యాంగ సంస్కరణల మండలిలో సభ్యులుగా ఉండాలి. పార్లమెంట్‌ను 180 రోజుల పాటు రాజ్యాంగ పరిషత్తుగా మార్చడం దీని ముఖ్య ఉద్దేశం. రాజ్యాంగ సంస్థల్లో సమూల మార్పులు చేసే అధికారం ఈ మండలికి ఉంటుంది. ఎన్నికల్లో బీఎన్పీ పార్టీ మూడింట రెండు వంతుల మెజారిటీ సాధించింది. అయితే రాజ్యాంగ సంస్కరణల మండలి సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేయడానికి బీఎన్పీ నిరాకరించింది.
చార్టర్ నిబంధనలపై తమకు అభ్యంతరాలు ఉన్నాయని ఆ పార్టీ సీనియర్ నేత సలావుద్దీన్ అహ్మద్ స్పష్టం చేశారు. తారిఖ్ రెహమాన్ సమక్షంలోనే ఈ నిర్ణయం ప్రకటించారు. ఈ పరిణామంతో జమాతే ఇస్లామీ, ఎన్సీపీ వర్గాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
కేవలం ఎంపీలుగా ప్రమాణ స్వీకారం చేసి, సంస్కరణల మండలిని విస్మరించడం ప్రజా తీర్పును అవమానించడమేనని జమాతే నేతలు మండిపడుతున్నారు. సంస్కరణలు లేని పార్లమెంటు అర్థరహితమని వారు భావిస్తున్నారు. ఎన్సీపీ నేతలు కూడా ఇదే వైఖరిని ప్రదర్శిస్తున్నారు. బీఎన్పీ ఎంపీలు ఇప్పటి వరకు రాజ్యాంగ పరిషత్తులో చేరలేదు.
‘సెవెన్ సిస్టర్స్’పై యూనస్ అక్కసు
ఇప్పటివరకు తాత్కాలిక ప్రభుత్వ సారథిగా ఉన్న మహమ్మద్ యూనస్ తన పదవి నుంచి వైదొలిగారు. ఈ సందర్భంగా దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. అయితే, అందులో ఆయన మరోసారి భారత వ్యతిరేక వైఖరిని ప్రదర్శించారు. మన ఈశాన్య రాష్ట్రాలైన ’సెవెన్ సిస్టర్స్ ను ప్రస్తావిస్తూ అక్కను వెళ్లగక్కారు. ‘విశాల సముద్రం మా దేశానికి కేవలం భౌగోళిక సరిహద్దు మా త్రమే కాదు ప్రపంచ ఆర్థికవ్యవస్థతో అనుసంధానం కావడానికి బంగ్లాదేశకు ఉన్న మార్గం అది.
నేపాల్, భూటాన్, సెవెన్ సిస్టర్స్లో కలిసి ఈ ప్రాంతం గొప్ప ఆర్థిక సామర్థ్యాన్ని కలిగిఉంది‘ అని యూనస్ తన ప్రసంగంలో వ్యాఖ్యానించారు. భారత్ పేరును ప్రస్తావించకుండా.. మన ఈశాన్య రాష్ట్రాలను బంగ్లాదేశ్ సబ్-రీజియన్‌గా పేర్కొనడం రెచ్చగొట్టే చర్యేనని స్పష్టమవుతోంది.
ఏకైక హిందూ మంత్రి నితాయ్ రాయ్ చౌదరి
ప్రధాని తారిఖ్ రెహమాన్ తన మంత్రివర్గంలో 25 మందికి చోటు కల్పించారు. ఈ కేబినెట్లో ఏకైక హిందూ ప్రతినిధిగా నితాయ్ రాయ్ చౌదరి బాధ్యతలు చేపట్టారు. ఆయనకు సాంస్కృతిక శాఖ బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది. నితాయ్ రాయ్ చౌదరి వృత్తిరీత్యా సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది.
ప్రస్తుతం బీఎన్పీ పార్టీ వైస్ చైర్మన్‌గా కొనసాగుతున్నారు. మగురా నియోజకవర్గం నుంచి ఆయన ఎంపీగా ఎన్నికయ్యారు. ఈ ఎన్నికల్లో జమాత్-ఏ-ఇస్లామీ అభ్యర్థిపై భారీ మెజారిటీతో విజయం సాధించారు. గతంలోనూ ఆయన వివిధ ప్రభుత్వాల్లో మంత్రిగా సేవలందించిన అనుభవం ఉంది.
భారత ప్రతినిధిగా లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా
భారత ప్రతినిధిగా లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ఈ వేడుకకు హాజరయ్యారు. విదేశీ వ్యవహారాల కార్యదర్శి విక్రమ్ మిస్రి కూడా ఆయనతో పాటు ఢాకా చేరుకున్నారు. తారిఖ్ రెహమాన్ ప్రభుత్వం రెండు దేశాల మధ్య సంబంధాలను, ప్రజాస్వామ్య విలువలను మరింత బలోపేతం చేస్తుందని ఓం బిర్లా ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ ముంబై పర్యటనలో ఉన్నందున ఓం బిర్లా భారత్ తరఫున ఈ కార్యక్రమానికి వెళ్లారు.